‘పది’ ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించేలా..
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:55 PM
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గత మూడేళ్లుగా రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది సైతం పది ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించేందుకు విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది.
-జిల్లా విద్యాశాఖ కార్యాచరణ
- సీఎస్, డీవోలకు ఒకరోజు శిక్షణ పూర్తి
సాలూరు రూరల్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గత మూడేళ్లుగా రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది సైతం పది ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించేందుకు విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా పరీక్షల నిర్వహణలో ప్రధాన భూమిక వహించే చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్‌మెంట్ అధికారులు (డీవో), అదనపు డిపార్ట్‌మెంట్ అధికారులకు గురువారం ఒక రోజు శిక్షణను డీఈవో బ్రహ్మాజీరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పరీక్షల్లో పారదర్శకతకు కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది 68 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 68 మంది సీఎస్‌లు, 68 మంది డీవోలను నియమించారు. ఎక్కువ మంది విద్యార్థులున్న చోట్ల అదనపు డీవోలను నియమించారు. వీరందరికీ పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్యాచరణ తదితర వాటిపై శిక్షణ ఇచ్చారు. ఇన్విజిలేటర్లు, స్క్వాడ్‌లను కూడా ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచే ఆటోమేషన్ ద్వారా ఇన్విజిలేటర్ల నియమాకాలు చేపట్టి, లీప్ యాప్ ద్వారా ఆదేశాలు పంపారు. అంతేకాకుండా ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను సైతం ఇన్విజిలేషన్‌కు తీసుకున్నారు. ఇప్పటికే ప్రశ్న పత్రాలను నిర్ణీత పోలీస్‌స్టేషన్లలో భద్రపర్చారు. పరీక్ష రోజును నిర్వహించే కోడ్ బట్టి వాటిని తీసుకెళ్లనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఈ కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయించనున్నారు. పరీక్ష కేంద్రంలోకి ప్రధానమైన వారికి మినహా ఎవరినీ మొబైల్ ఫోన్లతో అనుమతించరు. కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య తదితర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. జిల్లాలో 68 కేంద్రాల్లో 10,644 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలను రాయనున్నారు.