Share News

To give funds.. నిధులివ్వాలని..

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:19 AM

To give funds.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు మరోసారి వస్తున్నారు. ఈ నెల 28న చీపురుపల్లి మండలం రావివలసలో పేదలకు పింఛన్లు అందివ్వనున్నారు.

To give funds.. నిధులివ్వాలని..
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి

నిధులివ్వాలని..

జిల్లా ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అవసరం

బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం

త్వరగా పనులు చేపట్టాలని జిల్లా ప్రజల విన్నపం

నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

విజయనగరం/ చీపురుపల్లి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు మరోసారి వస్తున్నారు. ఈ నెల 28న చీపురుపల్లి మండలం రావివలసలో పేదలకు పింఛన్లు అందివ్వనున్నారు. గత ఏడాది దత్తిరాజేరు మండలానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చారు. ఇదే సమయంలో బడ్జెట్‌లోనూ జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చారు. అవన్నీ నెరవేరాలంటే మరిన్ని నిధులు అవసరం. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వరగా చేపట్టి పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

విశాఖ ఆర్థిక ప్రాంతంలో భాగంగా 8 జిల్లాలకు కలిపి రూ.28 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించిన విషయం తెలిసిందే. ఆపై ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి రూ.4 వేల కోట్లు కేటాయించారు. ఈ నిధులు సకాలంలో విడుదల చేసి జిల్లా అభివృద్ధికి మరింత సహకారం అందించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. 19,85,221 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రారంభంలో రూ.1127.58 కోట్ల వ్యయంతో పాలనా అనుమతి లభించింది. ఇప్పటివరకూ రూ.900 కోట్ల వరకూ వెచ్చించినట్టు గణాంకాలు చెబుతు న్నాయి. అయితే ఏటా ఖరీఫ్‌లో 80 వేల ఎకరాల ఆయకట్టుకు కూడా సాగునీరు అందడం గగనంగా మారింది. వైసీపీ పాలనలో ఏడాదికి రూ.100 కోట్లు విడుదల చేసినా.. ప్రధాన పనులు పూర్తిచేసేవారమని యంత్రాంగం చెబుతోంది. చివరకు కాంట్రాక్టర్‌కు సైతం రూ.6 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఆ పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తూ పనులు ప్రారంభించింది.

చెప్పారు.. ఆచరించి చూపారు

గత ఏడాది అక్టోబరులో పింఛన్ల పంపిణీకి దత్తిరాజేరు మండలం దత్తి వచ్చిన సీఎం చంద్రబాబు ఆ సమయంలో కిడ్నీ బాధితుడు అప్పలరాజుకు త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ప్రకటించారు. నిర్మించి ఇచ్చారు. అదే గ్రామానికి చెందిన ధనుంజయ్‌కు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు.

- శాసనపల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.12 కోట్లు విడుదల చేశారు. నిర్మాణ పనులూ ప్రారంభమయ్యాయి.

- సారవగెడ్డ మినీ రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.27 కోట్లు మంజూరు చేశారు. పనులు ప్రారంభం కావాల్సి ఉంది.

- గజపతినగరం మర్రివలస గ్రామం వెళ్లేందుకు చంపావతి నది మీదుగా వంతెన నిర్మాణం కోసం రూ.6.20 కోట్లు కేటాయించారు. ఆ పనులు జరుగుతున్నాయి. గుర్ల గెడ్డ మినీ రిజర్వయరు కోసం ఇటీవల బడ్జెట్‌లో నిధులు కేటాయించటంతో ఆ ప్రాంత పజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- దత్తిరాజేరు మండలంలో వంతెనల నిర్మాణానికి రూ.89 కోట్లు మంజూరుచేశారు. పనులు మొదలుకావాల్సి ఉంది.

తారకరామతీర్థ సాగర్‌

తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టుకు రూ.739 కోట్లకు పాలనామోదం లభించింది. ఇప్పటివరకూ రూ.310 కోట్ల వరకూ పనులు జరిగినట్టు తెలుస్తోంది. ఇంకా రూ.429 కోట్ల వరకూ పనులు చేయాల్సి ఉంది. జగన్‌ సర్కారు ఈ ప్రాజెక్టును పూర్తిగా విస్మరించింది. నిర్వాసితుల సమస్యకూ పరిష్కారం చూపలేకపోయింది. కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాజెక్టుగా భావించి ఈ వార్షిక బడ్జెట్‌లో రూ.68 కోట్లు కేటాయించింది.

- నాగావళిపై నిర్మించిన నారాయణపురం ఆనకట్ట ద్వారా 38 వేల ఎకరాలకు సాగునీరు అందేది. ఆధునికీకరణ పనులు చేయక దయనీయంగా మారింది. వైసీపీ హయాంలో రూ.14 కోట్ల ఖర్చును గణాంకాల్లో చూపారు. పనులు చేయలేదు.

- మడ్డువలస రిజర్వాయర్‌తో పాటు కాలువల ఆధునికీకరణకు రూ.2.50 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. సీఎం సానుకూలంగా స్పందించాలని జిల్లా వాసులు కోరతున్నారు.

పరిశ్రమలు తెరిపిస్తే మేలు

జిల్లాలో పరిశ్రమలను తెరిపించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్‌తో పాటు ఇతరత్రా రాయితీలను ప్రకటించింది. మరిన్ని ప్రోత్సాహకాలు అవసరం. పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు వేలాది మంది కార్మికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిస్తున్న పరిశ్రమల మూతకు చాలా కారణాలున్నాయి. ప్రధానంగా ముడిసరుకుల కొరత వేధిస్తోంది. ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలదీ అదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా పది వరకూ ఈ పరిశ్రమలు నడిచేవి. వాటికి కూడా ముడి సరుకు కొరత, విద్యుత్‌ చార్జీల పెంపు తదితర కారణాలతో పరిశ్రమలు నిర్వహించలేక యాజమాన్యాలు చేతులెత్తేశాయి. నాలుగేళ్ల కిందట గర్భాం మండలంలోని ఆంధ్రా ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమ మూతపడింది. గత ఏడాది జూలైలో స్మెల్‌టెక్‌ పరిశ్రమ మూతపడింది. వ్యవసాయ అనుబంధంగా నడిచే రెండు సుగర్‌ ఫ్యాక్టరీలు(భీమసింగి, ఎన్‌సీఎస్‌) కూడా మూతపడ్డాయి.

మారుతున్న రోడ్లు

కూటమి ప్రభుత్వంలో రహదారులు మారుతున్నాయి. చిలకపాలెం-రాజాం-జైపూర్‌ రోడ్డు.. అలికాం-పార్వతీపురం- రాయగడ రోడ్ల నిర్మాణంతోనే ఉమ్మడి జిల్లావాసుల కష్టాలు తీరనున్నాయి. ఇతర రహదారుల్లో కొన్నింటికి మరమ్మతులు పూర్తిచేశారు. మరికొన్నింటిని శాశ్వతంగా నిర్మించారు. మిగతా వాటిని సైతం పూర్తిస్థాయిలో నిర్మించాల్సిన అవసరం ఉంది.

సీఎం పర్యటనకు పటిష్ఠ భద్రత: ఐజీ గోపీనాథ్‌ జట్టీ

విజయనగరం క్రైం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం చీపురుపల్లి మండలం రావివలసకు వస్తున్న నేపథ్యంలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టీ చెప్పారు. హెలిపాడ్‌, సభా వేదిక, కాన్వాయ్‌ వెళ్లే మార్గాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ 1,200 మందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నామని, 13 సెక్టార్లుగా అధికారులను విభజించినట్లు తెలిపారు. పరిశీలనలో ఏఎస్‌పీ సౌమ్యలత, డీఎస్పీ రాఘవులు, ఎస్‌బీ సీఐ లీలారావు తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:19 AM