Share News

Trade 'Rule' on Maize మొక్కజొన్నపై వ్యాపా‘రూల్‌’

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:35 PM

Trade 'Rule' on Maize మొక్కజొన్న మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే రేటు. వారు వేసిందే తూకం. కాదని అడ్డుపడితే, కొనుగోలు వాయిదా పడి, పండిన పంట కల్లానికే పరిమితమవుతోంది. ఇంతలో అకాల వర్షం పడితే.. పంటంతా నీటి పాలై, రైతులకు కన్నీటిని మిగిల్చుతుంది. ఇదీ జిల్లాలోని మొక్కజొన్న రైతుల పరిస్థితి. చెమటోడ్జి ఆరుగాలం పండించిన పంట దళారులు, ప్రైవేటు వ్యాపారుల పాలవుతోంది.

Trade 'Rule' on Maize మొక్కజొన్నపై వ్యాపా‘రూల్‌’
కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పంట

మొక్కజొన్నపై వ్యాపా‘రూల్‌’

కొనుగోలులో వారిదే హవా

ఏర్పాటు కాని కొనుగోలు కేంద్రాలు

ఎకరానికి ముప్పై వేలు నష్టపోతున్న అన్నదాతలు

మొక్కజొన్న మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే రేటు. వారు వేసిందే తూకం. కాదని అడ్డుపడితే, కొనుగోలు వాయిదా పడి, పండిన పంట కల్లానికే పరిమితమవుతోంది. ఇంతలో అకాల వర్షం పడితే.. పంటంతా నీటి పాలై, రైతులకు కన్నీటిని మిగిల్చుతుంది. ఇదీ జిల్లాలోని మొక్కజొన్న రైతుల పరిస్థితి. చెమటోడ్జి ఆరుగాలం పండించిన పంట దళారులు, ప్రైవేటు వ్యాపారుల పాలవుతోంది.

చీపురుపల్లి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో జిల్లాలో ప్రైవేటు వ్యాపారుల హవా సాగుతోంది. ఇంటిల్లపాదీ కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న విజయనగరం జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

వేరు శనగ, గోగు వంటి పంటలకు స్వస్తి పలికిన జిల్లా రైతులు అన్ని సీజన్లలోనూ మొక్కజొన్న పంటను విరివిగా సాగు చేస్తున్నారు. రబీలో సుమారు 46 వేల హెక్లార్లలో మొక్కజొన్న సాగువుతోంది. తద్వారా 3.5 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల సానుకూల వైఖరితో క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర ప్రకటించడంతో రైతులు సంబర పడిపోయారు. అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో నిరాశ పడుతున్నారు.

ప్రైవేటు వ్యాపారులే గతి

జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో రైతులు తాము పండించిన పంటను తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది. ఈ క్రమంలో వ్యాపారులు చెప్పిందే రేటుగా వ్యాపారం సాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2400 ఉన్నప్పటికీ వ్యాపారులు మాత్రం క్వింటాలు ఒక్కంటికీ పరిస్థితులను బట్టి కేవలం రూ.1700 లేదా గరిష్టంగా రూ.1800కు కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన క్వింటాలుకు కనీసం ఆరు వందలు రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతమున్న దిగుబడిని బట్టి ఎకరానికి సుమారు రూ.30 నుంచి రూ.40 వేల వరకూ రైతులకు నష్టం వస్తోంది. సరైన ధర లేనప్పటికీ విక్రయించాల్సిన పరిస్థితులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. ఎరువులు, పురుగు మందులు, కూలీల వేతనాలు కలిపితే ప్రైవేటు వ్యాపారులు ఇస్తున్న రేటు గిట్టుబాటు కావడం లేదని రైతులు అంటున్నారు. అయినప్పటికీ మరో మార్గం లేదని వాపోతున్నారు.

ప్రభుత్వానికి నివేదించాం

జిల్లాలో మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. రబీలో 45000 హెక్లార్లలో మొక్కజొన్న సాగవుతోంది. పంట దిగుబడి బాగానే ఉంది. ఇక్కడున్న పరిస్థితులు ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుంది. ఆ వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.

- వీటీ రామారావు, సంయుక్త సంచాలకుడు, వ్యవసాయ శాఖ

Updated Date - Apr 01 , 2026 | 11:35 PM