Share News

Women’s Safety మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:17 AM

Top Priority to Women’s Safety జిల్లాలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఐజీ గోపీనాథ్‌ జట్టి ఆదేశించారు. మంగళవారం బెలగాంలోని పోలీస్‌ కాన్ఫెరెన్స్‌ హాల్‌లో ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

 Women’s Safety మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం
స‌మావేశంలో మాట్లాడుతున్న ఐజీ

బెలగాం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఐజీ గోపీనాథ్‌ జట్టి ఆదేశించారు. మంగళవారం బెలగాంలోని పోలీస్‌ కాన్ఫెరెన్స్‌ హాల్‌లో ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన్యంలో క్రైమ్‌ రేట్‌ తగ్గిందన్నారు. సాంకేతికతను ఉపయోగించి పెండింగ్‌ కేసులను త్వరతగతిన దర్యాప్తు చేయాలని, అన్ని పోలీస్‌ స్టేషన్లలో వాట్సప్‌ గవర్నస్‌ సేవలు ప్రజలకు కనబడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మాదకద్రవ్యాలు, గంజాయి తదితర వాటిపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి వారి సమస్యలు చెప్పుకునేలా వాతావరణం కల్పించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రోడ్డు భద్రతా నియమాలపై విస్త్రత ప్రచారం చేయాలని సూచించారు. ఈ-చలానా, డంకెన్‌ డ్రైవ్‌పై దృష్టి సారించాలన్నారు. గంజాయి, సారా రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని తెలిపారు. మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. సుదీర్ఘ పెండింగ్‌ కేసుల దర్యాప్తు పూర్తి చేసి చార్జి షీట్స్‌ కోర్టుకు సమర్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఎన్‌బీడబ్ల్యూ అమలు చేయాలని, పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ప్రతి కేసు వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని తెలిపారు. అనంతరం డ్రోన్లు, సైబర్‌ నేరాల దర్యాప్తు సాధనాలను ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్‌ అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు, రెండో అదనపు జిల్లా న్యాయాధికారి మాధురి, డీఎస్పీలు రాంబాబు, థామస్‌రెడ్డి, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 12:17 AM