ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:02 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని హోంశాఖ మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
హోంశాఖ మంత్రి అనిత ఆదేశం
చీపురుపల్లి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి):ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని హోంశాఖ మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి బాబునాయుడు జిల్లాకు రానున్నారు. చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో ఆయన పర్యటించనున్నారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో బుధవారం హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం పర్యటనపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అలసత్వం వద్దని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన ప్రదేశంలో గురువారం నాటికి హెలిప్యాడ్ పనులు పూర్తి కావాలన్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధుల భోజన ఏర్పాట్లపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి సభ ప్రాంగణానికి చేరుకున్న సమయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక నాయకుల సమాచారం ప్రకారం సీఎం ప్రజావేదికకు సుమారు 3500 మంది హాజరవుతారన్నారు. చీపురుపల్లి నుంచి సభ ప్రాంగణం వరకూ తారు రోడ్డు నిర్మిస్తున్నామని, హెలిపాడ్ పనులు కూడా గురువారం సాయంత్రం నాటికి పూర్తవుతాయని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, జేసీ సేతుమాధవన్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం, రావివలసలో జరుగుతున్న సీఎం సభ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.