పరీక్ష రాయాలంటే..నది దాటాల్సిందే
ABN , Publish Date - Feb 24 , 2026 | 11:13 PM
ఆ విద్యార్థుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇంటర్ పరీక్షలు రాసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
- కేంద్రానికి చేరుకునేందుకు ఇంటర్ విద్యార్థుల కష్టాలు
- ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నాగావళిని దాటుతున్న వైనం
- పూర్ణపాడు-లాబేసు పూర్తికాకపోవడంతో అవస్థలు
పార్వతీపురం/కొమరాడ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఆ విద్యార్థుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇంటర్ పరీక్షలు రాసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు పెద్ద సాహసం చేస్తున్నారు. నాగావళి నదిలో దిగి మోకాళ్ల లోతులో ఉన్న నీటిలో నడుచుకుంటూ అవతల ఒడ్డుకు చేరుతున్నారు. అక్కడి నుంచి తడిచిన దుస్తులతోనే పరీక్ష కేంద్రానికి వెళ్తున్నారు. ఇదీ కొమరాడ మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన విద్యార్థుల పరిస్థితి.
ఇదీ పరిస్థితి..
కొమరాడ మండలంలోని తొడుము, లాబేసు, కొట్టు, తులసివలస, రాయపురం గ్రామాలకు చెందిన 11 మంది ఇంటర్ విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ గ్రామాలన్నీ నాగావళి నదికి అవతల ఉన్నాయి. ఈ విద్యార్థులకు నది ఇవతల ఉన్న కొమరాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రం కేటాయించారు. దీంతో ప్రతిరోజూ నదిలో దిగి మోకాళ్ల లోతులో ఉన్న నీటిలో నడుచుకుంటూ పరీక్ష కేంద్రానికి చేరుతున్నారు. అవతలి ఒడ్డు ఉంచి ఇవతలి ఒడ్డుకు చేరుకునేందుకు గంట సమయం పడుతుంది. సాధారణంగా నీటి ప్రవాహం తక్కువగా ఉంటే ఎటువంటి బెదురు లేకుండా విద్యార్థులు నదిని దాటేస్తుంటారు. కానీ, ఈ నెల 23వ తేదీ రాత్రి ఒడిశాలో కురిసిన వర్షాలతో నాగావళిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని నది దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం ఇబ్బంది ఎదురైనా ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. అయినప్పటికీ ఇంటర్మీడియట్ పాస్ కావాలనే లక్ష్యంతో గుండె నిండా ధైర్యం తెచ్చుకొని నది దాటి వచ్చి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.
ఎన్నాళ్లీ కష్టాలు..
కొమరాడ మండలంలో నాగావళి నది అవతల ఉన్న గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనేకం. ఏ పని కోసమైనా ఇవతల ఉన్న కొమరాడకు రావాల్సిందే. ఈ గ్రామాల నుంచి మండల కేంద్రానికి దూరం నాలుగైదు కిలోమీటర్లు ఉంటుంది. కానీ, మధ్యలో నాగావళి నది ఉండడంతో ప్రయాణానికి ఇబ్బందులు తప్పడం లేదు. వర్షా కాలంలో నదిని దాటేందుకు పడవలను నడుపుతారు. మిగతా రోజుల్లో పడవలు ఉండవు. నదిలో దిగి రాకపోకలు సాగించాల్సిందే. లేదంటే దలైపేట, చీమనాయుడువలస, పెదమేరంగి, పార్వతీపురం తదితర గ్రామాల మీదుగా బస్సులు, ఆటోలు ఇతర వాహనాల్లో 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి కొమరాడకు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇంటర్ పరీక్షల కోసం చుట్టూ తిరిగి వెళ్తే సమయం వృథా అవుతుందనే ఉద్దేశంతో విద్యార్థులు ప్రాణాలకు తెగించి నాగావళి నది దాటి కొమరాడలోని కేంద్రానికి హాజరవుతున్నారు. ఈ గ్రామాల్లో 5వ తరగతి వరకు పాఠశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయులతో పాటు ఇతర అధికారులు కూడా ఒడిశా రాష్ట్రం వనిజ వంతెన మీదుగా ప్రయాణం చేసి ఈ గ్రామాలకు చేరుకుంటుంటారు. పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తయితే తమకు ఈ కష్టాలు ఉండవని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా వంతెన పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
పూర్ణపాడు-లాబేసు వంతెనపై నిర్లక్ష్యం..
నాగావళి నది అవతల ఉన్న తొమ్మిది పంచాయతీలకు చెందిన ప్రజల విన్నపం మేరకు గత టీడీపీ ప్రభుత్వం పూర్ణపాడు-లాబేసు వంతెన పనులకు శ్రీకారం చుట్టింది. ఈ వంతెన కోసం రూ. 10 కోట్లు మంజూరు చేసింది. అయితే కాంట్రాక్టర్ సగం పనులే చేపట్టి వదిలేశాడు. మిగతా పనులు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని గత వైసీపీ పాలకులు గొప్పలు చెప్పారు. కానీ, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ పనులు ప్రారంభంకాలేదు.