Share News

ప్యానల్‌ బోర్డు చోరీ కేసులో ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:02 AM

నీలకంఠరాజపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల 23న అర్ధరాత్రి ఐఎఫ్‌బీ ప్యానల్‌ బోర్డు చోరీకి గురైన విషయం తెలిసిందే.

ప్యానల్‌ బోర్డు చోరీ కేసులో ముగ్గురి అరెస్టు

వేపాడ, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): నీలకంఠరాజపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల 23న అర్ధరాత్రి ఐఎఫ్‌బీ ప్యానల్‌ బోర్డు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి, శనివారం రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌.కో ట రూరల్‌ సీఐ అగుడు అప్పలనాయుడు తెలిపారు. వల్లంపూడి పోలీస్‌స్టేషనలో సీఐ ఈ కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కె.కోటపాడు మండలం గవరపాలెం గ్రామానికి చెందిన కొలుసు కృష్ణ, వేపాడ మండలం పెదగుడిపాల గ్రామానికి చెందిన సబ్బవరపు రాకేష్‌, దేవరాపల్లి మండలం ముత్యాలమ్మపాలెం చెందిన వనముల దుర్గాప్రసాద్‌ అనే ముగ్గురు అమానాస్పదస్థితిలో కుమ్మపల్లి జంక్షన్‌ వద్ద సంచరిస్తూ పోలీసులకు కనిపించారు. దీంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని, విచారించారు. ఈ విచారణలో నీలకంఠరాజపురం హైస్కూల్లో గల ఐఎఫ్‌బీ ప్యానల్‌ను దొంగతనం చేసి ఆటోలో తరలించుకుపోయినట్టు వారు ఒప్పుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, ఆ వ్యక్తిని కూడా పట్టుకుంటామని సీఐ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పాఠశాల హెచ్‌ఎం జీవీ ఉదయకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేసిన వల్లంపూడి ఇన్‌చార్జి ఎస్‌ఐ జె.రామకృష్ణను, సిబ్బందిని ఎస్పీ ప్రశంసించారని సీఐ తెలిపారు.

Updated Date - Jun 28 , 2026 | 12:02 AM