శిక్షణ విద్యార్థులే వైద్యులై..
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:49 PM
తమ సమస్యలు పరిష్కారం కోరుతూ కాంట్రాక్టు, పారా మెడికల్ సిబ్బంది విధులను బహిష్కరించి ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది.
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు
- విధులను బహిష్కరించిన కాంట్రాక్టు, పారామెడికల్ సిబ్బంది
- రోగులకు తప్పని ఇబ్బందులు
జియ్యమ్మవలస, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కారం కోరుతూ కాంట్రాక్టు, పారా మెడికల్ సిబ్బంది విధులను బహిష్కరించి ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. చాలా ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు అందని పరిస్థితి నెలకొంది. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ట్రైనింగ్ విద్యార్థులే వారికి తెలిసిన వైద్యం చేస్తున్నారు. పార్వతీపురంలో జిల్లా కేంద్రాసుపత్రి, సీతంపేట, పాలకొండ, సాలూరులో ఏరియా ఆసుపత్రులు, చిన మేరంగి, కురుపాం, గుమ్మలక్ష్మీపురంలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అదే విధంగా జిల్లాలో ఐదు అర్బన్ పీహెచ్‌సీలు, 37 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇవి వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్వంలో పనిచేస్తున్నాయి. అన్ని ఆసుపత్రుల్లో రెగ్యులర్ వైద్యులతో పాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, పారా మెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రధానంగా రోగులకు సేవలు అందించడంలో కాంట్రాక్టు, పారా మెడికల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, వీరు తమ కనీస డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటానికి దిగారు. గత మూడు రోజులుగా విధులు బహిష్కరించారు. దీంతో చాలా ఆస్పత్రుల్లో సాధారణ వైద్యంతో పాటు అత్యవసర సేవలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ వైద్య సిబ్బంది తక్కువగా ఉండడంతో శిక్షణ విద్యార్థులే రోగులకు సేవలు అందిస్తున్నారు. వీరు వచ్చీ రాని వైద్యం చేస్తుండడంతో ఏం జరుగుతుందోనని రోగులు భయాందోళన చెందుతున్నారు. చాలామంది రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులు వెలవెలబోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నాం. కాంట్రాక్టు, పారామెడికల్ సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు. దీంతో ఉన్న రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ వైద్య సిబ్బందితో కలిసి సేవలు అందిస్తున్నాం. శిక్షణ పొందుతున్న వైద్య విద్యార్థుల సహాయం తీసుకుంటున్నాం.
-డాక్టర్ వాసుదేవరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్, సీహెచ్‌సీ, చినమేరంగి