To put a stop to TB! టీబీకి చెక్ పడాలని..!
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:29 PM
To put a stop to TB! టీబీ ముక్తాభారత్ అభియాన్‌లో భాగంగా జరుపుతున్న క్షయ నిర్ధారణ పరీక్షలకు గత ఏడాది జిల్లా ఎంపికైంది. వేపాడ, బొద్దాం, కొత్తవలస, వియ్యంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని పల్లెల్లో ప్రయోగాత్మకంగా క్షయ (టీబీ) నివారణకు గుర్తింపు పరీక్షలు చేపట్టారు.
టీబీకి చెక్ పడాలని..!
పల్లెల్లో టీబీ (క్షయ) నిర్ధారణ పరీక్షలు
ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ
ముందుగా గుర్తించడం ద్వారా నివారణ చర్యలు
వ్యాప్తి చెందకుండా కట్టడి
గత ఏడాది నాలుగు పీహెచ్‌సీల పరిధిలో ప్రయోగం
తాజాగా మిగిలిన పీహెచ్‌సీలకు వర్తింపు
శృంగవరపుకోట నుంచే శ్రీకారం
టీబీ ముక్తాభారత్ అభియాన్‌లో భాగంగా జరుపుతున్న క్షయ నిర్ధారణ పరీక్షలకు గత ఏడాది జిల్లా ఎంపికైంది. వేపాడ, బొద్దాం, కొత్తవలస, వియ్యంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని పల్లెల్లో ప్రయోగాత్మకంగా క్షయ (టీబీ) నివారణకు గుర్తింపు పరీక్షలు చేపట్టారు. నిర్ధారణ అయిన వారికి మందులు ఇవ్వడం ద్వారా చాలా మందిలో మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ గ్రామాల్లోనూ పరీక్షలు నిర్వహించతలపెట్టారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు(వెల్‌నెస్ సెంటర్‌లు)లో పని చేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీలకు ఈ బాధ్యతలను అప్పగించారు.
శృంగవరపుకోట, జూలై 16(ఆంధ్రజ్యోతి):
- కొట్టాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిఽధిలో 52 మంది టీబీ (క్షయ) బాధితులు ఉన్నారు. ఇందులో 80 శాతం మంది శృంగవరపుకోటలో ఉండడంతో తాజాగా పంచాయతీ కార్యాలయంలో క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శిబిరం నిర్వహించింది. ప్రతి ఒక్కరికీ ఎక్సరే తీశారు. ఈనెల 27 వరకు పేదఖండేపల్లి, కృష్ణాపురం, పోతనాపల్లి, చామలాపల్లి, ధర్మవరం, వేములాపల్లి, ముషిడిపల్లి, కొత్తకోట, కొట్టాం, గోపాలపల్లి గ్రామాల్లోనూ ఇందుకోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏఎన్‌ఎం, ఆఽశ కార్యకర్తల సహకారంతో జరగనున్న ఈ పరీక్షలను క్షయ వ్యాధి నివారణ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఈ ఏడాది జిల్లాలో తొలిసారిగా శృంగవరపుకోట గ్రామం నుంచి బుధవారం వైద్య పరీక్షలు మొదలు పెట్టారు. వైద్య ఆరోగ్య శాఖలో భాగమైన టీబీ పర్యవేక్షకుడు శ్రీనివాసరావు, కొట్టాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీహెచ్‌వో వేణుగోపాల్, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ, ఆశ కార్యకర్తలు అనుమానితులకు పంచాయతీ కార్యాలయానికి రప్పించారు. 154 మందికి ఎక్సరేలు తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లే పనిలేకుండా గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తుండడంతో అనుమానితులకు వ్యయప్రయాసలు తప్పనున్నాయి. క్షయను ఎక్షరే ద్వారా గుర్తించేందుకు సంబంధిత యంత్రాన్ని వెనకే తీసుకువెళ్తున్నారు.
జిల్లాలో క్షయ (టీబీ) బాధితులు పెరుగుతున్నారు. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తోంది. కట్టడి చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా చాప కింద నిరులా వ్యాప్తి చెందుతోంది. ఊపిరితిత్తులతో పాటు ఇతర శరీర అవయవాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆకలి తగ్గడంతో బలహీనంగా తయారవుతారు. వీరితో నివశిస్తున్న వారితో పాటు చుట్టుపక్కల వారిపైనా ప్రతాపం చూపుతోంది. విపరీతమైన దగ్గుతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. రెండు వారాలకు మించి దగ్గు తగ్గకుంటే సమీప ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్నప్పటికీ అదే తగ్గిపోతుందని అలస్యం చేస్తున్నారు. వ్యాధి గుర్తించక మందులు వాడడం లేదు. దీంతో వ్యాధి ముదరడంతో పాటు మరి కొందరికి వ్యాపిస్తోంది. ఇలా వ్యాప్తి చెందకుండా గ్రామాల్లో పని చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 60 సంవత్సరాలు దాటిన వారు, డయాబెటిక్‌తో బాధపడుతున్న వారు, హెచ్‌ఐవీ బాధితులు, దీర్ఘకాలిక రోగులు, ఐదేళ్ల క్రితంలోపు టీబీ బారిన పడినవారు, టీబీ మందులు వాడుతున్నవారితో ఒకే ఇంట్లో నివాశిస్తున్న వారు, చుట్టుపక్కల నివాసితులను గతంలో పీహెచ్‌సీలకు తీసుకువెళ్లి పరీక్షించారు. ఉచితంగా మందులు ఇచ్చారు. క్రమం తప్పకుండా మందులు వాడేలా వారిని పర్యవేక్షించారు.
నిర్లక్ష్యం చేస్తున్నారనే..
ఇప్పటికీ చాలా మంది వైద్యశాఖ అధికారులు చెప్పిన మాట వినడం లేదు. మెండిగా వ్యవహరిస్తున్నారు. బాగానే వున్నామంటూ దబాయిస్తున్నారు. ఆరోగ్య తనిఖీల కోసం పనులు మానుకొని అంత దూరం రాలేమంటూ ముఖం చాటేస్తున్నారు. వీరిని ఒప్పించి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకువెళ్లినప్పటికి కొందరికి పాజిటివ్ వచ్చేస్తోంది. అప్పటికే నలుగురిలో తిరిగేయడంతో మరికొందరికి వ్యాప్తి చెందుతోంది. దీన్ని గుర్తించిన భారత్ ప్రభుత్వం గత ఏడాది రాష్ట్రానికి ఒక జిల్లాను టీబీ ముక్తా భారత్ అభియాన్ కింద ఎంపిక చేసింది. ఎంపిక చేసిన జిల్లాలోని కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో క్షయ (టీబీ) పరీక్షలు జరిపారు. వ్యాధి నిర్ధారణ జరిగిన వారితో మందులు వాడించడంతో పాటు చుట్టుపక్కల వారితో ఏ విదంగా మసులుకోవాలో జాగ్రత్తలు సూచించారు. ఈ ప్రయోగం ఫలించడంతో మిగిలిన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లోనూ ఈ క్షయ(టీబీ) వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. పూర్తిగా ఈ వ్యాధిని జిల్లా నుంచి పారదోలాలని సంకల్పించారు. రెండో విడతలో ఎస్.కోట నుంచి ఆరోగ్య పరీక్షలకు శ్రీకారం చుట్టారు.