Travel Hardships Resolved తీరిన దారి కష్టాలు
ABN , Publish Date - May 28 , 2026 | 12:35 AM
Travel Hardships Resolved కూటమి ప్రభుత్వ చొరవతో పాలకొండకు కూతవేటు దూరంలో ఉన్న ఓని రహదారి నిర్మాణం పూర్తయింది. దీంతో ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏన్నో ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న దారి కష్టాలు తప్పాయని సంబరపడు తున్నారు.
గ్రామస్థుల హర్షం
పాలకొండ, మే27(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ చొరవతో పాలకొండకు కూతవేటు దూరంలో ఉన్న ఓని రహదారి నిర్మాణం పూర్తయింది. దీంతో ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏన్నో ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న దారి కష్టాలు తప్పాయని సంబరపడు తున్నారు. ఓని, గుడివాడ, స్కాట్‌దొరవలసలతో పాటు సీతంపేట మండలంలోని పలు గ్రామాలకు ఈ రోడ్డు కనెవిక్టీగా ఉంది. ఒకప్పుడు ఈ దారి పొడవునా గోతులు ఉండేవి. వర్షాకా లంలో చెరువును తలపించేది. బురదమయంగా మారడంతో గ్రామస్థులు రాకపోకలు సాగించ లేకపోయేవారు. దశాబ్దాల పాటు నానా అవస్థలు పడేవారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. గతంలో ఈ రోడ్డు నిర్మాణానికి ఏఐఐపీ నిధులు మంజూ రైనా నాటి వైసీపీ సర్కారు వాటిని వేరే అవసరాలకు మళ్లించింది. దీంతో ఓని గ్రామ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, స్థానిక ప్రజ్రాపతినిధులు ఈ విషయాన్ని కూటమి దృష్టికి తెచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లుంబూరు నుంచి ఓని గ్రామం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.74 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో పీఆర్ శాఖ ఆధ్వర్యంలో శరవేగంగా పనులు పూర్తయ్యాయి. ఒకప్పుడు రాళ్లు తేలి.. బురదతో ఉన్న మార్గం.. నేడు బీటీగా మారడంతో ఆ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ అంటికొండ, దిగువ అంటికొండ, వివిధ గ్రామస్థులకు రవాణా కష్టాలు తప్పాయని, సాఫీగా ప్రయాణించేలా చర్యలు చేపట్టిన కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని వారు చెబుతున్నారు.