Today is the first flight to Bhogapuram భోగాపురానికి నేడే తొలి విమానం
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:29 AM
Today is the first flight to Bhogapuram ఉత్తరాంధ్రకే తలమానికంగా నిలవనున్న భోగాపురం (అల్లూరిసీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయానికి తొలి విమానం రానుంది. ట్రైల్ రన్‌లో భాగంగా ఆదివారం ఎయిర్ ఇండియా వాణిజ్య విమానం ఇక్కడ దిగనుంది.
భోగాపురానికి
నేడే తొలి విమానం
ట్రయల్ రన్ ప్రారంభించనున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
హాజరుకానున్న ఎంపీ కలిశెట్టి
విజయనగరం/ భోగాపురం(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రకే తలమానికంగా నిలవనున్న భోగాపురం (అల్లూరిసీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయానికి తొలి విమానం రానుంది. ట్రైల్ రన్‌లో భాగంగా ఆదివారం ఎయిర్ ఇండియా వాణిజ్య విమానం ఇక్కడ దిగనుంది. ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం సుమారు 11 గంటలకు చేరుకోనుంది. ఈవిమానంలో కేంద్ర పౌరవిమాన యానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనా యుడు, ఉన్నతాఽధికారులు ప్రయాణించనున్నారు. ట్రయల్‌రన్ అనంతరం మే నుంచి పూర్తి స్థాయి రాకపోకలు సాగించేలా ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్టుపై దృష్టిసారించింది.
ఉత్తరాంధ్ర వాసుల కలల ప్రాజెక్టుగా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకొంటోంది. భోగాపురం విమానాశ్రయం దక్షిణ భారతదేశంలోనే ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. 24 గంటల పాటు విమాన సర్వీసులు, అంతర్జాతీయ కనక్టివిటీ, వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర దశ మారబోతోంది. ఎయిర్‌పోర్టుకు మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. తుది మెరుగులు దిద్దుకుంటున్న విమానాశ్రయం ప్రస్తుతం వాయువేగంతో వాస్తవ రూపం దాల్చుతోంది. భూసేకరణ, న్యాయపరమైన చిక్కులన్నీ అధిగమించింది. 2024లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల పరిశీలనకు వచ్చినప్పుడు ప్రకటించినట్లు ఈ ఏడాది జూన్ నాటికల్లా పూర్తి చేయాలన్న సంకల్పంతో పనులను వేగవంతం చేశారు. కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు స్వయంగా పరిశీలిస్తూ పనుల్లో స్పీడు పెంచారు. కలెక్టర్ రామసుందర్ రెడ్డి కూడా ఎయిర్‌పోర్టు పనులను పర్యవేక్షిస్తూ అధికారులతో సమీక్షిస్తూ అడుగులు వేశారు. ముఖ గుర్తింపు ద్వారా పేపర్‌లేస్ ఎంట్రీ, 10కంటే ఎక్కువ ఆధునిక ఏరోబ్రిడ్జిల ద్వారా విమానాల ప్రవేశం, సోలర్ పవర్, వర్షపునీటి రీసైక్లింగ్ చేసే లీడ్ గోల్డెన్ రేటింగ్ నిర్మాణం సాగుతోంది. మొదటి దశలో ఏటా 60లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేలా టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది. భవిషత్తులో దీనిని 1.8 కోట్ల వరకు పెంచే అవకాశం ఉంది. డిసెంబరు 2025 నాటికి 91.7శాతంపైగా పనులు పూర్తయ్యాయి. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తొలి దశలో సుమారు రూ.4,592కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో 136 ఎకరాల్లో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇది విమానయాన రంగంలో వేలాది మంది యువతకు శిక్షణ, ఉపాధిని అందిస్తుంది. విశాఖ ప్రజలకు ఎయిర్‌పోర్టుకు వచ్చేందుకు ఇబ్బందులు లేకుండా మూడు ప్రధాన రహదారులను సిద్ధం చేస్తోంది. జాతీయ రహదారి 16 నుంచి నేరుగా ఎయిర్‌పోర్టుకు అప్రోచ్‌రోడ్లు, ప్లైఓవర్లు నిర్మిస్తున్నారు. విశాఖ పోర్టు నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు సముద్ర తీరం వెంబడి అత్యంత సుందరమైన బీచ్‌రోడ్‌ను బీచ్‌కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఫార్మా, మెరైన్, టెక్స్‌టైల్స్ ఉత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు భారీ కార్గో టెర్మినల్ సిద్ధమవుతోంది. అలాగే విమానాల మరమ్మతుల కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ కారణంగా అంతర్జాతీయ విమానాలు కూడా ఇక్కడకు వస్తాయి.
ఫ విమానాశ్రయం టెర్మినల్ లోపల తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా అలంకరణలు, అల్లూరి భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. టెంపుల్ టూరిజం, హోటళ్లు, బీచ్ టూరిజం అభివృద్ధి కానున్నాయి. సింగపూర్, మలేషియా, ఆగ్నేయ ఆసియా దేశాలతో వ్యాపార సంబంధాలు మెరుగుపడనున్నాయి. రన్‌వే పొడవు ఎక్కువగా ఉండడంతో భవిషత్తులో యూరప్, అమెరికా దేశాలకు విమానాలు నడిపే వీలుంది. జీఎంఆర్ సంస్థ ఈ విమానశ్రయాన్ని 40 ఏళ్ల పాటు నిర్వహించనుంది. 3.8 కిలోమీటర్ల రన్‌వే కారణంగా ప్రపంచంలోనే అతి పెద్ద విమానాలైన ఎయిర్‌బస్ ఎ380, బోయింగ్ 47-8 వంటి భారీ విమానాలు ఇక్కడ ల్యాండ్ కాగలవు.
ఉత్తరాంధ్ర అభివృద్దికి పునాదులు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందనుంది. దీంతో ఆయా ప్రాంతాల ముఖచిత్రామే మారనుంది. మౌలిక సదుపాయల కల్పన పెద్దఎత్తున జరగనుంది. పరిశ్రమలు రానున్నాయి. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. అంతేకాకుండా భవిష్యత్ తరాల ఉన్నతికి ఎడ్యుసిటీ ఎంతగానో దోహదపడనుంది.
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ఆనందంగా ఉంది
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం దాదాపు పూర్తికావడం చాలా ఆనందంగా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం కృషి ఉంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మోదీ-చంద్రబాబు ధ్వయంతో రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతోంది.
- కలిశెట్టి అప్పలనాయుడు, ఎంపీ, విజయనగరం
----------------