Share News

పెళ్లింట విషాదం

ABN , Publish Date - Jun 21 , 2026 | 11:46 PM

పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కూతురును తీసుకెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది.

పెళ్లింట విషాదం
మండంగి జిలికి (ఫైల్‌) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

- పెళ్లి కూతురును తీసుకెళ్తున్న ఆటో బోల్తా

- డ్రైవర్‌ మృతి

- పెళ్లి కూతురుతో పాటు 11 మందికి గాయాలు

- ఆగిపోయిన వివాహ కార్యక్రమం

గుమ్మలక్ష్మీపురం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కూతురును తీసుకెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా, పెళ్లి కుమార్తెతో పాటు 11 మంది గాయపడ్డారు. దీంతో వివాహ కార్యక్రమం ఆగిపోయింది. ఈ ఘటన గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కొండ శిఖర గ్రామం చాపరాయి జంగిడిభద్ర గ్రామానికి చెందిన మన్నంగి భవ్యకు ఇదే మండలంలోని మైదాన ప్రాంతం పెంగువ గ్రామానికి చెందిన యువకుడితో ఆదివారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. దీనికోసం చాపరాయి జంగిడిభద్ర నుంచి పెళ్లి కుమార్తె భవ్యతో పాటు 11 మంది ఆటోలో శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో పెంగువకు బయలుదేరారు. సుమారు 10 గంటల సమయంలో తాడికొండ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో చాపరాయి జంగిడిభద్రకు చెందిన ఆటో డ్రైవర్‌, పంచాయతీ వార్డు మెంబర్‌ మండంగి జలిగి (45) అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లికూతురు భవ్యతో పాటు సత్యవతి, కుందురిక లత, ఆరిక హైమావతి, మండంగి సుధాకరరావు, మన్నంగి సీతారాం, మండంగి సుశీల, తోక సావిత్రి, తోక సిద్ధూ, మన్నంగి గాయత్రి గాయపడ్డారు. వెంటనే వీరిని మరో ఆటోలో భద్రగిరి సామాజిక ఆరోగ్య కేం ద్రానికి తీసుకొచ్చి చికిత్స అందించారు. సత్యవతి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడు మండంగి జలిగికి భార్యా ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనతో ఆదివారం జరగాల్సిన వివాహం ఆగిపోయింది. గ్రామస్థులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఎల్విన్‌పేట సీఐ శివప్రసాద్‌ ఆదివారం సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వర్షం.. ఆపై కంకర

కొండశిఖర గ్రామం చాపరాయి జంగిడిభద్ర గ్రామం నుంచి మైదాన ప్రాంతం పెంగువకు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఘాట్‌ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలి. ఈ ఘాట్‌ రోడ్డును కొత్తగా వేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రోడ్డు చిత్తడిగా మారింది. దీంతో చాపరాయి జంగిడిభద్ర నుంచి కొండ దిగువకు ఆటోలో వస్తుండగా కంకర కారణంగా ఆటో జారిపోయి అదుపుతప్పి బోల్తాపడిందని క్షతగాత్రులు చెబుతున్నారు.

Updated Date - Jun 21 , 2026 | 11:46 PM