To listen the problems గోడు విన్పించాలని..
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:01 AM
To listen the problems జిందాల్ భూసేకరణతో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు నిర్వాసితులు మరోసారి సమాయత్తం అయ్యారు. 2007-2008 సంవత్సరంలో భూ సేకరణ తంతు నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను జాతీయ ఎస్‌టీ కమిషన్ సభ్యుడు జాతోతు హుస్సేన్‌కు తెలియజేయాలనుకుంటున్నారు.
గోడు విన్పించాలని..
సిద్ధమైన జిందాల్ భూ నిర్వాసితులు
నేడు ఎస్.కోటలో జాతీయ ఎస్‌టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ పర్యటన
గిరిజన ఆవాసాలకు వెళ్లి వారితో మాట్లాడే అవకాశం
శృంగవరపుకోట మార్చి 29 (ఆంధ్రజ్యోతి):
జిందాల్ భూసేకరణతో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు నిర్వాసితులు మరోసారి సమాయత్తం అయ్యారు. 2007-2008 సంవత్సరంలో భూ సేకరణ తంతు నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను జాతీయ ఎస్‌టీ కమిషన్ సభ్యుడు జాతోతు హుస్సేన్‌కు తెలియజేయాలనుకుంటున్నారు. ఆయన సోమవారం ఎస్.కోట మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు స్థానిక ఆర్‌కే ఫంక్షన్‌హాల్‌లో జరిగే బహిరంగ సభలో ప్రజలతో మాట్లాడతారు. మధ్యాహ్నం 1గంట తర్వాత గిరిజన ఆవాస ప్రాంతాలకు వెళ్లనున్నారు. సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. వారి సమస్యలపై అర్జీలు కూడా స్వీకరించనున్నారు. ఈ వివరాలను శృంగవరపుకోట తహసీల్దార్ డి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఐదు గ్రామాల్లో భూసేకరణ
2007-2008 సంవత్సరంలో జిందాల్ సౌత్‌వెస్ట్ అల్యూమినియం కంపెనీకి ఎస్.కోట మండల పరిధిలో కిల్తంపాలెం, ముషిడిపల్లి, పెదఖండేపల్లి, చీడీపాలెం, మూలబొడ్డవర గ్రామాల్లో 1127.76 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో 919.22 ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయి. దాదాపు 60శాతానికి పైగా గిరిజన రైతులు వాటిలో సాగుచేసుకుంటున్నారు. మామిడి, జీడి, కొబ్బరితోటలతో ఉన్న ఆ భూములను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా సేకరించింది. విధిలేని పరిస్థితుల్లో గిరిజన రైతాంగం ఆ భూములను వదులుకుంది. దీంతో వారంతా ఏటా వచ్చే ఫలసాయం కోల్పోయారు.
హామీలిచ్చి.. విస్మరించి
భూసేకరణ సమయంలో జిందాల్ యాజమాన్యం ఉద్యోగాలు, షేర్లు, ఇతర ప్రయోజిత సదుపాయాలను కల్పిస్తామని నిర్వాసితులకు హామీ ఇచ్చింది. వాటిల్లో అత్యధికశాతం నెరవేర్చలేదు. ఇంతవరకు ప్రతిపాదిత పరిశ్రమనూ నిర్మించలేదు. కనీసం పునాదిరాయి పడలేదు. దీంతో భూనిర్వాసిత రైతులు భూమి స్వాధీనం చేసుకోవడానికి వెళ్లడం యాజమాన్య ప్రతినిధులు నచ్చజెప్పి వెనక్కి పంపడం కొన్నాళ్లుగా పరిపాటిగా జరిగేది.
కొత్త ప్రతిపాదనపై మండిపాటు
జిందాల్ యాజమాన్యం ప్రతిపాదిత అల్యూమినియం శుద్ధి కర్మాగారం స్థాపించకుండా జిందాల్ ఇండస్ట్రీయల్ పార్కుపేరుతో ఎంఎస్‌ఎంఈ(సూక్ష్మచిన్నమధ్యతరహా) పరిశ్రమల నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. ఈవిషయం తెలుసుకున్న భూనిర్వాసిత రైతులు యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. గత ఏడాది .జూన్ నుంచి ఆందోళన బాట పట్టారు. తమ దగ్గర తీసుకున్న భూములతో జిందాల్ యాజమాన్యం రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటోందని మండిపడుతున్నారు. భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలను ఎవ్వరు నెరవేరుస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపాదిత పరిశ్రమ నిర్మాణం జరగనందున తిరిగి భూములు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
చిగురించిన ఆశలు
నిర్వాసితులు భూముల్లోకి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుంటుండటంతో స్థానికంగా తరకూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో జాతీయ ఎస్‌టీ కమిషన్, న్యాయ స్థానాలను ఆశ్రయించారు. ఈనేపథ్యంలో జాతీయ ఎస్‌టీ కమిషన్ సభ్యుడు గిరిజన ఆవాసాలకు వస్తుండడంతో జిందాల్ భూసమస్యకు పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయంతో నిర్వాసిత రైతులు ఉన్నారు. భూసేకరణ సమయంలో జిందాల్ యాజమాన్యం ఇచ్చిన హామీలు.. నెరవేర్చకపోవడంతో తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు.