Shambara Jathara శంబర జాతరకు వేళాయే
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:35 AM
Time for the Shambara Jathara ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, కోర్కెల తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ సంబరాలకు వేళయ్యింది. ఈనెల 26, 27, 28న జాతర జరగనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం తొలేళ్లు, మంగళవారం సిరిమానోత్సవం, బుధవారం అంపకోత్సవం నిర్వహించనున్నారు.
పోలమాంబ ఆలయ పరిసరాల్లో పక్కాగా ఏర్పాట్లు
మక్కువ రూరల్, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, కోర్కెల తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ సంబరాలకు వేళయ్యింది. ఈనెల 26, 27, 28న జాతర జరగనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం తొలేళ్లు, మంగళవారం సిరిమానోత్సవం, బుధవారం అంపకోత్సవం నిర్వహించనున్నారు. జాతర మహోత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా సర్వం సిద్ధం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 800 మంది పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కూడా బందోబస్తు నిర్వహించనున్నారు. మరోవైపు మూడు జిల్లాల్లో వివిధ శాఖలకు చెందిన 60మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. భక్తుల కోసం ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి 222 బస్సులను నడపనుంది. సాలూరు నుంచివచ్చే వాహనాలు, బస్సులకు వనంగుడి సమీపంలో , పార్వతీపురం, మక్కువ, బొబ్బిలి నుంచి వచ్చే వాహనాలకు శంబర జడ్పీ హైస్కూల్ వద్ద పార్కింగ్ స్థలాలు కేటాయించారు. భక్తుల కోసం 22వేల లడ్డూలు, పులిహోరను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం నాలుగు కౌంటర్లను ఏర్పాటుచేశారు. ఉచిత దర్శనం కోసం ఏడు క్యూలైన్లు, రూ. 100 టికెట్ తీసుకున్న భక్తులకు నాలుగు క్యూలైన్లు, రూ.20 టికెట్ తీసుకున్న వారికి నాలుగు క్యూలైన్లు సిద్ధం చేశారు. ఆలయాల పరిసరాల్లో కేశఖండనశాల, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. గ్రామంలో పారిశుఽధ్యం మెరుగుకు సుమారు 120మంది సిబ్బందిని నియమించారు. శంబర పీహెచ్‌సీ ఆధ్వర్యంలో నాలుగు చోట్ల వైద్యశిబి రాలను ఏర్పాటు చేయనున్నారు. మొబైల్ ట్యాంక్‌ల ద్వారా భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. కాగా ఆదివారం శంబరలో ఏర్పాట్లను సబ్‌కలెక్టర్లు వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పరిశీలించారు.
నేడు తొలేళ్లు ఇలా..
జాతరలో తొలిఘట్టమైన తొలేళ్లు ఉత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉత్సవంలో పాల్గొనేవారంతా ఉపవాసం దీక్ష చేస్తారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పోలమాంబ చదురుగుడి నుంచి ఘటాలతో బయలుదేరి తిరువీధి నిర్వహిస్తారు. రాత్రి 12గంటలకు గద్దె వద్దకు చేరుకుంటారు. ఉపవాసదీక్షలో ఉన్నవారు నాగలికి పూజ చేస్తారు. కాడెద్దుల్లా నిల్చొని వరి విత్తనాలను చేతబట్టి పోలమాంబను వేడుకుంటారు. ఆ తర్వాత వాటిని గ్రామస్థులకు అందజేస్తారు. వాటిని ధాన్యంలో కలుపుకుని పొలంలో జల్లితే పంటలు బాగాపండుతాయని గ్రామస్థుల నమ్మకం. కాగా శంబర జాతరలో భాగంగా ఆనవాయితీ ప్రకారం.. ఆదివారం గ్రామంలో కారుగేదె వాలకం నిర్వహించారు.