rain ముంచెత్తిన వాన
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:09 AM
Torrential rain తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో పంట పొలాలు నీటమునిగాయి. ప్రధాన రోడ్డు, కూడళ్లలో నీరు నిలిచింది. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం మారింది. వర్షం జోరు తగ్గింది. దీంతో జిల్లావాసులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా గత రెండు రోజులుగా కురిసిన వానలు ఖరీఫ్ రైతులకు ఊపిరి పోశాయి. జిల్లాలో నదులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి.
ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, గెడ్డలు
నదులు, చెరువులకు జలకళ
లోతట్టు ప్రాంతంలో నీటమునిగిన పంట పొలాలు
అధికారులు అప్రమత్తం
నేడు పాఠశాలలకు సెలవు
పాలకొండ, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో పంట పొలాలు నీటమునిగాయి. ప్రధాన రోడ్డు, కూడళ్లలో నీరు నిలిచింది. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం మారింది. వర్షం జోరు తగ్గింది. దీంతో జిల్లావాసులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా గత రెండు రోజులుగా కురిసిన వానలు ఖరీఫ్ రైతులకు ఊపిరి పోశాయి. జిల్లాలో నదులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చ రిస్తుండడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూముల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు రోజుల పాటు పంట నీటమునిగి ఉంటే కుళ్లిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. కొండవాగులు, గెడ్డలు పొంగి మట్టికట్టలు తెగిపోయే ప్రమాదం ఉందన్నారు. గెడ్డల గట్లుకు గండ్లు పడితే పంట పొలాల్లో ఇసుక మేటలు వేసే ప్రమాదం ఉందని చెబు తున్నారు.
- పాలకొండ మండలంలోని జంపరకోట, రావాడ, ఓని, తంపర గెడ్డలతో పాటు కొండ వాగులు నుంచి వరదనీరు గోపాలపురం వద్ద నాగావళి నదిలో కలవాల్సి ఉంది. అయితే నదిలో కూడా నీటి ప్రవాహం నిండుగా ఉండడంతో ఆయా గెడ్డల నుంచి వరదనీరు పాలకొండ, తంపటాపల్లి, వీపీరాజుపేట, తుమరాడ, మంగళాపురం, గోపాలపురం తదితర గ్రామాలకు చెందిన పంట పొలాలను ముంచెత్తుతోంది.
- వాగులు, గెడ్డలు, చెరువులు, ఇతర నీటి వనరులు పొంగి ప్రవహిస్తుండడంతో పశువుల కాపర్లు, రైతులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. ప్రమాదటపుంచుల్లో ఉన్న ఈ గెడ్డలను దాటేందుకు ప్రయత్నిస్తే.. ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. దీనిపై యంత్రాంగం స్పం దించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సి ఉంది.
- భారీ వర్షాల నేపథ్యంలో నాగావళి నదీపరివాహక ప్రాంతంలోని గ్రామాలను సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ బుధవారం పరిశీలించారు. నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు స్నానాలు, ఇతర అవసరాలు కోసం నదిలోకి దిగొద్దని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిం చాలని అధికారులను ఆదేశించారు.
- సీతంపేట: సీతంపేట నుంచి దోనుబాయికి వెళ్లే ప్రధాన మార్గంలోని పెదరామ జంక్షన్ వద్ద రోడ్డుకు అడ్డంగి భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో 2గంటలకు పైగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు, అధికారులు పోలీస్ సిబ్బంది సహకారంతో చెట్టును యంత్ర సాయంతో కట్‌చేసి తొలగించారు. దీంతో వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. ఇక కీసరజోడు,గొయిది సమీపంలో ఉన్న గెడ్డల్లో నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న సిల్ట్‌ను తొలగిం చారు. సంతమల్లి గ్రామ సమీపంలో ఉన్న గెడ్డ నీరు కుసిమి, కోడిశ, శంభాం, జిల్లేడుపాడు గ్రామాలకు వెళ్లే ప్రదాన రహదారిపై నుంచి గెడ్డ నీరు ప్రవహిస్తుంచింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. ప్రమాదమని తెలిసినా కొంతమంది ఈ నీటిలోంచే రాకపోకలు సాగించారు.
కోతకు గురవుతున్న తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ, ఓని గ్రామ సమీపంలోని ఓనిగెడ్డ అక్వెడెక్ట్ సమీపంలో మంగళవారం గండి పడింది. అయితే కాలువ ఎత్తు ప్రాంతంలో ఉండడం, గెడ్డకు ఆనుకొని మట్టికట్ట ఉండడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గొల్లగెడ్డ, గజిలిగెడ్డ నీరు నిండుగా ప్రవహిస్తుంది. దీంతో కాలువ గట్టు మట్టికట్ట మరింత కోతకు గురవుతుంది. ఈ మట్టికట్ట మరింత కోతకు గురైతే 120 ఏళ్ల చరిత్ర ఉన్న ఓనిగెడ్డపై నిర్మించిన ఆక్వడెక్ట్‌కు ప్రమాదం పొంచి ఉంది. ఈ గండిని సకాలంలో పూడ్చకపోతే తోటపల్లి కాలువ ద్వారా పాలకొండ, ఓని, వెలగవాడ, సింగన్నవలస, పరశురాంపురం, ఎన్‌కేరాజపురం, వడమతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలానికి సాగునీరు అందించడం సాధ్యపడదు.
75.6మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
పార్వతీపురం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం సాయంత్రం ఏడు గంటల వరకు 75.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పాలకొండ 24.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వీరఘట్టం, గరుగుబిల్లిలో సున్నా వర్షపాతం నమోదైంది. సీతంపేట 8.6, భామిని 9.4, గుమ్మలక్ష్మీపురం 1.8, కురుపాం 2.2, జియ్యమ్మవలస 1.4, పార్వతీపురం 3.4, కొమరాడ 0.8, మక్కువ 3.4, సీతానగరం 2.2, సాలూరు 3.2, బలిజిపేట 5.0, పాచిపెంట 10.0 మిలీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
జాగ్రత్తలు తీసుకోవాలి
జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు. మరోవైపు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు భవానీ శంకర్, సత్యనారాయణరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. పంట పొలాల్లో వర్షపు నీటిని బయటకు మళ్లించాలన్నారు. వర్షాలు తగ్గేవరకు రసాయన ఎరువులు లేదా పురుగు మందులు వేయరాదన్నారు. రైతులకు సందేహాలు ఉంటే రైతుసేవా కేంద్రాలను సం ప్రదించాలన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్‌వో విజయలక్ష్మి సూచించారు. వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. వేడినీటిని తాగాలన్నారు. ఎవరికైనా జ్వరం, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలన్నారు. అత్యవసర పరిసితుల్లో 108కు కాల్ చేయాలని సూచించారు. పంచాయతీల్లో పారిశుధ్య మెరుగు పనులు చేపట్టాలని సిబ్బందినిడీపీవో రవీంద్ర సూచించారు. నిండుగా ప్రవహిస్తున్న చెరువులు, కాలువలు, వాగులు రిజర్వాయర్ల వద్దకు ఎవరూ వెళ్లరాదని నీటిపారుదలశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రదీప్ తెలిపారు. ఎక్కడైనా గట్లు తెగడం లేదా నీరు ఉధృతంగా ప్రవహిస్తే గమనిస్తే వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలన్నారు