Throwing in the 'defense'.. increasing the entrances ‘డిఫెన్స్’లో పడేస్తూ.. ప్రవేశాలు పెంచుకుంటూ
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:18 AM
Throwing in the 'defense'.. increasing the entrances ఇంటర్‌తో పాటు నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ వంటి రక్షణ సంస్థల్లో ఉద్యోగాలకు శిక్షణ ఇస్తాం. మా సంస్థలో చదివితే చిన్న వయసులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరే చాన్స్ ఉంది. మీ పిల్లాడు మా దగ్గరైతే సేఫ్.. అంతా మేమే చూసుకుంటాం’ అని కొన్ని డిఫెన్స్ అకాడమీలు నమ్మబలుకుతున్నాయి. బ్రోచర్లు చూపి.. కబుర్లు చెప్పి ప్రవేశాలు పెంచుకుంటున్నాయి.
‘డిఫెన్స్’లో పడేస్తూ.. ప్రవేశాలు పెంచుకుంటూ
తల్లిదండ్రులకు గాలం వేస్తున్న కొన్ని డిఫెన్స్ అకాడమీలు
ఆఖరి వరకు తెలుసుకోలేకపోతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
ప్రైవేటు సంస్థల ప్రచారాన్ని నమ్ముతున్న వైనం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఆయా సంస్థల ప్రచారం
పుట్టగొడుగుల్లాగా అకాడమీలు
రూ.లక్షలాది రూపాయల ఫీజులు వసూలు
‘ఇంటర్‌తో పాటు నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ వంటి రక్షణ సంస్థల్లో ఉద్యోగాలకు శిక్షణ ఇస్తాం. మా సంస్థలో చదివితే చిన్న వయసులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరే చాన్స్ ఉంది. మీ పిల్లాడు మా దగ్గరైతే సేఫ్.. అంతా మేమే చూసుకుంటాం’ అని కొన్ని డిఫెన్స్ అకాడమీలు నమ్మబలుకుతున్నాయి. బ్రోచర్లు చూపి.. కబుర్లు చెప్పి ప్రవేశాలు పెంచుకుంటున్నాయి. వారి ప్రచారాన్ని కొందరు తల్లిదండ్రులు నమ్ముతున్నారు. పిల్లల్ని చేర్చి లక్షల రూపాయల ఫీజులు చెల్లించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.
కొత్తవలస, మార్చి2(ఆంధ్రజ్యోతి): డిఫెన్స్ అకాడమీల పేరిట విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇంటర్ చదువుతో పాటు నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ వంటి రక్షణ సంస్థల్లో ఉద్యోగాలకు శిక్షణ ఇస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు ఆశ కల్పిస్తున్నాయి. ఒక శృంగవరపుకోట నియోజకవర్గంలోనే గత రెండు మూడు సంవత్సరాలలో 15 వరకు డిఫెన్స్ అకాడమీల పేరుతో విద్యా సంస్థలు ఏర్పాటు కాగా జిల్లా వ్యాప్తంగా సుమారు 100 దాకా ఉన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో చూడొచ్చన్న ఆశతో చేర్పిస్తుండగా మరికొంతమంది ఇంటి దగ్గరైతే చదవడం లేదని భావించి డిఫెన్స్ అకాడమీల్లో చేర్పిస్తున్నారు. దీనికి తోడు ఆయా సంస్థలు పేద, మధ్య తరగతి వర్గాలలో 10 వతగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల చిరునామాలను సేకరించి వారిని నేరుగా కలసి చిన్న వయస్సులోనే ఉద్యోగాలను వస్తాయని ఆశలు కల్పిస్తున్నాయి. ఇందుకు తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు.
ప్రచార ఆర్భాటాలే..
ఇప్పుడు ఎక్కడ చూసినా డిఫెన్స్ అకాడమీల ప్రచారమే కనిపిస్తోంది. జాతీయ రహదారుల పక్కన, ముఖ్య కూడళ్లలోనూ పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వాటిపై నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగుల ఫొటోలను ముద్రించడంతో వాటిని చూసి ఆకర్షితులవుతున్నారు. తక్కువ వయసులో ఉద్యోగ విరమణ చేసి మళ్లీ ఉద్యోగాలు పొందే వీలుందని యాజమాన్యాలు నమ్మబలుకుతున్నాయి.
దారుణంగా ఫీజులు
డిఫెన్స్ అకాడమీలలో చేరే విద్యార్థుల నుంచి యాజమాన్యాలు దారుణంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కళాశాల ఫీజు, హాస్టల్ వసతి ఫీజు అంటూ ఒక్కో విద్యార్థి నుంచి సంవత్సరానికి సుమారు రూ.రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణంగా ఇంటర్మీడియట్ చదువుకునే వారికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుంది. ఈ డిఫెన్స్ అకాడమీలలో చదువుకునే వారికి అటువంటి అవకాశం ఉండదు.
ఒత్తిడిలో విద్యార్థులు
ఒకపక్క తల్లిదండ్రుల ఒత్తిడి మరోపక్క విద్యా సంస్థల యాజమాన్యాల ఒత్తిడి కారణంగా డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఆటలు, వ్యాయామాల పట్ల ఆసక్తి ఉన్నాతాము తీసుకున్న సబ్జెక్టులో ఫెయిల్ అవుతున్నారు. కొంతమంది విద్యార్థుల చేత వ్యాయామాన్ని బలవంతంగా చేయించడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కొత్తవలసలోని ఓ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి తన నివాస గదిలోనే ఆత్మ హత్య చేసుకోగా మరికొంత మంది ఈ చదువు మాకొద్దు అంటూమధ్యలోనే పరారీ అవుతున్నారు.
ఉద్యోగాలు అంతంత మాత్రమే
అకాడమీల్లో చదివే విద్యార్థుల్లో చాలా తక్కువ మంది ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఒక్కో కళాశాల నుంచి కనీసం నలుగురు లేదా ఐదుగురు కూడా ఎంపిక కావడం లేదు. ఎక్కడోనూటికో కోటికో ఒక విద్యార్థికి వచ్చే ఉద్యోగం గురించే చెప్పుకుంటున్నారు. యాజమాన్యాలు కాసుల కోసమే ఈ డిఫెన్స్ అకాడమీలు ఏర్పాటు చేసుకుంటున్నాయని ఉద్యోగం రాక మళ్లీ డిగ్రీలో చేరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.
పీడీలే కీలకం
ఆయా విద్యాసంస్థల ఫిజికల్ డైరెక్టర్‌లే కీలకం. అప్పుడప్పుడు నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లలో పదవీ విరమణ చేసిన పెద్ద క్యాడర్‌కు చెందిన ఉద్యోగులను తీసుకొచ్చి వారి చేత విద్యార్థులకు మోటివేషన్ ఇస్తుంటారు. ఇది మినహా ఒరిగిందేమీ లేదని కొందరు ఆఖరులో తెలుసుకుంటున్నారు.
----------------