Share News

‘Thotapalli’ water should be extended శివారు భూములకూ ‘తోటపల్లి’ నిరందాలి

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:06 AM

‘Thotapalli’ water should be extended to peripheral lands as well. ఖరీఫ్‌లో తోటపల్లి కుడి ప్రధాన కాలువ ద్వారా శివారు భూములకు కూడా సాగునీరందించేందుకు వీలుగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ నరిశింహమూర్తి, నార్త్‌కోస్ట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ స్వర్ణకుమార్‌ తోటపల్లి అధికారులను ఆదేశించారు.

‘Thotapalli’ water should be extended శివారు భూములకూ ‘తోటపల్లి’ నిరందాలి
తోటపల్లి కుడి కాలువను పరిశీలిస్తున్న ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌

శివారు భూములకూ ‘తోటపల్లి’ నిరందాలి

తక్షణమే పూడికలతీత పనులు ప్రారంభించండి

బేలన్స్‌ నిధులు వినియోగించండి

ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ నరిశింహమూర్తి

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

రాజాం/రూరల్‌, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌లో తోటపల్లి కుడి ప్రధాన కాలువ ద్వారా శివారు భూములకు కూడా సాగునీరందించేందుకు వీలుగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ నరిశింహమూర్తి, నార్త్‌కోస్ట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ స్వర్ణకుమార్‌ తోటపల్లి అధికారులను ఆదేశించారు. తక్షణమే కాలువల్లో పెరిగిన పిచ్చిమొక్కలు, వ్యర్థాలు, పూడికతీత పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం సుమారు రూ.3 కోట్లు ఖర్చు కానుందని, ఈ పనులకు 2020 నుంచి బేలన్స్‌వర్క్‌ నిధులను వినియోగించాలని సూచించారు. తోటపల్లి కుడి ప్రధాన కాలువ పరిధిలోని 52.450 కిలోమీటర్ల నుంచి 80.00 కిలోమీటర్ల వరకూ సమస్యాత్మకంగా ఉన్న రీచ్‌ను శనివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఖరీఫ్‌ సమీపించిందని, కాలువల్లో పూడికలు, పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో నీటి ప్రవాహం ముందుకు సాగడం లేదన్నారు. ఫలితంగా జిల్లాలోని చీపురుపల్లి, నెల్లిమర్ల, శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్ల, శ్రీకాకుళం ప్రాంత రైతాంగానికి సాగునీరు అందడం లేదని ఆయన గుర్తు చేశారు. ఖరీఫ్‌లో చివరి ఆయకట్టు వరకూ రైతాంగానికి సాగునీరు అందించాలని, ఒక్క ఎకరాకు కూడా సాగునీందలేదన్న అపవాదు ఇరిగేషన్‌ అధికారులపై రాకూడదని స్పష్టం చేశారు. పిల్లకాలువల పనులు కూడా త్వరితగతిన పూర్తిచేయాలని సీఈ నరిశింహమూర్తి ఆదేశించారు. అనంతరం తోటపల్లి కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారి వెంట తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్ట్‌ ప్యాకేజీ నెంబర్‌ 2 ఈఈ గనిరాజు, డీఈఈలు సుబ్బారావు, శంకర్‌, లావణ్య, ప్రియదర్శిని, ఏఈలు ఉన్నారు.

ఆంధ్రజ్యోతి కథనంతో కదలిక

ఖరీఫ్‌ సీజన్‌ ముంచుకొస్తున్న వేళ.. తోటపల్లి కాలువల్లో పూడికలు, పిచ్చిమొక్కలు పెరిగిపోయాయని, కాలువలను ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు వ్యర్థాలన్నీ కాలువల్లో పడవేస్తున్నారని, ఫలితంగా సాగునీటి ప్రవాహం తగ్గిపోయి శివారు భూములకు సాగునీరందే పరిస్థితి లేదని ‘కాలువలున్నాయ్‌... నీళ్లు రావ్‌..’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఈనెల 15న ప్రచురితమైన కథనంతో ఇరిగేషన్‌ అధికారుల్లో కదలిక వచ్చింది. తోటపల్లి కాలువల్లో పూడికలు తొలగింపు, గట్లు బలోపేతం తదితర పనులకు సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు పంపించామని, నిధులు మంజూరైతే దశలవారీగా పనులు ప్రారంభిస్తామని తోటపల్లి ప్రాజెక్ట్‌ ఎస్‌జీఎల్‌టీబీపి సబ్‌ డివిజన్‌ 1 ఉప కార్యనిర్వాహక ఇంజినీర్‌ సుబ్బారావు ఈ నెల 18న వివరణ ఇచ్చారు. ప్రతిపాదిత అంచనాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, నిధులు మంజూరయ్యాక పనులు చేపడతామని ప్రకటించారు. ఆయన చెప్పి 48 గంటలు గడవక ముందే ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ నరిశింహమూర్తి తోటపల్లి కాలువల పరిస్థితిని ప్రాజెక్ట్‌ అధికారులతో కలసి శనివారం పరిశీలించారు. అనంతరం సమీక్ష చేపట్టారు.

Updated Date - Jun 21 , 2026 | 12:06 AM