తాటిచెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడి మృతి
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:18 AM
తాటిచెట్టు పైనుంచి జారిపడి ఓ గీత కార్మికుడు మృతిచెందినట్టు పెద మానాపురం పోలీసులు తెలిపారు.
దత్తిరాజేరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): తాటిచెట్టు పైనుంచి జారిపడి ఓ గీత కార్మికుడు మృతిచెందినట్టు పెద మానాపురం పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. గజపతినగరం మండలం బంగారమ్మపేటకు చెందిన కొలుసు అప్పలరాజు(34), మధుపాడ గ్రామానికి చెందిన గౌరినాయు డులు ఇద్దరూ ఎప్పటిలాగే సోమవారం ఉదయం 8 గంటల సమయంలో దత్తిరాజేరు మండలంలోని భూపాలరాజపురం పంచాయతీ బలభద్రరాజపురం గ్రామం సమీపంలో గల తాటిచెట్లు ఎక్కి కొమ్మలు కొడుతున్నారు. అయితే అప్పలరాజు తన మొలకు ఉన్న బల్లెముకు ముడి తప్పినందున తాటిచెట్టు పైనుంచి జారిపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తీసుకువెళ్లగా, మెరుగైన చికిత్స కోసం గజపతినగరం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య గౌరి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య గౌరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.