Transparent governance is the goal పారదర్శక పాలనే లక్ష్యం
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:40 PM
Transparent governance is the goal ‘పారదర్శక పాలనే లక్ష్యం. డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్ల సమష్టి కృషితో అవినీతి లేని పాలన అందిస్తాం. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీఠ వేస్తాం. అభివృద్ధి పనుల్లో కూడా నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తాం. ప్రజలు, కార్పొరేటర్లు తమ దృష్టికి తీసుకువచ్చే సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం’ అని మేయర్ అవనాపు భార్గవి చెప్పారు.
పారదర్శక పాలనే లక్ష్యం
నగరాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి
ఆదాయం పెంచేందుకు చర్యలు
మేయర్ అవనాపు భార్గవి
విజయనగరం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):
‘పారదర్శక పాలనే లక్ష్యం. డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్ల సమష్టి కృషితో అవినీతి లేని పాలన అందిస్తాం. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీఠ వేస్తాం. అభివృద్ధి పనుల్లో కూడా నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తాం. ప్రజలు, కార్పొరేటర్లు తమ దృష్టికి తీసుకువచ్చే సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం’ అని మేయర్ అవనాపు భార్గవి చెప్పారు. నగరపాలక సంస్థ కొత్త మేయర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరిస్తున్న ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో ఆదివారం మాట్లాడారు. పరిపాలనలో తన ప్రాధాన్యాలను వివరించారు. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రశ్న: ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా మేయర్‌గా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఎలా ముందుకెళ్తారు?
జ: చారిత్రాత్మకమైన విజయనగరం నగరపాలక సంస్థకు మేయర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ బాధ్యతను ఎమ్మెల్యే అదితీగజపతిరాజు, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది, భర్త అవనాపు విజయ్ సహకారంతో నిర్వహిస్తాను. నగర ప్రజల ప్రశంసలు అందుకునే ప్రయత్నం చేస్తాను.
ప్రశ్న: అవినీతి లేని పాలన సాధ్యమేనా!
జ: సాధ్యమే. గతంలో జరిగినవి పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం. నగర ప్రజలకు పారదర్శక పాలన అందిస్తాం. అందరి సమన్వయంతో ముందుకు సాగుతాను. డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్ల సమష్టి కృషితో అవినీతి లేని పాలన అందించనున్నాం.
ప్రశ్న: నగరాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు?
జ: అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీఠ వేస్తాం. అభివృద్ధి పనుల్లో కూడా నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తాం. ప్రజలు, కార్పోరేటర్లు తీసుకువచ్చే సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తాను. ఎమ్మెల్యే అదితి రెండున్నర ఏళ్లలో రూ.548 కోట్లతో విజయనగరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ స్పీడును మరింత పెంచుతాం.
ప్రశ్న: నగర ప్రజలకు అహ్లాదం లేదు.. ఏమంటారు?
జ: నగర ప్రజలకు అహ్లాదం కల్పించేందుకు ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతాం. పార్కుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తాం. అధికారులు, నిపుణులతో మాట్లాడి, పార్కులు అభివృద్ధి చేయడంతో పాటు వాటి నిర్వహణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతాం.
ప్రశ్న: విజయనగరం నగరపాలక సంస్థకు ఆదాయం తక్కువ? మరి నగరాభివృద్ధి ఎలా?
జ: ఆదాయం పెంపు మార్గాలను అన్వేషిస్తాం. వ్యయం తగ్గించే ప్రయత్నం చేస్తాం. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగిస్తాం.
ప్రశ్న: మంచినీటి సమస్య, పారిశుధ్య సమస్యలు నగరాన్ని దీర్ఘకాలికంగా వేధిస్తున్నాయి?
జ: మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. జనాభా పెరిగింది. ఇందుకు తగ్గట్టుగా నీటి సరఫరా పెరగలేదు. పారిశుధ్య సమస్య వుంది. పరిష్కారానికి అధికారులతో కలిసి ఆలోచన చేస్తాం.
ప్రశ్న: నగర ప్రజల నుంచి ఏమి కోరుకుంటున్నారు?
జ: నగర ప్రజలు కార్పొరేషన్‌కు పూర్తిస్థాయిలో సహకరించాలి. సకాలంలో ఆస్తి, కుళాయి పన్నులు చెల్లించాలి. నగరపాలక సంస్థ షాపుల్లో వున్న వారు అద్దెలు సకాలంలో చెల్లించాలి. అందరి సమష్టి కృషితో చారిత్రాత్మక న గరాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నది నా సంకల్పం.
------------