తోటపల్లి.. శివారుకు నీరేదీ?
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:40 AM
తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో 8వ బ్రాంచికి నీరే అందడం లేదు. ఒకటి, రెండు కాదు.. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. 120 ఏళ్ల ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టడం లేదు.
120 ఏళ్లనాటి పాత రెగ్యులేటర్
తోటపల్లి పాత కుడి, ఎడమ ఆధునికీకరణ పనులు నిలిచిపోవడంతో తోకముడి (టైల్ ఎండ్) ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు.
ఎల్‌నినో ప్రభావం..
ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండడంతో నీటి ప్రవాహాన్ని సరిగా నిర్వహంచపోతే ఖరీఫ్ పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది.
అసంపూర్తి పనులు
2018లో టీడీపీ ప్రభుత్వం రూ.196 కోట్లు కేటాయించినా తదనంతరం వచ్చిన ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అనడం, ఆతర్వాత పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో 25 శాతం కూడా దాటలేదు
పర్యవేక్షణలోపం.. లస్కర్ల కొరత
రాత్రి సమయాల్లో కాలువల షట్టర్లు దించేసి నీటిని మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లస్కర్ల కొరత వల్ల సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది. .
1 నుంచి 7 బ్రాంచిల వరకే సరఫరా
కాలువల్లో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు
స్లూయిజ్‌లకు షట్టర్లులేక ఇబ్బందులు
పాలకొండ, జూలై 23(ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో 8వ బ్రాంచికి నీరే అందడం లేదు. ఒకటి, రెండు కాదు.. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. 120 ఏళ్ల ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టడం లేదు. ఆధునికీకరణ పనులూ చేయడం లేదు. దీంతో శివారు ఆయకట్టు రైతులు నీరందక ఏటా నష్టపోతున్నారు. దీనికితోడు ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావం నెలకొంది.
సుమారు 120 ఏళ్ల తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధి లోని 32 కిలోమీటర్ల ఎడమకాలువ, 18 కిలోమీటర్ల కుడి కాలువ అధికంగా కోతకు గురయ్యాయి. ఎడమకాలువ ద్వా రా గరుగుబిల్లి, జియ్యమ్మవలస, వీరఘట్టం, పాలకొండతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలంలో 32 కి.మీ. పరిధి 32వేల ఎకరాలకు నీరు అందాలి. అదనంగా మరో 8వేల ఎకరాలకు నీరందాల్సి ఉంది. అలాగే కుడికాలువ పరిధిలోని గరుగుబిల్లి, వంగర, జియ్యమ్మవలస మండలా ల్లోని 20వేల ఎకరాలకు నీరు అందాలి. అయితే కుడికాలువ లో పూడిక తీయకపోవడం, స్లూయిజ్‌లు, షట్టర్లు తుప్పు పట్టి మరమ్మతులకు గురికావడంతో సాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది.
తోటపల్లి పూర్వపు ఆయకట్టు ద్వారా నీటిపారుదల శాఖ యంత్రాంగం కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేసింది. అయితే ప్రాజెక్టు కింద ఉన్న 1 నుం చి 7వ బ్రాంచి రైతులు మాత్రమే నీరు వాడుకుంటు న్నారన్నారు. శివారు ప్రాంతాల రైతులకు నీరు విడుద ల చేయలేదు. ఉదాహరణకు ఎడమ కాలువ పరిధి లోని ఏడో బ్రాంచి వరకు నాలుగు అడుగులు మేర నీరు అందుతోంది. ఆ నీటిని ఆయా బ్రాంచి కాలువ ల ద్వారా మళ్లించి ఖరీఫ్ పనులు ముమ్మరం చేస్తు న్నారే తప్ప 8వ బ్రాంచితో పాటు శివారు ఏరియా లోని నారు మడులకు ఇవ్వడం లేదు. ఈ వ్యవహా రంలో ప్రాజెక్టు కమిటీలు, అధికార యంత్రాంగం తాత్సారం చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఏళ్లు గడుస్తున్నా సాగని పనులు
2018లో టీడీపీ హయాంలో ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.196 కోట్లు విడుదల చేసి టెండర్లు పూర్తి చేశారు. పనులు కూడా మొదలు పెట్టారు. పనుల్లో వేగం పెరిగే దశలో ఎన్నికలు వచ్చాయి.
2019-24 మధ్య వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరిట పాత పనులను నిలిపివేశారు. కేవలం 16 కిలోమీటర్లు మేర (రూ.40కోట్లతో 23 శాతం పనులు) మాత్రమే కాంక్రీట్ పనులు చేపట్టి మిగిలినవి నిలిపివేశారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టకపోవడంతో పనులు పునఃప్రారంభం కాలేదు. ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
లస్కర్ల కొరత.. రాత్రివేళ అక్రమాలు
ప్రాజెక్టు పరిధిలో కాలువల పర్యవేక్షణకు 30 మంది లస్కర్లు అవసరం కాగా ప్రస్తుతం ఆరుగురు మాత్రమే ఉన్నారు. దీనికితోడు కాలువలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. ఎగువ ప్రాంతాల రైతులు నీటిని ఎక్కువగా వినియోగించుకోవడంతో దిగువన ఉన్న చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది రాత్రివేళ ప్రధాన కాలువల్లోని నీటిని పూర్తిస్థాయిలో వదలకుండా షట్టర్లు దించివేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల నారు మడులు, వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలి: గిరిరాజ్, ఇరిగేషన్ ఇన్‌చార్జి ఈఈ
పాత కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. వర్షాభావ పరిస్థితుల వల్ల చివరి ఆయకట్టుకు నీరు అందించడం సవాలుగా మారింది. కాబట్టి రైతులు ఆరుతడి పంటలు వేసుకోవడం మంచిది. రాత్రివేళల్లో సిబ్బంది షట్లర్లు దించి నీటిని మళ్లిస్తున్నారనే విషయం నా దృష్టికి రాలేదు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవు