three childrens died చెరువు మింగేసింది
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:43 AM
three childrens died వారంతా నాలుగు, ఐదో తరగతి చదువుతున్న పిల్లలు. వర్షాలకు గ్రామంలోని చెరువులో నీరు చేరినట్లు తెలుసుకున్నారు. కొద్దిసేపు ఈత కొట్టాలని సరదా పడ్డారు. సాయంత్రం పాఠశాల విడిచిపెట్టాక ఏడుగురు విద్యార్థులు కలిసి వెళ్లారు. ఈత సరదా తీర్చుకోవాలనుకున్నారు. పాపం వారు ఒకటి తలిస్తే విధి మరోలా చేసింది. వారిలో ముగ్గురిని మృత్యుతీరానికి తీసుకుపోయింది.
చెరువు మింగేసింది
స్నానానికి దిగి ముగ్గురు చిన్నారుల మృతి
బుదరాయవలసలో విషాదం
మెరకముడిదాం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): వారంతా నాలుగు, ఐదో తరగతి చదువుతున్న పిల్లలు. వర్షాలకు గ్రామంలోని చెరువులో నీరు చేరినట్లు తెలుసుకున్నారు. కొద్దిసేపు ఈత కొట్టాలని సరదా పడ్డారు. సాయంత్రం పాఠశాల విడిచిపెట్టాక ఏడుగురు విద్యార్థులు కలిసి వెళ్లారు. ఈత సరదా తీర్చుకోవాలనుకున్నారు. పాపం వారు ఒకటి తలిస్తే విధి మరోలా చేసింది. వారిలో ముగ్గురిని మృత్యుతీరానికి తీసుకుపోయింది. ఈ ఘటన మెరకముడిదాం మండలం బుదరాయవలసలో శనివారం చోటుచేసుకుంది. చెరువులో దిగిన గ్రామానికి చెందిన ఎస్.చంద్రశేఖర్ (9), మండల హేమచంద్ర (10), శంకరాపు వెంకటేష్ (9)లు గల్లంతై అచేతన స్థితిలో కంటపడ్డారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
బుదరాయవలస గ్రామంలోని పాఠశాలలో నాలుగు, ఐదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు కలిసి శనివారం స్కూల్ ముగిసిన తరువాత సుమారు సాయంత్రం 5గంటల సమయంలో చిన్నచెరువులో సరదాగా స్నానం చేసేందుకు వెళ్లారు. కొద్దిసేపు కేరింతలు కొట్టారు. అంతలో ఎస్.చంద్రశేఖర్ (9), మండల హేమచంద్ర (10), శంకరాపు వెంకటేష్ (9) ఉన్నఫలంగా కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన మిగతా నలుగురు ఒడ్డుకు వచ్చి కంగారు పడుతున్నారు. భయంతో వెంకటేష్ అన్నయ్య రాంబాబు పరుగున గ్రామంలోకి వెళ్లి విషయం అందరికీ తెలియజేశాడు. తన తమ్ముడు, ఇంకో ఇద్దరు చిన్నచెరువులో మునిగిపోయారని చెప్పాడు. హుటాహుటిన స్థానికులు చెరువు వద్దకు చేరుకుని గాలించడం ప్రారంభించారు. కొంతసమయం తరువాత ముగ్గురు చిన్నారులను అచేతన స్థితిలో గుర్తించారు. ఈ సమయంలో బంధువులు, కుటుంబసభ్యుల రోదనలతో గ్రామం తీవ్ర విషాదమయం అయింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీపురుపల్లి ఆస్పత్రికి తరలించారు.
శంకరాపు వెంకటేష్ అన్నయ్య రాంబాబు కూడా స్నానం చేసి వెళ్లాడు. ఈత రావడంతో బయటపడ్డాడు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. హేమచంద్రది నిరుపేద కుటుంబం. తండ్రి ఊరులోనే ఉంటాడు. తల్లి జీవనోపాధి కోసం చెన్నైలో దినసరి కూలీగా పనిచేస్తున్నారు. కొడుకు మృతి వార్త ఫోన్‌ద్వారా తెలుసుకున్న తల్లి గౌరి తీవ్రంగా రోదించింది. చంద్రశేఖర్ కూడా ఒకడే కుమారుడు. తండ్రి గోవిందు వ్యవసాయ కూలి. తల్లి ఇంటి వద్ద ఉంటోంది. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారన్న విషయం తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిగ్ర్భాంతి చెందారు. మూడు కుటుంబాల సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.