Share News

Threat of lightning పిడుగు ముప్పు

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:12 AM

Threat of lightning రెప్పపాటులో పిడుగుపాటుకు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోజుల వ్యవధిలోనే ఉమ్మడి జిల్లాలో నలుగురు బలి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆకాశం మేఘావృతమైతే చాలు భయమేస్తోంది. ఉరుము ప్రారంభమైన మరుక్షణమే పిడుగు పడుతున్న ఘటనలూ ఉన్నాయి.

Threat of lightning పిడుగు ముప్పు

- ఈ నెల 10న లక్కవరపుకోట మండలం రేగ గ్రామంలో పిడుగుపడి ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. చెరువులో బహిర్భూమికి స్నేహితులతో వెళ్లగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పిడుగుపడింది. ఇద్దరు బాలురు అపస్మారకస్థితికి చేరుకున్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతిచెందాడు. వాన మొదలవకుండానే పిడుగు పడడం గమనార్హం.

- ఈ నెల 7న వంగర మండలం శివ్వాం గ్రామానికి చెందిన మహిళ పిడుగుపాటుకు మృతిచెందింది. పొలం పనులు చేస్తుండగా పిడుగుపడడంతో అస్వస్థతకు గురైంది. ఆ స్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.

- ఈ నెల 7న ఉమ్మడి జిల్లా బలిజిపేట మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. రంగరాజపురానికి చెందిన డొప్ప సింహాచలం, వంతరాం గ్రామానికి చెందిన వాండ్రాసి పార్వతి పిడుగుపాటుకు మృతిచెందారు. పొలం పనుల్లో ఉండగా ఒక్కసారిగా పిడుగుపడడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలొదిలారు.

పిడుగు ముప్పు

వాన మొదలవకుండానే పడుతున్న వైనం

వాతావరణంలో ప్రమాదకర మార్పులు

రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో నలుగురు మృతి

గాలివాన సమయంలో అప్రమత్తతే కీలకం

రాజాం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి):

రెప్పపాటులో పిడుగుపాటుకు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోజుల వ్యవధిలోనే ఉమ్మడి జిల్లాలో నలుగురు బలి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆకాశం మేఘావృతమైతే చాలు భయమేస్తోంది. ఉరుము ప్రారంభమైన మరుక్షణమే పిడుగు పడుతున్న ఘటనలూ ఉన్నాయి. వాన మొదలవకుండానే పిడుగు పడడం వాతావరణంలో వచ్చిన ప్రమాదకర మార్పులకు నిదర్శనం. దీంతో మబ్బులు వేసినప్పుడే రైతులు పంట పొలాల నుంచి పరుగులు తీస్తున్నారు. పశువుల పెంపకందారులు ఇంటి బాట పడుతున్నారు. పిల్లలను సైతం అప్రమత్తం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వదిలేందుకు సాహిసించడం లేదు.

గత ఏడాది పిడుగుపాటుకు దాదాపు 40 మంది వరకూ మృత్యువాత పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంకాక మునుపే పిడుగులు పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మధ్యాహ్నం వరకూ ఎండ కాస్తోంది. ఆపై మేఘావృతమై ఉరుములు, మెరుపులు ప్రారంభమవుతున్నాయి. క్షణాల వ్యవధిలో పిడుగులు పడి మనుషుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఒడిశాతో పాటు ఉత్తరాంధ్రలో పిడుగులు ఎక్కువగా పడుతున్నాయని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.

జిల్లా వ్యవసాయాధారితమైనది. ఆపై మెట్ట ప్రాంతాలు అధికం. రబీ పంట ఉత్పత్తుల సేకరణ సమయమిది. అపరాలతో పాటు నువ్వు పంటను సేకరిస్తుంటారు. అటు మొక్కజొన్నతో పాటు ఇతర కూరగాయాల పంటలు సాగవుతున్నాయి. పత్తి సైతం పండుతోంది. ఈ సమయంలో రైతులు ఎక్కువగా పొలాల్లోనే ఉంటారు. అటు రైతుకూలీలు, పశువుల పెంపకందారులు సైతం పొలంబాట పడుతుంటారు. కానీ గతంలో జూన్‌ తరువాత ఉరుములు, మెరుపుల తీవ్రత ఉండేది. ఇప్పుడు వేసవి ప్రారంభం నుంచే పిడుగు భయం తప్పడం లేదు. ఏటా ఏప్రిల్‌ నాటికి రబీకి సంబంధించి పంటలు పూర్తవుతాయి. ఆ సమయంలో మేకలు, గొర్రెలు, ఆవులు మందలు వేసేందుకు పొలాలు అనుకూలం. ఈ సమయంలోనే పిడుగులు పడి మూగజీవాలు ఎక్కువగా మృతిచెందుతుంటాయి.

ఉత్తరాంధ్రలో అధికం..

ఉత్తరాంధ్రలో పిడుగుపాట్లకు కారణం బంగాళాఖాతమేనని కొందరు పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకూ వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. ఆ సమయంలో సముద్రం నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం పెరిగితే దట్టమైన క్యూములోనింబస్‌ మేఘాలు కమ్ముకుంటాయని, అప్పుడే ఉరుములు ప్రారంభమై పిడుగులు పడుతున్నాయంటున్నారు. రైతులు, గొర్రెల పెంపకందారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ పిడుగుపాటు ప్రమాదాలను ముందుగానే పసిగట్టి సమాచారం ఇస్తోంది కానీ ఫలితం లేకపోతోంది.

ఈ జాగ్రత్తలు పాటించాలి

- వాన పడే సమయంలో ఆరుబయట ఉండొద్దు

- చెట్ల కింద తలదాచుకుకోవడం చాలా ప్రమాదకరం. చెట్లు పిడుగులను ఆకర్షిస్తాయి.

- చెట్లకు ఒక మీటరు కంటే దూరంగా ఉంటే మంచిది

- నిటారు చెట్ల కిందకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు

- మెరుపులు అధికంగా ఉంటే బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం

- నీరు ఉన్న ప్రదేశం నుంచి దూరంగా ఉండండి.

- ఎలక్ర్టానిక్‌ ఉపకరణాలు వాడకపోవడమే ఉత్తమం.

- తుపాను సమయంలో ఫోన్‌, మెటల్‌ వస్తువులు వినియోగించకూడదు

- శరీరానికి ఎలక్ర్టానిక్‌ షాక్‌ తగిలినట్టు, వెంట్రుకలు నిటారుగా నిలబడినట్టు, చర్మం జలదరించినప్పుడు పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి భావన కలిగితే తక్షణం నేలపై పడుకోవాలి.

Updated Date - Apr 15 , 2026 | 12:12 AM