To withstand the pressure.. ఒత్తిడిని తట్టుకునేలా..
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:49 PM
To withstand the pressure.. విజయనగరంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా ఆ శాఖ అధికారులు ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం 70 మెగావాట్లు ఉండడంతో రాబోయే రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా రెండు సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఒత్తిడిని తట్టుకునేలా..
కొత్తగా రెండు సబ్‌స్టేషన్ల ఏర్పాటు
93 ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు
చకాచకా సాగుతున్న పనులు
విజయనగరం రింగురోడ్డు, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి):
విజయనగరంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా ఆ శాఖ అధికారులు ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం 70 మెగావాట్లు ఉండడంతో రాబోయే రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా రెండు సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే కొన్నింటి సామర్థ్యం పెంచుతున్నారు. రూ.4 కోట్ల 96 లక్షలతో 93 ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరయ్యాయి. ఇవి ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
మామూలు రోజులు కంటే వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. గత ఇరవై రోజుల నుంచి గ్యాస్ పొదుపును పాటిస్తూ ఎలక్ట్రీక్ స్టౌలు, కుక్కర్లు వినియోగిస్తున్నారు. మైక్రోవోవెన్‌లను కూడా ఎక్కువగా వాడుతున్నారు. వేసవి తీవ్రత పెరగడంతో ఏసీలు, కూలర్ల వినియోగం అమాంతం పెరిగింది. అదే విధంగా ఫ్యాన్లు, ఫ్రీజ్‌లు పూర్తిగా ఆన్‌లో ఉంటున్నాయి. పగలు కంటే రాత్రి వేళల్లో విద్యుత్ వినియోగం అధికం. నగరంలో వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, అపార్టుమెంట్లు, వాణిజ్య సంస్థలు ఉండడంతో విద్యుత్ వినియోగం మరింత ఎక్కువైంది. విజయనగరం నగరపాలక సంస్థగా ఆవిర్భవించిన తరువాత పెద్ద, పెద్దషోరూంలు, కార్పొరేట్ సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ పరిస్థితిని తట్టుకునేలా విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి
- విజయనగరం పట్టణంలో 14 సబ్‌స్టేషన్‌లు, 1 ఈహెచ్‌టీ సబ్ స్టేషన్‌లు వున్నాయి
- 4,099 ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేస్తున్నాయి.
- విద్యుత్ డిమాండ్ 70 మెగావాట్లుగా ఉంది.
- 1,02,336 మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు
- రెండు కొత్త సబ్‌స్టేషన్లు (సోనియానగర్, రింగురోడ్డు)ఏర్పాటు చేస్తున్నారు.
- సామర్థ్యం పెంపు(ఉడాకాలనీ, తోటపాలెం, బుచ్చెన్నకోనేరు వద్ద)పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తికానున్నాయి.
- రూ.4 కోట్ల 96 లక్షలతో 93 ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరయ్యాయి.
- సోలార్ రూప్‌టాప్ యూనిట్లు 2,124 ఉన్నాయి.