Share News

Ugadi: తెలుగుదనం ఉట్టిపడేలా..

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:21 AM

Ugadi: పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని గురువారం జిల్లా వాసులు ఘనంగా జరుపుకొన్నారు.

Ugadi:  తెలుగుదనం ఉట్టిపడేలా..
ఉగాది వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, యశ్వంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధికారులు

- జిల్లాలో ఘనంగా ఉగాది వేడుకలు

- ఆలయాల్లో పంచాంగ శ్రవణాలు

- ఏరువాక చేపట్టిన రైతన్నలు

పార్వతీపురం/టౌన్‌/బెలగాం/సాలూరు, మార్చి 19(ఆంధ్రజ్యోతి): పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని గురువారం జిల్లా వాసులు ఘనంగా జరుపుకొన్నారు. తెల్లవారు జామునే పవిత్ర స్నానాలు ఆచరించి కొత్త వస్త్రాలు ధరించి ఉగాది సంబరాల్లో పాల్గొన్నారు. రైతన్నలు ఏరువాకను నిర్వహించి పొలం పనులకు శ్రీకారం చుట్టారు. పాడిపంటలు బాగా పండాలని పూజలు చేశారు. దేవాలయాలు, గ్రామ చావిడిల వద్ద పురోహితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. కొత్త ఏడాదిలో వర్షాలు, వాతావరణ పరిస్థితులతో పాటు రాశి ఫలాలను వివరించారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మామిడికాయలు, వేపపువ్వుతో తయారు చేసిన పచ్చడిని ప్రసాదంగా స్వీకరించారు. చాలామంది కొత్త వాహనాలు, బంగారం, గృహోపకరణాలు, నూతన వస్త్రాలను కొనుగోలు చేశారు. సాలూరు పట్టణంలోని శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ఉగాది వేడులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. పార్వతీపురంలోని జీజే కళాశాల ఆవరణలోని మన్యం ఆడిటోరియంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ వైశాలి, డీఆర్వో హేమలత పాల్గొన్నారు. ప్రముఖ పంచాంగకర్త దార్లపూడి లక్ష్మీనరసింహారావు పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో కవులు సిరికి స్వామినాయుడు, బౌరోతు శంకరరావు, కిలపర్తి దాలినాయుడులు తమ కవితలను వినిపించారు. పలు పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నూతన తెలుగు సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో చెడు తొలగిపోయి, సంతోషం నిండాలని, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని తెలిపారు. పండితులు, కవులకు దుశ్శాలువతో సత్కరించి, నగదు బహూకరించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి మన్మథరావు, ప్రత్యేక ఉప కలెక్టర్‌ దిలీప్‌ చక్రవర్తి, డీఈవో బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 12:21 AM