Kotadurgamma కోటదుర్గమ్మ ఉత్సవాలకు వేళాయే
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:40 PM
Time for the Kotadurgamma Festival ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు వేళయ్యింది. ఆదివారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా తొలిరోజు అమ్మవారు భక్తులకు నిజరూపంలో దర్శనమివ్వనుంది. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దర్శన భాగ్యం కలగనుండడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు.
భారీగా తరలిరానున్న భక్తులు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
పాలకొండ, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు వేళయ్యింది. ఆదివారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా తొలిరోజు అమ్మవారు భక్తులకు నిజరూపంలో దర్శనమివ్వనుంది. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దర్శన భాగ్యం కలగనుండడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. ఈ మేరకు ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవదాయ శాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా ఈ ఏడాది అమ్మవారి ఉత్సవ ముహూర్తపు రాట, కలశస్థాపన, పూజలు అనంతరం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. సోమవారం నుంచి రోజుకొక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మన్యం, విజయ నగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాలు నుంచి ప్రజలు భారీగా తరలిరానుండడంతో అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. పారిశుధ్యం, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా భక్తులకు తాగునీరు, మజ్జిగ సరఫరా చేయనున్నారు. బయో టాయిలెట్స్, స్నానపు గదులు అందుబాటులో ఉంచారు. భక్తులకు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రత్యేక టెంట్లును ఏర్పాటు చేశారు. భక్తులు, దాతల సాయంతో ఆలయం వద్ద అన్నసమారాధనకు కౌంటర్లు సిద్ధం చేశారు. పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో 150 మంది ఎస్‌ఐలు, సీఐలు, పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు...
పార్వతీపురం, పాలకొండ, రాజాం, పాలకొండకు రాకపోకలు సాగించే వాహనాలు అన్నవరం, వడమ గ్రామాల మీదుగా ప్రధాన రహదారికి చేరుకోవాలని డీఎస్పీ రాంబాబు సూచించారు. భారీ వాహనాలు రాజాం, చిలకపాలెం మీదుగా హైవే తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీకాకుళం-పాలకొండ మీదుగా వెళ్లే వాహనాలు పాలకొండ, సీతంపేట, బత్తిలి మీదుగా ఒడిశా వైపు వెళ్లేలా మళ్లిస్తున్నామన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్‌కు సదుపాయం కల్పించామని తెలిపారు. పట్టణంలోని వెంకటరాయుని కోనేరు, కార్గిల్ జంక్షన్ వద్ద, రాజాం మీదుగా వచ్చే వాహనాలకు ఆర్‌అండ్‌బీ కార్యాలయం తదితర ఖాళీ స్థలాల వద్ద వాహనాలను నిలిపే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం మీదుగా వచ్చే వాహనాలు గాయత్రీ దేవి ఆలయం, వెంకటరాయుని కోనేరు వద్ద పార్కింగ్‌కు చేయాలని సూచించారు.
శంబర పోలమాంబ ఆలయంలో
మక్కువ: శంబరపోలమాంబ ఆలయంలో ఆదివారం నుంచి ఈ నెల 21వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగు తాయని ధర్మకర్తల మండలి చైర్మన్ చినతిరుపతి, ఈవో వీవీ సూర్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈమేరకు ప్రచార కరపత్రాలను కూడా విడుదల చేశామని వెల్లడించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి.. పోలమాంబ ఆశీస్సులు పొందాలని కోరారు.