POCSO Case పోక్సో కేసులో ముగ్గురికి జైలు, జరిమానా
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:16 PM
Three Sentenced to Jail and Fine in POCSO Case పోక్సో కేసులో ముగ్గురికి జైలు, జరిమానా విధిస్తూ గురువారం విజయనగరం స్పెషల్ కోర్టు న్యాయాధికారి కె.నాగమణి తీర్పు ఇచ్చారు.
పాచిపెంట, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో ముగ్గురికి జైలు, జరిమానా విధిస్తూ గురువారం విజయనగరం స్పెషల్ కోర్టు న్యాయాధికారి కె.నాగమణి తీర్పు ఇచ్చారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పాచిపెంటకు చెందిన బాధితురాలు గతేడాది ఏప్రిల్ 15న ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమపరప్పాడు గ్రామానికి చెందిన కలిశెట్టి సీతంనాయుడు (27)పై పాచిపెంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రేమ, వివాహం పేరిట నమ్మించి మోసం చేశాడని, గర్భం దాల్చాక నిందితుడు, వారి తల్లిదండ్రులు కలిశెట్టి పాపయ్య, మహాలక్ష్మి కలిసి తనకు గర్భస్రావం చేయించి.. పెళ్లికి నిరాకరించారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై అప్పట్లో పాచిపెంట ఎస్‌ఐ నారాయణరావు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి గతేడాది జూన్ 10న కోర్టులో తగిన సాక్ష్యాధారాలతో అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ పూర్తయ్యే విధంగా పాచిపెంట పోలీసులు చర్యలు చేపట్టగా, విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయాధికారి తీర్పు వెల్లడించారు. నిందితుడు సీతంనాయుడుకు 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు. ఆయన తల్లిదండ్రులు పాపయ్య, మహాలక్ష్మికి మూడేళ్ల జైలు, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్టు స్థానిక పోలీసులు తెలిపారు.