Share News

Transporting... Stockpiling... తరలిస్తూ.. పోగు చేస్తూ..

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:11 AM

Transporting... Stockpiling... జిల్లాలో ఇసుక అక్రమ దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కొన్నిచోట్ల అనుమతుల్లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతూ.. సరిహద్దు ఒడిశా ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొన్నిచోట్ల పెద్దఎత్తున ఇసుకను నిల్వ చేస్తున్నారు. దీనిపై అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇసుకాసురులు బరితెగిస్తున్నారు.

Transporting... Stockpiling... తరలిస్తూ.. పోగు చేస్తూ..
భామిని మండలంలో నేరడి, బిల్లుమడ మధ్య ఇసుక అక్రమ నిల్వలు ఇలా..

  • జిల్లా నుంచి ఒడిశాకు తరలింపు

  • మరికొన్నిచోట్ల భారీగా నిల్వ చేస్తున్న వైనం

  • తెరవెనుక అధికార, ప్రతిపక్ష ద్వితీయ శ్రేణి నేతలున్నట్లు ఆరోపణలు

  • బరితెగిస్తున్న ఇసుకాసురులు.. చోద్యం చూస్తున్న అధికారులు

పార్వతీపురం, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుక అక్రమ దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కొన్నిచోట్ల అనుమతుల్లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతూ.. సరిహద్దు ఒడిశా ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొన్నిచోట్ల పెద్దఎత్తున ఇసుకను నిల్వ చేస్తున్నారు. దీనిపై అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. అయితే దీని వెనుక కొంతమంది కూటమి పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, వైసీపీ నేతలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇసుక విషయంలో వారిద్దరూ ఒక్కటై దర్జాగా ఈ వ్యాపారం సాగిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ఓ మండలంలో ఇసుక వ్యాపారంలో ఆరి తేరిన వైసీపీ నాయకులతో కొంతమంది టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు చేయి కలిపి ఇసుక దందా చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.

కుప్పల వెనుక కథేమిటి?

- కురుపాం తహసీల్దార్‌ కార్యాలయానికి సుమారు కిలో మీటరు దూరంలో 60 నుంచి 70 లారీల ఇసుకను నిల్వ చేయడం వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీగా ఇసుకను నిల్వ చేసినా.. రెవెన్యూ , గనులశాఖ అధికారులు గుర్తించకలేకపోవడం గమనార్హం. స్థానికులు దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాతనే ఆయా శాఖాధికారులు కదిలారు. ఉన్న తాధికారుల ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులు వెళ్లి ఆ ఇసుకను సీజ్‌ చేశారు. అధికారికంగా ఇసుకను తెచ్చుకున్నట్టు ఓ ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యం చెబుతున్నప్పటికీ.. ఇంత పెద్ద ఎత్తున నిల్వ చేయడం వెనుక అనేక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వర్షాలు ప్రారంభమైతే ఇసుక దొరకడం కష్టమవుతుంది. ఇందుకోసమే ముందుగా ఇసుక భారీగా నిల్వ చేసుకుని వర్షాకాలంలో అధిక ధరలకు విక్రయించేందుకు స్కెచ్‌ వేశారనే ప్రచారం సాగుతోంది. కాగా గుమ్మలక్ష్మీపురం తదితర ప్రాంతాలతో పాటు ఒడిశాలోని గుణుపూర్‌కు అక్రమంగా తరలించేందుకే పెద్ద ఎత్తున ఇసుకను పోగు చేశారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

- ఇక భామిని మండలం నేరడి , బిల్లుమడ గ్రామాల మధ్య కూడా భారీ ఇసుక కుప్పలు ఉన్నాయి. అనుమతులు వస్తాయని చెబుతూ.. ముందుగానే ఇక్కడ యంత్రాలతో తవ్వకాలు జరిపి భారీగా ఇసుకను నిల్వ చేస్తున్నారు. దీని వెనుక బలమైన వ్యక్తులు ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

- వీరఘట్టం మండలం నడిమికెల్ల, పాలకొండ మండలం అన్నవరం తదితర ప్రాంతాల నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఇటీవల అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. బలిజిపేట, సీతానగరం, సాలూరు తదితర మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

కొమరాడలో ఇలా..

- త్రిలోక మైన్స్‌కు కొమరాడ మండలం కోరిశీల రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌ 54/2లో ఇసుక తవ్వకాలకు గనుల శాఖ అనుమతులు మంజూరు చేసింది. అయితే తమ డీపట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అధికారులు అనుమతులు మంజూరు చేశారంటూ ఆ ప్రాంతానికి చెందిన గిరిజనులు పువ్వుల లక్ష్మి, కొండగొర్రె కంబ, ఆదెయ్య హైకోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం స్టే విధించడంతో ఆ ప్రాంతంలో ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. అయితే ఆ తర్వాత సీన్‌ మారింది.

- సదరు ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు తమకెటువంటి అభ్యంతరం లేదని గిరిజనులు చెప్పారు. తాము ఒప్పదం కుదుర్చుకున్నామని చెబుతూ అగ్రిమెంట్‌ పేపర్లను గనుల శాఖ అధికారులకు అందించారు.

- ఈ నెల 8న కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో కొమరాడుకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి తమ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు మంజూరు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలో ‘మీ భూమి ఉంటే పత్రాలు చూపించాలి.’ అని అధికారులు అడిగితే ఫిర్యాదుదారు తడబడ్డారు. గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు ఇవ్వకుండానే ఇచ్చినట్టు చెప్పడం, దీనిపై మంత్రి సంధ్యారాణి ప్రశ్నిస్తే అవునని కాసేపు, కాదని కాసేపు చెప్పడంతో ఆమె కూడా అసహనం వ్యక్తం చేశారు.

రాత్రి వేళల్లో తరలింపు...

రాత్రి వేళల్లో కొమరాడ మండలం నుంచి ఒడిశాకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఆ రాష్ట్రంలో ఇసుక ధర ఎక్కువగా ఉండడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇక భామిని మండలం బత్తిలి నుంచి కూడా సరిహద్దు ఒడిశా ప్రాంతాలకు యథేచ్ఛగా ఇసుక రవాణా జరిగేది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమవడంతో పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్పిల్‌ జగన్నాథ్‌ కొరడా ఝుళిపించారు. దీంతో ఆ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాకు చెక్‌ పడింది. అయితే కొమరాడ మండలంలో మాత్రం ఈ దందాకు బ్రేక్‌ పడడం లేదు. ఒడిశాకు ఇసుక రవాణా జరుగుతూనే ఉంది.

మా దృష్టికి రాలేదు

కొమరాడ నుంచి ఒడిశాకు ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు మా దృష్టికి రాలేదు. కురుపాంలో ఇసుక సీజన్‌ చేసిన మాట వాస్తవమే. దీనికి సంబంధించి పత్రాలు అందించాలని ఆదేశించాం. గతంలో లీజు తీసుకున్న ఓ సంస్థ మే నెలలో భామిని మండలం నేరడి వద్ద ఇసుక నిల్వ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కొమరాడ మండలంలో ఇసుక తవ్వకాలు నిలిపివేశాం. అయితే ఆ ప్రాంతంలో తవ్వకాల కోసం అగ్రిమెంట్‌ కుదిరిందని కొంతమంది పత్రాలు ఇచ్చారు. కానీ హైకోర్టు ఆదేశాలతో అక్కడ ఎటువంటి ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు వీలు లేదు.

- రాము, జిల్లా మైనింగ్‌ అధికారి...

Updated Date - Jun 10 , 2026 | 12:11 AM