జైల్లో కలిసి.. ప్రణాళిక వేసి
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:13 AM
వారిద్దరూ పాత నేరస్థులే. జైల్లో ఒకే దగ్గర ఉండడంతో అక్కడే కలిసి దొంగతనాలకు ప్రణాళిక సిద్ధం చేశారు.
- బొద్దాంలో దొంగతనం
- 38.5 తులాల బంగారం, 30 తులాల వెండి చోరీ
- ఇద్దరు పాతనేరస్థుల అరెస్టు
- ఒకరిపై 23 కేసులు.. మరొకరిపై ఐదు హత్య కేసులు
విజయనగరం క్రైం, ఫిబ్రవరి 13 ( ఆంధ్రజ్యోతి): వారిద్దరూ పాత నేరస్థులే. జైల్లో ఒకే దగ్గర ఉండడంతో అక్కడే కలిసి దొంగతనాలకు ప్రణాళిక సిద్ధం చేశారు. జైలు నుంచి బెయిల్‌పై రాగానే దొంగతనానికి పాల్పడ్డారు. వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీసులకు వెల్లడించారు. వేపాడ మండలం వల్లంపూడి పోలీసు స్టేషన్ పరిధిలోని బొద్దాం గ్రామానికి చెందిన జనపురెడ్డి వెంకటరమణ దంపతులు ఈ నెల ఒకటో తేదీన వ్యవసాయ పనులు నిమిత్తం పొలానికి వెళ్లారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో పనులు ముగించుకుని ఇంటికి వచ్చారు. తలుపులు తెరిచి ఉండడం చూసి కంగారుపడి లోపలకు వెళ్లారు. చెక్క బీరువాలో ఉన్న 38.5 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించారు. వెంటనే వల్లంపూడి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేపట్టారు. కేసు నమోదు చేసి ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ సుదర్శన్, సిబ్బంది, క్రైం బృందాలు దర్యాప్తుని వేగవంతం చేశాయి. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలు సేకరించారు. వాటి ఆధారంగా అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పాతనేరస్థుడు పిళ్లా నూకరాజు, అతని సహచరుడు అనకాపల్లి జిల్లా మాడుగల మండలం జంపెన గ్రామానికి చెందిన పేచేటి ఉపేంద్రను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టగా, నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు మూడు సెల్‌ఫోన్లు, ఒక బైకును స్వాఽధీనం చేసుకున్నట్టు ఎస్పీ దామోదర్ తెలిపారు. నూకరాజుపై విశాఖపట్టణం, అనకాపల్లి జిల్లాల్లో 23 దొంగతనాల కేసులు, ఊపేంద్రపై ఐదు లాభాపేక్ష హత్య కేసులు ఉన్నాయన్నారు. వీరివురూ ఇటీవలే జైలు నుంచి విడుదల అయ్యారని తెలిపారు. చోరీ కేసును ఛేదించిన డీఎస్పీ ఆర్ గోవిందరావు, సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ సుదర్శన్, ఏఎస్‌ఐ నాగేశ్వరరావు, పీసీలు కృష్ణ కిషోర్, సురేష్, కనకరాజు, సంతోష్, అప్పలరాజును ఎస్పీ అభినందించారు. వారికి నగదు, ప్రశంసాపత్రాన్ని అందించారు.