Traditional Treatment నాటు వైద్యం వికటించి..
ABN , Publish Date - May 16 , 2026 | 11:56 PM
Traditional Treatment Turns Tragic అనారోగ్యంతో ఓ గిరిజన విద్యార్థిని మృతి చెందింది. దీంతో తల్లిండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే బాలిక మృతికి నాటు వైద్యమే కారణమని అధికారులు చెబుతున్నారు.
విచారణకు ఆదేశించిన కలెక్టర్
గుమ్మలక్ష్మీపురం, మే 16 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో ఓ గిరిజన విద్యార్థిని మృతి చెందింది. దీంతో తల్లిండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే బాలిక మృతికి నాటు వైద్యమే కారణమని అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మూలిగూడకు చెందిన పి.సుష్మిత (13) గుమ్మలక్ష్మీపురం కేజీబీవీలో ఆరో తరగతి చదువుతోంది. వేసవి సెలవుల కారణంగా కొద్ది రోజుల నుంచి స్వగ్రామంలోనే ఉంటోంది. అయితే ఈ విద్యార్థిని నాలుగు రోజులు కిందట అనారోగ్యానికి గురైంది. జ్వరంతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు తమ గ్రామానికి సమీపంలో ఉన్న ఒడిశా గ్రామం మెట్టుగూడలో నాటు వైద్యం చేయించారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో బాలికను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అదే రోజు శ్రీకాకుళంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ శనివారం విద్యార్థిని మృతి చెందింది. గుండెలో రక్తం గడ్డకట్టడంతోనే బాలిక మృతి చెందిందని వైద్యులు తెలియజేశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రులు సిద్ధ, ఈశ్వరరావులు తమ కూతురు మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు ప్రిన్సిపాల్‌కు తెలియజేయాలని సుష్మిత చెప్పినా తాము వినలేదని వారు కన్నీటిపర్యంతమయ్యారు. కొద్దిరోజుల కిందట వరకు తమతో కలసి సరదాగా ఆడిపాడిన సొదరి ఇక లేదని తెలిసి అక్క, తమ్ముడు భోరున విలపించారు. కాగా ఈ విషయం తెలుసుకున్న కేజీబీవీ టీచర్లు మూలిగూడ వెళ్లి.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సుష్మిత అనారోగ్యానికి గురైనప్పుడు తల్లిదండ్రులు నాటు వైద్యం చేయించారని.. పరిస్థితి విషమించిన తర్వాత బాలికను ఆసుపత్రికి తీసుకొచ్చారని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. కాగా నాటు వైద్యం అందించిన వారిపై కేసు నమోదుచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత ఏఎన్‌ఎంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డికి సూచించారు. మరోవైపు ఒడిశా నాటు వైద్యులపై ఎల్విన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు స్థానిక వైద్య సిబ్బంది సన్నద్ధమవుతున్నారు.