Share News

Funds.. నిధులు పక్కదారి పట్టకుండా..

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:18 AM

To Prevent Misuse of Funds.. త్వరలోనే 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్న నేపథ్యంలో ప్రతి పంచాయతీకి నూతన బ్యాంకు ఖాతాలు తెరవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిధులను సక్రమంగా వినియోగించాలనే ఉద్దేశంతో ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శి పేరిట జాయింట్‌ అకౌంట్‌ ప్రారంభించాలని ఉత్తర్వులు విడుదల చేసింది.

 Funds.. నిధులు పక్కదారి పట్టకుండా..

  • ప్రత్యేకాధికారి, కార్యదర్శి పేరుతో జాయింట్‌ అకౌంట్‌

  • సర్పంచ్‌ల డిజిటల్‌ సంతకం స్పెషల్‌ ఆఫీసర్లకు బదిలీ

పాలకొండ, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి) : త్వరలోనే 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్న నేపథ్యంలో ప్రతి పంచాయతీకి నూతన బ్యాంకు ఖాతాలు తెరవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిధులను సక్రమంగా వినియోగించాలనే ఉద్దేశంతో ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శి పేరిట జాయింట్‌ అకౌంట్‌ ప్రారంభించాలని ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు.

జిల్లాలో 15 మండలాలు, 451 గ్రామ పంచాయతీ లున్నాయి. 312 సచివాలయాలున్నాయి. వాటి పరిధిలో 451 మంది పంచాయతీ సెక్రటరీలు అవసరం కాగా 331 మంది విధులు నిర్వహిస్తున్నారు. సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిన తర్వాత నుంచి 320 మంది పంచాయతీల స్పెషల్‌ ఆఫీసర్లను నియమించారు. కాగా నిధులు డ్రా , డిజిటల్‌ సంతకం తదితర అంశాల్లో సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు పంచాయతీల్లో నూతన ఖాతాలు తెరిచేలా చర్యలు చేపడుతున్నారు. త్వరలో మంజూరు కానున్న 16వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీల నిర్వహణతో పాటు అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. అయితే నిధులను పారదర్శకంగా వినియోగించేందుకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ ఆఫీసర్‌, కార్యదర్శులతో జాయింట్‌ అకౌంట్లు తెరుస్తున్నారు. కాగా ఇప్పటివరకు సర్పంచ్‌కు ఉన్న డిజిటల్‌ సంతకాన్ని ప్రత్యేకాధికారికి బదలాయింపు చేస్తున్నారు. పంచాయతీలకు ఇప్పటి వరకు ఉన్న బ్యాంకుల ఖాతాలను అవసరానికి అనుగుణంగా కొనసాగిస్తూనే.. ప్రత్యేకాధికారి పాలనలో నిధులు నిర్వహణకు అవసరమైన చోట వివిధ బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. నూతన బ్యాంకు ఖాతాను తెరిచేందుకు కలెక్టర్‌ నియామకం ఉత్తర్వులు, బాధ్యతల స్వీకరణ, అధికారిక గుర్తింపు, ఈకేవైసీ తదితర పత్రాలు ప్రత్యేకాధికారి సమర్పించాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేకాధికారులకు ఎటువంటి చెక్‌బుక్‌లు ఇవ్వరు. 16వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాలంటే అధికారులు స్వయంగా బ్యాంక్‌కు వెళ్లి నిధులు డ్రా చేయాల్సి ఉంటుంది. ఇకపోతే బ్యాంకు ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. పంచాయతీకి సంబంధించిన అఽధీకృత వ్యక్తుల వివరాలను నవీకరించి బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేయాలి. దీంతో నిధులు విడుదల, చెల్లింపులు, లావాదేవీలకు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ప్రత్యేకాధి కారుల పాలనలో నిధులు వినియోగంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించే అవకాశం ఉంటుంది. తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి అవసరాలకు నిధులను వినియోగించాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులు చేపట్టడం, వాటికి సంబంధించిన చెల్లింపులు విషయంలో ఉన్నతాధికారుల అనుమతులు తప్పనిసరి. మొత్తంగా ఈ విధానంతో ప్రతి రూపాయి వినియోగానికి సంబంధించి లెక్కలు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. దీనిపై డీపీవో ఎస్‌.రవీంద్రను వివరణ కోరగా.. ‘నిధుల పారదర్శకంగా వినియోగించేందుకు పంచాయతీ సెక్రటరీ, ప్రత్యేకాధికారితో జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయిస్తున్నాం. 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఖాతాల ద్వారా నిధుల ఖర్చు, జమ చేసుకునే అవకాశం కలుగుతుంది. ’ అని తెలిపారు.

Updated Date - Sep 02 , 2026 | 12:18 AM