Share News

పారాది వంతెనపై విషాదం

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:12 AM

పారాది గ్రామం వద్ద గురువారం ఉదయం ఓ యువకుడు అనుమా నాస్పద స్థితిలో మృతి చెందాడు.

 పారాది వంతెనపై విషాదం

  • యువకుడి అనుమానాస్పద మృతి

బొబ్బిలి రూరల్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పారాది గ్రామం వద్ద గురువారం ఉదయం ఓ యువకుడు అనుమా నాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిది పారాది గ్రామా నికి చెందిన ఉత్తరావల్లి సంతోష్‌కుమార్‌ (30)గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. సంతోష్‌కుమార్‌ ఒంగోలులోని ఓ ఆక్వా కంపెనీలో పనిచేసేవాడు. 45 రోజులుగా స్వగ్రా మం పారాదిలోనే ఉంటున్నాడు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో తన స్నేహితుడు అల్లాడ పైడిరాజుతో కలిసి బయటకు వెళ్లిన సంతోష్‌కుమార్‌, రాత్రికి ఇంటికి తిరిగి రాలేదు. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో పారాది కొత్త వంతెన కు వెళ్లే రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతిచెంది ఉన్నాడన్న సమాచారంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. మృతదేహం సంతోష్‌కుమార్‌దేనని కుటుంబ సభ్యు లు గుర్తించి బోరుమన్నారు. మృతుడి నుదుడిపై తీవ్ర గాయంతో పాటు ముఖం పై రక్తపు మరకలు ఉండటాన్ని గుర్తించారు. గ్రామస్థుల సమాచారంతో డీఎస్పీ ఆర్‌.గోవిందరావు, సీఐ కె.నారాయణరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించా రు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఉంటుందని అంచనాకు వచ్చారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ బృందాలతో పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఉత్తరావల్లి తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ నారాయణరావు కేసు నమోదు చేశారు.

Updated Date - Sep 11 , 2026 | 12:12 AM