Share News

To raise one's voice..! గళమెత్తాలని..!

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:16 AM

To raise one's voice..! జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు పట్టాలెక్కడం లేదు. కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పాత బకాయిలు చెల్లించి పనులకు నిధులు కేటాయించినా.. పెరిగిన వ్యయంతో ఏ మూలకూ చాలడం లేదు. తారకరామతీర్థ సాగర్‌ పరిస్థితి ఇందుకో ఉదాహరణ. జిల్లాలో అంతర్‌ రాష్ట్ర, జిల్లా రహదారులు గాడితప్పాయి. కొన్నింటికి గతంలో మరమ్మతులు చేశారు. మిగతా వాటిని విస్మరించారు. గిరిజన విశ్వ విద్యాలయ భవననాలు ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియడం లేదు. ప్రభుత్వ వైద్య కాలేజీ భవన నిర్మాణం పూర్తికావడం లేదు.

To raise one's voice..! గళమెత్తాలని..!

గళమెత్తాలని..!

ఎమ్మెల్యేలపై గంపెడాశలు పెట్టుకున్న జిల్లా ప్రజలు

పెండింగ్‌ ప్రాజెక్టులను అసెంబ్లీలో ప్రస్తావించాలని విన్నపం

పూర్తి కాని గిరిజన వర్సిటీ భవనాలు

కానరాని పర్యాటకాభివృద్ధి

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

- దత్తిరాజేరు మండలం దత్తి సమీపంలో సారవగెడ్డ ఆనకట్ట నిర్మాణానికి 2025 ఆక్టోబరు 1న సీఎం చంద్రబాబు దత్తిరాజేరు పర్యటనకు వచ్చినప్పుడు రూ.27.5 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. రెండేళ్లలో ఈ వంతెన నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పారు. సుమారు 10 నెలల గడుస్తున్న కనీసం ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇదే మండలంలో ఏడొంపుల గెడ్డ పరిస్థితి కూడా ఇదే. వంతెన నిర్మాణానికి సర్వే పూర్తి చేశారు. కానీ పనులు ప్రారంభానికి నోచుకోలేదు.

- మెంటాడ రైల్వేగేటు వంతెన ఏర్పాటుకు రూ.48.46 కోట్లు మంజూరైంది. సర్వే పనులు జరిగి నెలలు గడుస్తోంది. ఇంతవరకూ పనులు ప్రారంభం కాలేదు. గేటుపడితే ప్రయాణికులు, వాహనదారుల బాధలు వర్ణణాతీతం.

- బొబ్బిలి సీహెచ్‌సీని 100 పడకలుగా అప్‌గ్రేడ్‌, లోచర్ల, రాముడువలస ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు ఇంకా గాల్లోనే ఉన్నాయి. బొబ్బిలి ప్రధాన రహదారి విస్తరణ కూడా పెండింగ్‌లోనే ఉంది.

- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంకావడం సంతోషించదగ్గ విషయమే కానీ నిర్వాసితుల పునరావాస కాలనీల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించలేదు. శ్మశానవాటికలు, ఆలయాలు, ఇతరత్రా ప్రజోపయోగకరమైన నిర్మాణాలకు స్థలాలు కేటాయించలేదు.

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు పట్టాలెక్కడం లేదు. కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పాత బకాయిలు చెల్లించి పనులకు నిధులు కేటాయించినా.. పెరిగిన వ్యయంతో ఏ మూలకూ చాలడం లేదు. తారకరామతీర్థ సాగర్‌ పరిస్థితి ఇందుకో ఉదాహరణ. జిల్లాలో అంతర్‌ రాష్ట్ర, జిల్లా రహదారులు గాడితప్పాయి. కొన్నింటికి గతంలో మరమ్మతులు చేశారు. మిగతా వాటిని విస్మరించారు. గిరిజన విశ్వ విద్యాలయ భవననాలు ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియడం లేదు. ప్రభుత్వ వైద్య కాలేజీ భవన నిర్మాణం పూర్తికావడం లేదు. పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించడం లేదు. తీరంలో జెట్టీ నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆచరణ దిశగా అడుగు పడడం లేదు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి కానీవాటిని అభివృద్ధి చేయడం లేదు. వీటన్నింటిపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం ఎత్తాలని జిల్లా ప్రజలంతా కోరుతున్నారు.

విజయనగరం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):

వ్యవసాయాధారిత జిల్లా కానీ వర్షాధారమే దిక్కు అవుతోంది. రైతులను ఆదుకునే ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు రైతులకు అండగా లేవు. కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పాత బకాయిలు చెల్లించి పనులకు నిధులు కేటాయించినా.. పెరిగిన వ్యయంతో ఏ మూలకూ చాలడం లేదు. దీంతో రైతులు బేలచూపులు తప్పడం లేదు. రెండు దశాబ్దాలుగా తారకరామతీర్థ సాగర్‌ అసంపూర్తిగానే ఉంది. అప్పట్లో అంచనా వ్యయం కేవలం రూ.220.04 కోట్లు. ప్రస్తుతం రూ.808.34 కోట్లకు పెరిగింది. ఇటు సేద్యానికి..అటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నీరు సరఫరా చేసే ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను కూటమి ప్రభుత్వం గుర్తించింది. అరకొర కేటాయింపులతో పనులు జోరందుకోవడం లేదు. నాగావళిపై నిర్మించిన తోటపల్లి ఉమ్మడి జిల్లాకు వరప్రదాయిని. 2.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇప్పటివరకూ 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 64 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. 34 డిస్ర్టిబ్యూషన్‌ కాలువలకు 26 పూర్తయ్యాయి. మరో 8 నిర్మించాల్సి ఉంది. గజపతినగరం బ్రాంచి కెనల్‌ కూడా నిధుల కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటివరకూ కేవలం 44 శాతం పనులు మాత్రమే జరిగాయి. 219.31 ఎకరాలు సేకరిస్తేనే పనులు ముందుకు సాగేది.

- వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు ఆధునీకీకరణకు రూ.63.50 కోట్లతో పాలనా ఆమోదం లభించింది. ఐదేళ్లలో 22 శాతం మాత్రమే పనులు జరిగాయి. ఒట్టిగెడ్డ జలాశయానికి రూ.44.85 కోట్లతో పాలనా ఆమోదం లభించింది. ఐదేళ్లలో 5 శాతం పనులు మాత్రమే జరిగాయి. పెదంకలాం ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.17.50 కోట్లతో ఆమోదం లభించింది. రూ.36 లక్షల బకాయి ఉండడంతో కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేశారు. పెద్దగెడ్డ జలాశయం బాగుచేసేందుకు రూ.28.18 కోట్లతో ఆమోదం తెలిపారు. ఐదేళ్లలో 10 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.

ఆ మూడు రోడ్ల గురించి..

జిల్లాలో అంతర్‌ రాష్ట్ర, జిల్లా రహదారులు ఉన్నాయి. తగరపువలస-విజయనగరం-రాజాం రహదారి ప్రధానమైనది. గత ఐదేళ్లలో కనీస నిర్వహణ లేక దారుణంగా మారింది. దీనిని పీపీపీ పద్ధతిలో పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో విజయనగరం-పార్వతీపురం, చిలకపాలెం-పార్వతీపురం రోడ్లు సైతం దారుణంగా మారాయి. వాటిని సైతం పూర్తిచేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలో 1505.64 కిలోమీటర్ల మేర అన్నిరకాల రహదారులు ఉన్నాయి. కూటమి అధికారంలోకి రాగానే తక్షణ మరమ్మతులకుగాను రూ.23.52 కోట్లు మంజూరు చేసింది. ఏడాది కాలంలో ప్రాధాన్యతాక్రమంలో వివిధ పద్దుల కింద నిధులు మంజూరయ్యాయి. కొన్నింటి పనుల్లో జాప్యం జరుగుతోంది. మిగతా రోడ్ల గురించి కూడా ఎమ్మెల్యేలు పట్టుబడితే బాగుంటుంది.

గిరిజన యూనివర్సిటీ భవనాలు ఎప్పటికో

జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం రూపుదాల్చడానికి 11 సంవత్సరాలు పట్టింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా అప్పట్లో గిరిజన యూనివర్సిటీని కేటాయించారు. తొలుత శృంగవరపుకోట నియోజకవర్గంలోని రెల్లిలో స్థల ఎంపికను పూర్తిచేశారు. వైసీపీ ప్రభుత్వం యూనివర్సిటీని దత్తిరాజేరు-మెంటాడ మండలాల్లోని సరిహద్దు ప్రాంతాలకు మార్చింది. ప్రస్తుతం 519 ఎకరాల్లో పనులు ప్రారంభించారు. ఇక్కడే కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. వీటి పనులు వేగంగా జరగడం లేదు.

ప్రగతి లేని ఇతర రంగాలు

జిల్లాలో విద్య, వైద్యరంగాలపై దృష్టిపెట్టాల్సిన అవసరముంది. ప్రభుత్వ వైద్య కాలేజీ నిర్మాణం పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలి. మరోవైపు విద్యాపరంగా వసతులు మెరుగుపడాలి. విజయనగరం కార్పొరేషన్‌ విస్తరించినా.. నగరీకరణ జరుగుతున్నా అనుకున్న స్థాయిలో అభివృద్ధికి లేదు. మరోవైపు జిల్లాలో 27 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో పదుల సంఖ్యలో మత్స్యకార గ్రామాలున్నాయి. వీటి పరిధిలో జెట్టి నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆచరణ కొరవడుతోంది. జిల్లాలో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నింటిపై ఎమ్మెల్యేలు గళం ఎత్తితేనే జిల్లాకు మేలు జరుగుతుంది.

------------------

Updated Date - Aug 17 , 2026 | 12:16 AM