Share News

Tiger dances are special.పులివేషాలు ప్రత్యేకం

ABN , Publish Date - Oct 19 , 2026 | 11:12 PM

Tiger dances are special. పులివేషాలు అంటే గుర్తుకువచ్చేది విజయనగరమే. అందులోనూ అమ్మవారి పండగ రోజుల్లో వీటికి అగ్ర ప్రాధాన్యం ఉంటుంది. పులి వేషాలను చూసి భక్తులు, సందర్శకులు ఆనందపరవశులవుతుంటారు. ఎంతసేపైనా ఉత్సాహంగా వీక్షిస్తుంటారు.

Tiger dances are special.పులివేషాలు ప్రత్యేకం

పులివేషాలు ప్రత్యేకం

సిరిమాను ఉత్సవాల్లో ఈ ప్రదర్శన కీలకం

విజయనగరం కల్చరల్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): పులివేషాలు అంటే గుర్తుకువచ్చేది విజయనగరమే. అందులోనూ అమ్మవారి పండగ రోజుల్లో వీటికి అగ్ర ప్రాధాన్యం ఉంటుంది. పులి వేషాలను చూసి భక్తులు, సందర్శకులు ఆనందపరవశులవుతుంటారు. ఎంతసేపైనా ఉత్సాహంగా వీక్షిస్తుంటారు. ఓ వైపు థాసాలు వాయించడం, మధ్య, మధ్యలో బిగిలి ఊదడం.. ఈ వాయిద్యాలకు అనుసరించి పులివేషదారులు భీకరంగా నృత్యం చేయడం ఈ ప్రదర్శనలో కీలకం. కళాకారులు ఈ వేషం వేయడానికి ఒళ్లంతా రంగు పూసుకోవాల్సిందే. ఒంటి నిండా పసుపు, ఎరుపు రంగులు అద్దుకుంటారు. వివిధ రకాల విన్యాసాలతో సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తారు. నేలపై ఉన్న కరెన్సీ నోట్లను నోటితో తీయడం, బిందెలను నోటితో పైకి లేపడం, పులి వేటాడే క్రమం లాంటి విన్యాసాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి.

అమ్మవారి సిరిమానోత్సవంలో పులివేషాలు ప్రత్యేక ముద్ర వేస్తుంటాయి. తొలేళ్ల ఉత్సవంలో రాత్రంతా పులివేషాలతోనే సందడి నెలకొంటుంది. మూడులాంతర్ల నుంచి కోట వరకూ, కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి గంటస్తంభం వరకు సందడి చేస్తుంటాయి. కొన్ని వేదికలపై పులివేషాల పోటీలు జరుగుతుంటాయి. కొత్తపేట, లంకవీధి, బుంగవీధి, ఇప్పిలివీధి, దాసన్నపేట, పూల్‌బాగ్‌ కాలనీ, స్టేడియం పేట, గాజులరేగ, రంగిరీజువీధి, డకినివీధి తదితర ప్రాంతాల్లో ఎక్కువ మంది కళాకారులు పులివేషాలు వేస్తుంటారు. ఈ ప్రదర్శనలో ఆరితేరిన కళాకారులు విజయనగరంలో చాలా మంది వున్నారు. విజయనగరం కళలకు కాణాచిగా పేరున్న నేపథ్యంలో పులివేషాల ప్రదర్శన భవిష్యత్తు తరాలకు కూడా అందించాలన్న ఉద్దేశంతో ఏటా పండగ పూట ఎక్కడికక్కడే ఏర్పాటు చేస్తుంటారు.

-----------------

Updated Date - Oct 19 , 2026 | 11:12 PM