Share News

Today is Tolellu నేడు తొలేళ్లు

ABN , Publish Date - Oct 26 , 2026 | 12:22 AM

Today is Tolellu ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడిమాంబ సిరిమానోత్సవానికి ముందు రోజు జరిగే తొలేళ్ల ఉత్సవం సోమవారం జరగనుంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Today is Tolellu నేడు తొలేళ్లు
విద్యుత్‌ వెలుగుల్లో అమ్మవారి ఆలయం

నేడు తొలేళ్లు

ఏర్పాట్లు పూర్తి

పండగ శోభను సంతరించుకున్న నగరం

పైడిమాంబకు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

విజయనగరం కల్చరల్‌/రింగురోడ్డు/విజయనగరం రూరల్‌/టౌన్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడిమాంబ సిరిమానోత్సవానికి ముందు రోజు జరిగే తొలేళ్ల ఉత్సవం సోమవారం జరగనుంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి 12 గంటలకు పైడిమాంబకు పంచామృతాభిషేకాలు నిర్వహించి తొలేళ్లకు సిద్ధం చేశారు. సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తులు వేలాదిసంఖ్యలో అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఘాటాలతో వచ్చి మొక్కుబడులు తీర్చుకోనున్నారు. తొలేళ్ల రోజున సోమవారం రాత్రి హుకుంపేట నుంచి ఘాటాలు ఊరేగింపుగా చదురుగుడికి చేరుకుంటాయి. అక్కడ పూజలు అనంతరం రాత్రి పది గంటల తరువాత మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, పులివేషాల మధ్య ఊరేగింపుగా కోట వద్దకు చేరుకుంటాయి. అక్కడ పూజల తర్వాత ఘాటాలు చదురుగుడికి వెళ్తాయి. అనంతరం పైడిమాంబ ఆలయంలో విత్తనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించాక అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు ఆ విత్తనాలను రైతులకు అందజేస్తారు. ఈ విత్తనాలు పొలాల్లో వేస్తే పాడిపంటలు పుస్కలంగా పండుతాయని ప్రగాఢ నమ్మకం. ఈ తంతుతో తొలేళ్లు ముగుస్తాయి.

బారులు తీరిన భక్తులు

పైడిమాంబ దర్శనానికి భక్తులు ఆదివారం బారులు తీరారు. ఆదివారం నుంచే నగరంలో పండుగ శోభ సంతరించుకుంది. చదురుగుడి, వనంగుడి ప్రాంతాల్లో భక్తులు పైడిమాంబ దర్శనానికి వేలాదిగా క్యూ కట్టారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవదాయశాఖ సహాయ కమిషన్‌ కె.శిరీష పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేగవంతంగా దర్శనాలు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఆదివారం రాత్రి ఎక్కడ చూసినా పండగ శోభ కన్పించింది.

జాతరకు 110 ప్రత్యేక బస్సులు

పైడిమాంబ జాతరను పురస్కరించుకుని ఇతర జిల్లాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణాధికారి జి.వరలక్ష్మీ తెలిపారు. విశాఖపట్టణం, సింహాచలం, అనకాపల్లి, శ్రీకాకుళం, చీపురుపల్లి, పాలకొండ, సాలూరు, పార్వతీపురం, ఎస్‌.కోట రూట్లలో వాటిని తిప్పనున్నట్టు తెలిపారు. మొత్తంగా 110 బస్సు సర్వీసులను భక్తుల రద్దీకి అనుగుణంగా కేటాయించామన్నారు.

- పైడిమాంబ సిరిమానోత్సవానికి సమయం సమీపిస్తోంది. దీంతో ఆలయానికి విద్యుత్‌ దీపాలు అలంకరించారు. ఆ వెలుగుల్లో పైడిమాంబ ఆలయం శోభాయమానంగా కన్పిస్తోంది.

మౌలిక వసతుల కల్పనకు చర్యలు

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సుమారు రూ.36 లక్షలతో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు కమిషనర్‌ బాలాస్వామి తెలిపారు. తాగునీటి పంపిణీ, నిరంతర విద్యుత్‌, అలాగే 400మంది పారిశుధ్య కార్మికులతో పారిశుధ్య పనులు, నగరం అంతా విద్యుత్‌ కాంతులు, ఉచిత వైద్య విబిరం, ఉచిత మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోడ్లకు ప్యాచ్‌ వర్కులను పూర్తిచేశామన్నారు.

పండగకు పటిష్ఠ బందోబస్తు

3,500 మంది సిబ్బంది కేటాయింపు

విశాఖ రేంజ్‌ ఐజీ గోపినాథ్‌ జెట్టీ

విజయనగరం దాసన్నపేట, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): పైడిమాంబ తొలేళ్లు, సిరిమానోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జెట్టీ తెలిపారు. ఆదివారం ఎస్పీ దామోదర్‌తో కలిసి పైడిమాంబ ఆలయ పరిసర ప్రాంతాలను సందర్శించి బందోబస్తు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తుల పట్ల సంయమనం పాటించాలని, విధులు బాధ్యతగా నిర్వహించాలన్నారు. అమ్మవారిని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 3 లక్షల 50 వేల మంది భక్తులు జిల్లాకు వచ్చే అవకాశం వున్నందున ఎవరితో వివాదానికి దిగవద్దన్నారు. ఎస్పీ దామోదర్‌ మాట్లాడుతూ, సిరిమాను వెంట అనధికార వ్యక్తులు తిరగకుండా క్లియరెన్స్‌ పార్టీలు ఏర్పాటుచేశామన్నారు. భక్తులకు భద్రతాపరంగా ఖచ్చితమైన సూచనలు మాత్రమే చేయాలని, వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. చైన్‌ స్నాచింగ్‌, దొంగతనాలు జరగకుండా ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రైం బృందాలు అనుమానితులను గుర్తించి వారి వేలిముద్రలను ఎంఎస్‌సీడీ మిషన్లతో తనిఖీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌పీ కిరణ్‌కుమార్‌, డీఎస్పీలు లక్ష్మణమూర్తి, గోవిందరావు, వీరకుమార్‌ రాఘవులు, కోటిరెడ్డి, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2026 | 12:22 AM