Share News

three or four constancies 3 లేదా 4

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:48 PM

three or four constancies పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను 2011 జనాభా లెక్కల ఆధారంగా జరిపించాలని కేంద్రం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా అమలు చేసేందుకు సిద్ధమైనట్టు జరుగుతున్న ప్రచారంతో జిల్లా నేతల్లోనూ చర్చలు మొదలయ్యాయి.

 three or four constancies 3 లేదా 4

3 లేదా 4

జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

కొత్తగా విజయనగరం రూరల్‌ ?

మునిసిపాల్టీలు ఉన్నచోట మరో రెండు

ఇంకో పార్లమెంట్‌ సీటు పెరిగే చాన్స్‌

బొబ్బిలి లేదా పార్వతీపురం పునరుద్ధరణ

ఉమ్మడి జిల్లాలో 5 నియోజకవర్గాల పెంపు?

విజయనగరం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను 2011 జనాభా లెక్కల ఆధారంగా జరిపించాలని కేంద్రం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా అమలు చేసేందుకు సిద్ధమైనట్టు జరుగుతున్న ప్రచారంతో జిల్లా నేతల్లోనూ చర్చలు మొదలయ్యాయి. జిల్లాలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌ నియోజకవర్గాలు పెరగనున్నాయి. 3 లేదా 4 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగవచ్చు.మరో పార్లమెంట్‌ సీటు పెరిగే చాన్సు ఉంది.

ఇప్పుడున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలను 50 శాతం పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు డీలిమిటేషన్‌ కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. బిల్లు ఆమోదం పొందిన తరువాత.. కొత్త జనాభాను పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లు సైతం ఖరారు చేయవచ్చు. అటు మహిళా రిజర్వేషన్‌ సైతం పరిగణనలోకి తీసుకుంటారని అంటున్నారు. అదే జరిగితే కొన్ని నియోజకవర్గాలు ఎస్సీ, మరికొన్ని జనరల్‌, ఇంకొన్ని మహిళా రిజర్వేషన్‌ కిందకు వెళ్లనున్నాయి. తాజా అంచనాల ప్రకారం విజయనగరం జిల్లా నుంచి 3, పార్వతీపురం మన్యం నుంచి రెండు నియోజకవర్గాలు పెరగడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

2009కు ముందు 12..

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో 9 నియోజకవర్గాలే మిగిలాయి. 2022లో జరిగిన జిల్లాల విభజనతో విజయనగరం జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు చేరాయి. 2009కి ముందు ఉమ్మడి జిల్లాలో పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, సతివాడ, భోగాపురం, నాగూరు, తెర్లాం, ఉత్తరావల్లి, విజయనగరం, శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. పార్వతీపురం, బొబ్బిలి పార్లమెంట్‌ నియోజకవర్గాలు కొనసాగేవి. పునర్విభజన తరువాత సతివాడ, భోగాపురం, తెర్లాం, ఉత్తరావల్లి నియోజకవర్గాలు కనుమరుగయ్యాయి. కొత్తగా నెల్లిమర్ల, కురుపాం నియోజకవర్గం ఆవిర్భవించాయి. పార్వతీపురం, బొబ్బిలి పార్లమెంట్‌ నియోజకవర్గాలు రద్దయ్యాయి. విజయనగరం పార్లమెంట్‌ స్థానం ఆవిర్భవించింది. అరకు ఎస్టీ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో రిజర్వుడ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలను చేర్చారు. 2022లో వైసీపీ ప్రభుత్వం జిల్లాలను విభజించింది. విజయనగరం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు, పార్వతీపురం మన్యంలో నాలుగు నియోజకవర్గాలను ఉంచింది. విజయనగరంలోకి కొత్తగా రాజాం నియోజకవర్గం వచ్చి చేరింది. పార్వతీపురం మన్యంలోకి పార్వతీపురం, సాలూరు, కురుపాంతో పాటు పాలకొండ చేరింది. ఇక సాలూరు నియోజకవర్గంలోని మెంటాడను విజయనగరం జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఎస్‌.కోట అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాలోనే ఉంటూ విశాఖ పార్లమెంట్‌ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గం విజయనగరం పార్లమెంట్‌ స్థానం పరిధిలో కొనసాగుతోంది.

మూడు ఖాయం?

పునర్విభజనతో కచ్చితంగా జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగడం ఖాయంగా తెలుస్తోంది. విజయనగరం అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాలు రానున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో బొబ్బిలి, రాజాం మునిసిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయతీ ఉంది. మునిసిపాల్టీలు ఉన్న చోట అదనంగా ఉన్న మండలాలను కలుపుతూ కొత్త నియోజకవర్గం రూపుదిద్దుకునే చాన్సు కనిపిస్తోంది. మరోవైపు ఎస్‌.కోట నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. గజపతినగరం నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. జామి మండలం ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఉంది. అందుకే కొత్తగా కొన్ని మండలాలను కలుపుతూ కొత్త అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశాలు పుష్కలం. గతం మాదిరిగా బొబ్బిలి కేంద్రంగా పార్లమెంట్‌ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకుంటే రిజర్వుడ్‌ నియోజకవర్గాలను కలుపుతూ పార్వతీపురం పార్లమెంట్‌ స్థానాన్ని పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీ లిమిటేషన్‌ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

- నియోజకవర్గాల పునఃవ్యస్థీకరణ జరిగితే జిల్లాలో సుమారు నాలుగు వరకు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. 2029 ఎన్నికలపై ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఆశావాహుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే వారు ఏయే నియోజకవర్గాలు పెరగనున్నాయి అనే దానిపై అంచనాలు వేసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్‌, ఇతర పార్టీల నాయకులకు అవకాశాలు కన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో వచ్చే ఎన్నికల్లో తమకు ఎమ్మెల్యే సీట్లు దక్కుతాయనే ఆశతో ఆయా నాయకులు ఎదురుచూస్తున్నారు.

- జిల్లాలో 777 పంచాయతీలు, 27 మండలాలు , ఒక కార్పొరేషన్‌ (విజయనగరం) , 2 (రాజాం, బొబ్బిలి) మునిసిపాలిటీలు, నగర పంచాయతీ నెల్లిమర్ల, మేజర్‌ పంచాయతీలు 11 (ఎస్‌.కోట, ఎల్‌.కోట, జామి, కొత్తవలస, ధర్మవరం, గజపతినగరం, రామభద్రపురం, చీపురుపల్లి గర్భాం, గరివిడి, భోగాపురం) ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఓటర్ల సంఖ్య 17 లక్షల 74 వేల 800 కాగా మహిళా ఓటర్లు 7లక్షల 98 వేల 632 మంది. పురుష ఓటర్లు 7లక్షల 76 వేల 101 కాగా థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 67 మంది ఉన్నారు.

-------------------

Updated Date - Mar 24 , 2026 | 11:48 PM