Share News

Thotapalli తోటపల్లికి జలకళ

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:31 AM

Thotapalli Springs to Life with Water తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతం ఒడిశాతో పాటు ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా నాగావళికి వరద పోటెత్తుతోంది.

Thotapalli తోటపల్లికి జలకళ
స్పిల్‌వే గేట్లు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

  • స్పిల్‌వే గేట్లు నుంచి దిగువకు నీరు విడుదల

గరుగుబిల్లి, జూలై7(ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతం ఒడిశాతో పాటు ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా నాగావళికి వరద పోటెత్తుతోంది. మంగళవారం పైప్రాంతాల నుంచి సుమారు 2 వేల క్యూసెక్కులు ప్రాజెక్టులోకి చేరింది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా రెండు స్పిల్‌వే ప్రధాన గేట్లు నుంచి 1,550 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను ప్రస్తుతం 104.64 మీటర్ల వరకు నీటి నిల్వ ఉంది. ఎడమ ప్రధాన కాలువ నుంచి 150 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ నుంచి 200 క్యూసెక్కులను ఖరీఫ్‌ సాగుకు విడుదల చేశారు.

కుడి కాలువకు గండి

తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని సుంకి ప్రాంతంలో కుడి ఉప కాలువకు గండి పడింది. దీంతో సాగునీరు సమీపంలోని గెడ్డలోకి చేరి తిరిగి నాగావళి లో కలుస్తోంది. దీంతో గరుగుబిల్లి, బలిజిపేట, విజయనగరం జిల్లా వంగరలో సుమారు 9 వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరందడం లేదు. ఖరీఫ్‌ ప్రారంభంలోనే ఈ పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నారుమళ్లు సిద్ధం చేసుకున్న తరుణంలో సాగునీరు సరఫరా కాకపోవడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. త్వరితగతిన ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. దీనిపై తోటపల్లి పాత రెగ్యులేటర్‌ వీరఘట్టం సెక్షన్‌ ఏఈ డీవీ రమణను వివరణ కోరగా.. ‘పాత రెగ్యులేటర్‌ పరిధిలోని కుడి కాలువ నుంచి సాగునీరు సరఫరాకు అవసరమైన చర్యలు చేపడతాం. సుంకి సమీపంలో కాలువకు పడిన గండిని మూడు రోజుల్లో పూడ్చుతాం. రక్షణ గోడల లీకులను సరిచేస్తాం. కాంక్రీటు పనులు నిర్వహించి సాగునీరు సరఫరా చేస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.’ అని తెలిపారు.

Updated Date - Jul 08 , 2026 | 12:31 AM