పదో తరగతి పరీక్షలకు పటిష్ట భద్రత
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:51 PM
జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ దామోదర్ తెలిపారు.
ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 119 పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంద న్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు హల్‌టికెట్స్ మినహా ఎలాంటి ఎలక్ర్టానిక్ పరికరాలు తీసుకుని రావద్దని ఆయన సూచించారు. ఈనెల 16 నుంచి వచ్చే నెల 1 వరకూ నిర్వహించనున్న పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి పోలీసుశాఖ తరపున కట్టుదిట్టమైన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్నపత్రాలు తరలించే సందర్భంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాటిని సీసీటీవీ కెమెరాల నిఘాలో భద్రపరచాలని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తూ నిరంతర పర్యవేక్షణ చేపడతారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గుంపుగుంపులుగా గుమిగూడకుండా చర్యలు తీసుకుంటా మని చెప్పారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. సోషల్ మీడియా ద్వారా ప్రశ్నపత్రాలు లీక్ వంటి తప్పుడు ప్రచారం చేసి విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.