కాళ్లు, చేతులు కట్టేసి.. పొదల్లో పడేసి..
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:08 AM
గొల్లలపేటలో ఓ వ్యక్తిని కాళ్లు చేతులు కట్టేసి.. దాడి చేసి పొదల్లో పడేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.
వృద్ధుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
బొండపల్లి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): మండలం లోని గొల్లలపేటలో ఓ వ్యక్తిని కాళ్లు చేతులు కట్టేసి.. దాడి చేసి పొదల్లో పడేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఏఎస్‌ఐ ఎల్.గోపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గొల్లలపేట గ్రామానికి చెందిన పీతల సత్యం శనివా రం తన గొర్రెల మందను చూసేందుకు గ్రామానికి సమీపంలో గల చింతల చెరువు కిందకు వెళ్లారు. అయితే ఎప్పటికీ ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది సత్యంను వెతికే ప్రయత్నం చేశారు. కాళ్లు చేతులు కట్టివేసి పొదల్లో పడిఉన్న సత్యను గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడిచేసి.. కాళ్లు, చేతులు కట్టేసి, పొదల్లో పడేశారని సత్యం తెలిపారు. వెంటనే సత్యంను బొండపల్లి పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు బాధితుడి నుంచి పూర్తి వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు.