Tragedy on birthday పుట్టినరోజున విషాదం
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:08 AM
Tragedy on birthday ఆ యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఈత అంటే సరదా. చిన్నప్పుడు నేలబావిలో సైతం అవలీలగా ఈదేవాడు. అమెరికాలో ఉన్నప్పటికీ ఈతపై మక్కువతో పుట్టినరోజు నాడు స్నేహితులతో కలిసి నదిలో ఈదేందుకు వెళ్లాడు. అతని సరదాను, మిత్రులతో కలిసి ఉన్న ఆనంద క్షణాలను చూసిన విధికే కన్ను కుట్టిందేమో చెట్ల వేళ్ల రూపంలో అతన్ని అనంతలోకాలకు తీసుకుపోయింది. కన్నవారికి కోలుకోలేని కష్టం తెచ్చింది. బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సింగిరెడ్డి సాయిశ్రీ హరికృష్ణ (26) విషాదాంతమిది.
పుట్టినరోజున విషాదం
ఆమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
దిగ్ర్భాంతి చెందిన పిరిడి గ్రామస్థులు
జీర్ణించుకోలేకపోతున్న తల్లిదండ్రులు
బొబ్బిలి రూరల్, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి):
ఆ యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఈత అంటే సరదా. చిన్నప్పుడు నేలబావిలో సైతం అవలీలగా ఈదేవాడు. అమెరికాలో ఉన్నప్పటికీ ఈతపై మక్కువతో పుట్టినరోజు నాడు స్నేహితులతో కలిసి నదిలో ఈదేందుకు వెళ్లాడు. అతని సరదాను, మిత్రులతో కలిసి ఉన్న ఆనంద క్షణాలను చూసిన విధికే కన్ను కుట్టిందేమో చెట్ల వేళ్ల రూపంలో అతన్ని అనంతలోకాలకు తీసుకుపోయింది. కన్నవారికి కోలుకోలేని కష్టం తెచ్చింది. బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సింగిరెడ్డి సాయిశ్రీ హరికృష్ణ (26) విషాదాంతమిది. అమెరికాలోని ఓ నదిలో ఈతకు దిగి శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, రమ తీవ్రంగా విలపించారు. ఈ ఘటనతో స్వగ్రామం పిరిడిలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
సింగిరెడ్డి శ్రీనివాసరావు, రమకు కుమార్తె సాయిప్రసన్న, కుమారుడు సాయిశ్రీ హరికృష్ణ ఉన్నారు. హరికృష్ణ ఇంజినీరింగ్ పూర్తి చేశాక 2023వ సంవత్సరంలో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు. నాలుగు నెలల కిందటే ఆయనకు అమెరికాలోని ఎలిసెంట్ క్లీన్స్ టెక్నాలజీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. కుమారుడు ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. పుట్టినరోజు సందర్భంగా శనివారం సాయంత్రం హరికృష్ణ స్నేహితులు ఐదుగురితో కలిసి సరదాగా గడిపేందుకు మెరమెక్ స్టేట్‌పార్కుకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత వారంతా అక్కడికి సమీపంలో ఉన్న నదికి వెళ్లారు. హరికృష్ణకు చిన్నప్పటి నుంచి ఈత అంటే సరదా. ఈ ధీమాతోనే నదిలోకి దిగాడు. మిగతా స్నేహితులు ఒడ్డున ఉండగా ఈయనొక్కరే నదిలోపలి వరకూ ఈదుకుంటూ వెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక నీటిలోని చెట్టు వేళ్లలో ఇరుక్కుని ఈదేందుకు అవకాశం లేక ఉన్నఫలంగా మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు అక్కడి రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి వారు చేరుకునేటప్పటికి కొంత సమయం కావడంతో అచేతన స్థితిలో హరికృష్ణను గుర్తించారు. విషయాన్ని స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
- హరికృష్ణకు ఈతంటే ఇష్టమని, గ్రామంలో కూడా పొలాల్లోని నేలబావుల్లో వేసవిలో ఈతకు దిగేవాడని స్నేహితులు అంటున్నారు. తండ్రి ఆటో నడుపుతుంటాడు. తల్లి రమ ఒప్పంద ఉద్యోగిగా స్థానిక పాహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్నారు. అందివచ్చిన కుమారుడి మృతిని వారు తట్టుకోలేకపోతున్నారు. కుమారుడి పుట్టినరోజు నాడే ఘోరం జరిగిపోయిందని విలపించారు. హరికృష్ణ మృతి తమను తీవ్రంగా కలిచి వేసిందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌ఐ సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో మాట్లాడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చించినట్లు వెల్లడించారు.
---------------------------