Share News

పర్యాటకానికి పెద్దపీట వేయాలి

ABN , Publish Date - Mar 12 , 2026 | 11:57 PM

జిల్లాలో పర్యాటక రంగానికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు కలెక్టర్‌ను ఆదేశించారు.

పర్యాటకానికి పెద్దపీట వేయాలి
కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి

- అవకాశాలను అనుకూలంగా చేసుకొని అభివృద్ధి చేయాలి

- వేసవిలో తాగునీటి సమస్య ఉండకూడదు

- కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు

- రిజిస్ట్రేషన్‌..స్టాంప్‌ల ఆదాయంలో జిల్లాకు మొదటి స్థానం

- జీడి, మామిడి మొక్కల పెంపకంలో రెండో ర్యాంకు

-ప్రాపర్టీ టాక్స్‌ వసూలులో ఐదో స్థానం

- నివేదికలో కీలక విషయాలు వెల్లడి

పార్వతీపురం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పర్యాటక రంగానికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు కలెక్టర్‌ను ఆదేశించారు. రెండో రోజు గురువారం అమరా వతిలో కలెక్టర్లు, ఎస్పీలతో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. వేసవిలో ఏ ప్రాంతంలో కూడా తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆదే శించారు. అనంతరం జిల్లా ప్రగతిని నివేదిక రూపంలో బహిర్గతం చేశారు. కొన్నిశాఖల పనితీరు సంతృప్తిక రంగా ఉండగా, మరికొన్ని శాఖల పనితీరు ఆశాజనకంగా లేనట్లు నివేదికలో వెల్లడైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీశిశు సంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి పాల్గొన్నారు.


రిజిస్ట్రేషన్ల ఆదాయంలో ప్రథమ స్థానం..

రిజిస్ట్రేషన్స్‌, స్టాంప్స్‌ ఆదాయంలో జిల్లాకు మొదటి స్థానం లభించింది. వీటిద్వారా రూ.31.78 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా.. లక్ష్యానికి మించి ఇప్పటి వరకు రూ.43.92 కోట్ల ఆదాయం వచ్చింది. గనుల శాఖ ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి జిల్లాకు ఆరో స్థానం లభించింది. రూ.19 కోట్లకు గాను రూ.10 కోట్లు వసూలైంది. ప్రాపర్టీ టాక్స్‌ వసూలులో జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. రూ.1.20 కోట్లకు గాను రూ.1.08 కోట్లు వసూలు చేసింది. నీటి పన్ను వసూళ్లలో జిల్లా చివరి స్థానంలో ఉంది. రూ.5.56 కోట్లు లక్ష్యం కాగా, రూ.68 లక్షల మాత్రమే వసూలు జరిగింది. బీపీఎస్‌కు సంబంధించి జిల్లా 20 స్థానంలో ఉంది. 148 బీపీఎస్‌ దరఖాస్తులు మాత్రమే మున్సిపల్‌ అధికారులు పరిశీలించారు. లేఅవుట్ల రెగ్యులైజేషన్‌లో జిల్లాకు మూడో స్థానం లభించింది. 339 దరఖాస్తులు రాగా 2,005 దరఖాస్తులను క్లియర్‌ చేసి రూ.2.29 కోట్ల ఆదాయాన్ని ఖాజానాకు సమకూర్చారు.

అంగన్‌వాడీ సేవలపై 70.9 శాతం సంతృప్తి..

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు బోధనతో పాటు పాలు, గుడ్లు అందిస్తున్నారా అనే అంశాలపై జిల్లాలో 70.9 శాతం లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. 29.1 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రతిరోజూ తెరుస్తున్నారా? లేదా అనే విషయంలో జిల్లాలో 70.2 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 29.8 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేం ద్రాల్లో తాగునీటి సౌకర్యంపై అభిప్రాయ సేకరణ చేపట్టగా 68.1 శాతం బాగోలేదని చెప్పారు. గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలపై 81.3 శాతం మంది సంతృప్తి, 18.7 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలు, గుడ్లతో పాటు పౌష్టికాహార కిట్ల నాణ్యతపై 82.4 శాతం మంది సంతృప్తి చెందగా, 17.6 శాతం అసంతృప్తి వ్యక్తంచేశారు.


ఐటీడీఏ పథకాల అమలు..

ట్రైకార్‌ ఉన్నతి పథకం ద్వారా పార్వతీపురం ఐటీడీఏలో 351 మంది లబ్ధిదారులకు, సీతంపేట ఐటీడీఏలో 126 మంది లబ్ధిదారులకు సబ్సిడీతో కూడిన రుణాలను అందిస్తున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. అండర్‌ ఎస్‌సీఏ కార్యక్రమం కింద సీతంపేట ఐటీడీఏలో రూ.3.32కోట్లతో 198 మంది లబ్ధిదారులకు, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో రూ.4కోట్లతో 258 మంది లబ్ధిదారులకు ఆయిల్‌ ఇంజన్లు, మినీ ట్రాక్టర్లు తదితర వాటిని గత ఏప్రిల్‌లో అందించినట్లు అధికారులు చెప్పారు.

తాగునీటి సమస్య ఉండకూడదు..

జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ముఖ్యమం త్రి కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలోని 15 మండలాలు, సాలూరు, పార్వతీపురం పురపాలక సంఘాలు, పాలకొండ నగర పంచాయతీలో ఎక్కడ కూడా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకూడదని, సమస్య ఉంటే యుద్ధ ప్రాతిపదికపై పరిష్కరించాలని స్పష్టం చేశారు.

గ్రౌండ్‌ వాటర్‌లో..

గ్రౌండ్‌ వాటర్‌ లెవెల్స్‌లో జిల్లా మూడో స్థానంలో ఉంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నాటికి జిల్లాలో 7.18 మీటర్ల గ్రౌండ్‌ వాటర్‌ లెవెల్‌ ఉన్నట్టు అధికారులు నివేదిక ఇచ్చారు. పల్లె పండుగ 2.0 కింద 747 గోకులాలు మంజూరు కాగా 728 (97 శాతం) పూర్తి చేశారు. 10 వేల ఫాంపాండ్స్‌ లక్ష్యంగా పెట్టుకోగా 10,014 ఫాం పాండ్స్‌ ఏర్పాటు చేశారు.


బీటీ రహదారులు..

బీటీ రహదారుల నిర్మాణంలో జిల్లా ముందంజలో ఉంది. 90 కిలోమీటర్ల పొడవున బీటీ రహదారుల నిర్మాణం లక్ష్యం కాగా 114.85 కిలోమీటర్లు నిర్మించారు. లక్ష్యానికి మించి రోడ్ల నిర్మాణం జరగడంతో జిల్లాకు రెండో స్థానం దక్కింది. సీసీ రోడ్ల నిర్మాణంలో కొంత వెనుకబాటు కనిపిస్తుంది. జిల్లాలో 60 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉండగా 39.8 కిలోమీటర్లే చేపట్టారు.

- జిల్లాలో వీడీపీ డిక్లరేషన్‌ ఆదర్శ గ్రామాలు తొమ్మిది ప్రకటించాల్సి ఉండగా, ఇప్పటికీ ఎనిమిది ప్రకటించారు. మరో గ్రామాన్ని ప్రకటించాల్సి ఉంది. సుపసిత్‌ గ్రామాల ఎంపికకు సంబంధించి జిల్లా నుంచి 42 గ్రామాలను నామినేటెడ్‌ చేయగా అందులో ఐదు ఎంపికయ్యాయి. దీంతో రాష్ట్రంలో జిల్లా ఐదో స్థానంలో నిలిచింది.

- అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఏడు ఇండికేటర్‌లలో లబ్ధిదా రులకు అందిస్తున్న సేవలకు సంబంధించి జిల్లాకు ఏ ప్లస్‌ గ్రేడ్‌ లభించింది.

-పీఎం జన్మన్‌-11 కింద జిల్లాలో పీవీటీజీలకు 5,169 ఇళ్లు మంజూరు చేయగా.. ఇందులో 749 గృహాలు పూర్తయ్యాయి. 3,429 వివిధ దశల నిర్మాణాల్లో ఉన్నాయి. 991 ప్రారంభం కాలేదు.

- కమ్యూనిటీ మరుగదొడ్ల నిర్మాణంలో జిల్లా 14వ స్థానంలో ఉంది. 12 కమ్యూనిటీ కాంప్లెక్స్‌లో మంజూరు కాగా నాలుగు పూర్తయ్యాయి. మరో 8 పురోగతిలో ఉన్నాయి.

- పీఎంఏవై 1.0 గృహ నిర్మాణాలకు సంబంధించి జిల్లా 11వ స్థానంలో ఉంది. 36,376 ఇళ్లకు గాను 26,463 ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. 73 శాతం శాతం నిర్మాణాలతో జిల్లాకు 11వ స్థానం లభించింది.

- పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీలో జిల్లాకు 18వ స్థానం లభించింది. 323 గ్రామాలకు సంబంధించి 93,585 పాస్‌ పుస్తకాలను అధికారులు పంపిణీ చేయాల్సి ఉండగా, 74,509 పుస్తకాలను అందించారు.

- కమర్షియల్‌ టాక్స్‌ ద్వారా రూ.43.52 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, రూ.33.20కోట్లు వచ్చింది. దీంతో జిల్లా పదో స్థానంలో నిలిచింది.

-ఎక్సైజ్‌ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయంలో జిల్లాకు 18వ స్థానం లభించింది. రూ.409.38 కోటు ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా గత నెల 19 వరకు రూ.356.36 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో జిల్లాకు 18వ స్థానం దక్కింది.

- ఉద్యానశాఖ ద్వారా 4,500 ఎకరాల్లో జీడి, మామిడి తదితర మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. లక్ష్యానికి మించి 5,797 ఎకరాల్లో ప్లాంటేషన్‌ చేపట్టారు. దీంతో జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

Updated Date - Mar 12 , 2026 | 11:57 PM