ముగ్గురు చైన్‌స్నాచర్ల అరెస్టు
ABN , Publish Date - May 23 , 2026 | 11:57 PM
కొత్తవలస, ఎస్.కోట ప్రాంతాల్లో పెద్దగా సీసీ కెమెరాలు ఉండవని.. సులభంగా చైన్‌స్నాచిం గ్ చేయొచ్చని స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు గుంటూరు జిల్లా నుంచి వచ్చిన ఇద్దరు.. తాజాగా ఓ కేసులో కొత్తవలస పోలీసులకు చిక్కారు.
కొత్తవలస, మే 23 (ఆంధ్రజ్యోతి): కొత్తవలస, ఎస్.కోట ప్రాంతాల్లో పెద్దగా సీసీ కెమెరాలు ఉండవని.. సులభంగా చైన్‌స్నాచిం గ్ చేయొచ్చని స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు గుంటూరు జిల్లా నుంచి వచ్చిన ఇద్దరు.. తాజాగా ఓ కేసులో కొత్తవలస పోలీసులకు చిక్కారు. మొత్తం ముగ్గురు చైన్‌స్నాచర్లను పోలీసులు అరెస్టు చేశారు. కొత్తవలస సీఐ టీవీ విజయ్‌కుమార్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలసకు చెందిన డి.భవాని తన భర్త శ్రీనుతో కలిసి శుక్రవారం ద్విచక్రవాహనంపై వెళ్తూ.. తాడివానిపాలెం సమీపంలోని వేబ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌లో ఆగారు. అదే సమయంలో ఇద్దరు ద్విచక్రవాహనంపై వచ్చి.. భవానీ మెడలోని పుస్తెలతాడును తెంపుకొని పారిపోయారు. భవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు లో తేలిన విషయాలు ఇలా ఉన్నాయి. ఎస్.కోటకు చెందిన బుల్లిపల్లి కిరణ్‌కుమార్, గుంటూరు జిల్లాకు చెందిన పటాన్ సలీం బాషా, మచ్చ వెంకటేష్ ముగ్గురు స్నేహితులు. వీరి ముగ్గురికి నెల్లూరు జైలులో స్నేహం ఏర్పడింది. ఈనేపథ్యంలో ఎస్.కోటకు చెందిన కిరణ్‌కుమార్ వీరిద్దరికీ ఫోన్ చేసి.. కొత్తవలస, ఎస్.కోట ప్రాంతాలలో సీసీ కెమెరాలు తక్కువగా ఉన్నందున చైన్ స్నాచింగ్ సులభంగా ఉంటుందని.. రమ్మని ఫోన్ చేశాడు. ఈ మేరకు వీరిద్దరూ ఈనెల 17న ఇక్కడకు వచ్చారు. భవానీ మెడలో గొలుసును తెంపుకొని పారిపోయారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ముందుగా కిరణ్‌కుమార్‌ను పట్టుకుని ప్రశ్నించగా.. మిగిలిన ఇద్దరి గురించి చెప్పాడు. దీంతో భవానీ పోగొట్టుకున్న సుమారు రెండు తులాల బంగారం గొలుసుతోపాటు మోటార్‌సైకిల్‌ను, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ అరెస్టు చేసి.. కోర్టులో హాజరు పరిచారు. వీరిని పట్టుకోవడంలో ఎస్‌ఐ జోగారావు, సిబ్బంది తీవ్ర కృషి చేశారని సీఐ తెలిపారు.