నూతన సంవత్సర వేళ విషాదం
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:44 PM
నూతన సంవత్సర వేళ మండలంలోని కొత్తవలస పంచాయతీ పాతసుంకరపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
కొత్తవలస, జనవరి 1(ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేళ మండలంలోని కొత్తవలస పంచాయతీ పాతసుంకరపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొత్తవలస పంచాయతీ పాతసుంకరపాలెం గ్రామానికి చెందిన గునిశెట్టి నాగేశ్వరరావు(30) విశాఖపట్టణంలోని ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కంపెనీకి సంబంధించిన పాత సంవత్సరపు లెక్కల లావాదేవీలన్నీ చేసుకుని బుధవారం రాత్రి తన బైకుపై గ్రామంలో నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు అవసరమైన కేక్ పట్టుకుని బయలుదేరాడు. మరికొద్ది నిమిషాలలోనే తన స్వగ్రామాన్ని చేరుకుంటుండగానే అర్ధానపాలెం సమీపంలో లారీ ఢీకొంది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య సాయితో పాటు ఏడాది వయస్సు కలిగిన పాప ఉంది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేసి, ఎస్‌ఐ జోగారావు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట తరలించారు.