Together with the students.. విద్యార్థులతో కలివిడిగా..
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:45 PM
Together with the students..రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు రెండో రోజు గురువారం కూడా విద్యార్థులతో మమేకమయ్యారు. వివిధ మండలాల్లోని పాఠశాలలను సందర్శించి అభ్యసనాతీరును పరిశీలించారు.
విద్యార్థులతో కలివిడిగా..
అభ్యసనాతీరును పరిశీలించిన రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్
కస్తూర్బా, ప్రాథమిక పాఠశాలల సందర్శన
బొబ్బిలి/రామభద్రపురం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి):
రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు రెండో రోజు గురువారం కూడా విద్యార్థులతో మమేకమయ్యారు. వివిధ మండలాల్లోని పాఠశాలలను సందర్శించి అభ్యసనాతీరును పరిశీలించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. బొబ్బిలి కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలను గురువారం సందర్శించారు. పాఠశాల అంతటినీ పరిశీలించాక విద్యార్థులకు కల్పించిన వసతులు, సౌకర్యాలు, తరగతి గదులు, డార్మెటరీ, వంటశాల నిర్వహణపై ఆరా తీశారు. ప్రభుత్వ పరంగా అమలవుతున్న పథకాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పదోతరగతి విద్యార్థులకు లెక్కలు సబ్జెక్టుపైన, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఫిజిక్స్‌పైనా ప్రశ్నలు వేశారు. అనంతరం పాఠశాలలోనే మధ్యాహ్నభోజనం చేశారు. యూటీఎఫ్ నేత కె.విజయగౌరి సమకూర్చిన స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు, మండల విద్యాశాఖాధికారి సీహెచ్ రమేష్‌కుమార్, కేజీబీవీ ప్రిన్సిపాల్ స్వప్న తదితరులు ఉన్నారు.
రామభద్రపురంలో..
ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్యాబోధన ఎంతైనా అవసరమని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. రామభద్రపురం మండల కేంద్రంలోని పూడివీధి ఎంపీపీ పాఠశాలను గురువారం సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి పొదుపు అలవరచుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో-2 పెంటయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.