Share News

దర్శనానికి వచ్చిన వారిని

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:16 AM

ఐదుగురూ కలిసి వెళ్లారు. అందులో రెండు జంటలు పెళ్లిబంధంతో ఒక్కటైన భార్యాభర్తలు. కార్తీక పౌర్ణమి వేళ పరమశివుడిని దర్శించుకుని, కుటుంబాలతో ఆనందంగా గడపాలని ఆశపడ్డారు. దర్శనం పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

 దర్శనానికి వచ్చిన వారిని
శ్రీముఖలింగం బయలుదేరడానికి ముందు సంగివలసలో సతీష్‌, శ్రీను కుటుంబాలు తీసుకున్న సెల్ఫీ

దర్శనానికి వచ్చిన వారిని

నీ చెంతకే చేర్చుకున్నావా శివయ్యా?

భోగాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

రెండు జంటల సహా ఐదుగురు మృతి

పెళ్లిబంధంతో ఒక్కటై.. మృత్యువులోనూ తోడుగా..

పిల్లలకు ఫోన్‌లో పలకరింపులే చివరి మాటలు

ఐదుగురూ కలిసి వెళ్లారు. అందులో రెండు జంటలు పెళ్లిబంధంతో ఒక్కటైన భార్యాభర్తలు. కార్తీక పౌర్ణమి వేళ పరమశివుడిని దర్శించుకుని, కుటుంబాలతో ఆనందంగా గడపాలని ఆశపడ్డారు. దర్శనం పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. పిల్లలు ఫోన్‌ చేసి ‘ఎక్కడున్నారు.. ఎప్పుడు వస్తారు?’ అని అడిగితే మరికాసేపట్లో ఇంటికి వచ్చేస్తామని చెప్పారు. కానీ ఆ మాటలే వారికి చివరివయ్యాయి. పెళ్లితో ఒక్కటైన ఆ రెండు జంటలు మృత్యువులోనూ విడిపోలేదు. మార్గమధ్యంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలిగొంది. తెల్లవారితే పిల్లలతో గడపాల్సిన తల్లిదండ్రులు విగతజీవులయ్యారు. ఇంటికి వస్తారని ఎదురుచూసిన చిన్నారులకు తీరని శోకాన్ని మిగిల్చారు. ‘దర్శనానికి వచ్చిన వారిని నీ చెంతకే చేర్చుకున్నావా శివయ్యా’ అంటూ బంధువులు రోదించారు.

విజయనగరం/భోగాపురం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురం వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం ఆలయాన్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న ఐదుగురు మృత్యువాత పడ్డారు. సుంకరిపేట వద్ద వీరు ప్రయాణిస్తున్న థార్‌ జీపు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో బొర్రా శృతి (31), బొర్రా సతీష్‌ (40) భార్యభర్తలు. వీరు విశాఖలోని తగరపువలసకు చెందిన వారు. ఈ ప్రమాదంలోనే పోతలమల్లయ్యపాలెంకు చెందిన భార్యాభర్తలు ఆర్‌.కుసుమరజని (39), వాకలపూడి శ్రీను (42) కూడా మృతి చెందారు. డ్రైవింగ్‌ చేస్తున్న మధురవాడకు చెందిన కొండపు సూరిబాబు (43) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు.

అర్ధరాత్రి మొదలైన ప్రయాణం.. ఉదయాన్నే విషాదం

- కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీముఖలింగం శివాలయంలో దర్శనం చేసుకోవాలని విశాఖపట్నంలో ఉంటున్న ఈ ఐదుగురు సోమవారం అర్ధరాత్రి 12-12.30 గంటల మధ్య థార్‌ జీపులో బయలుదేరారు.

- తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో నాతవలస టోల్‌గేట్‌ దాటారు.

- అక్కడి నుంచి రెండున్నర నుంచి మూడు గంటల ప్రయాణం అనంతరం శ్రీముఖలింగం చేరుకున్నారు.

- శివుడిని దర్శించుకుని, ఆలయ ప్రాంగణంలో ఫొటోలు దిగారు. వాటిని వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ద్వారా కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపించారు.

- తెల్లవారుజామున 4-4.40 గంటల మధ్య విశాఖపట్నానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో అల్పాహారం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

- ఉదయం 7.20 గంటలకు భోగాపురం మండలం సుంకరిపేట వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను వారి జీపు బలంగా ఢీకొట్టింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అంతకుముందు వీరు జీపులో ప్రయాణిస్తుండగా ఇంటి నుంచి పిల్లలు ఫోన్‌ చేయగా మరి కాసేపట్లో వస్తామని బదులిచ్చారు. ఇంటికి వస్తారని ఎదురుచూసిన ఆ పిల్లలకు విగతజీవులైన తల్లిదండ్రులు కనిపించారు.

-కేసు దర్యాప్తును విజయనగరం డీఎస్పీ ఎస్‌.లక్ష్మణమూర్తికి అప్పగించినట్లు ఎస్పీ వెల్లడించారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ మణికుమార్‌, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు వి.వెంకటరావు, ఎం.శివకుమార్‌ కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటం లేదా అతివేగంగా వాహనం నడపడం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని మణికుమార్‌ తెలిపారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆసుపత్రి వద్ద మిన్నంటిన రోదనలు

ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కొద్దిసేపటి క్రితం తమతో ఆనందంగా గడిపిన వారు విగతజీవులుగా కనిపించడంతో తట్టుకోలేకపోయారు. ‘దర్శనానికి వచ్చిన వారిని నీ చెంతకే చేర్చుకున్నావా శివయ్యా’ అంటూ రోదించారు. భర్తను కోల్పోయిన గౌరి ‘ఇప్పుడిక మాకు ఎవరు దిక్కు?’ అంటూ విలపించిన తీరు అక్కడివారిని కలచివేసింది. ఆసుపత్రి ప్రాంగణమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

బే- పార్కింగ్‌ను అందుబాటులోకి తేవాలి: ఎస్పీ దామోదర్‌

భోగాపురం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): భోగాపురం జాతీయ రహదారిపై లారీలను నిలిపి వేయకుండా, డ్రైవర్లు విశ్రాంతి తీసుకొనేందుకు, వాహనాలను పార్కింగ్‌ చేసేందుకు అనువుగా రావాడ వద్ద నేషనల్‌ హైవే అథారిటీ కేటాయించిన బే- పార్కింగ్‌ స్థలాన్ని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు ఎస్పీ దామోదర్‌ సూచించారు. ఈ స్థలాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. జాతీయ రహదారిపై లారీలను నిలుపుతుండడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. బే-పార్కింగ్‌ స్థలాలను అందుబాటులోకి తెచ్చి లారీ డ్రైవర్లు విశ్రాంతి తీసుకొనేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లయితే హైవేపై వాహనాలను నిలపకుండా ఉంటారన్నారు. బే పార్కింగ్‌లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలిసేలా సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై హైవే అథారిటీ అదికారులతో చర్చిస్తామని తెలిపారు.

Updated Date - Nov 25 , 2026 | 12:16 AM