Share News

Those lands were sold ఆ భూములు కాజేశారు

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:36 PM

Those lands were sold ఎస్‌.కోట మండలంలోని ధర్మవరం చెన్నకేశవస్వామికి 115ఎకరాల భూమి ఉంది. అన్ని ఎకరాలుంటే స్వామి రోజువారీ కైంకర్యాలు ఎంతో వైభవంగా జరుగుతాయని అనుకుంటారు. కానీ దూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు.

Those lands were sold ఆ భూములు కాజేశారు
గత ఏడాది ఏప్రిల్‌ 17న ప్రచురించిన ఆంధ్రజ్యోతి కథనం

ఆ భూములు కాజేశారు

ఏడాది క్రితం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం

ఆ 47 ఎకరాలు ఏమయ్యాయని ప్రశ్న

కొంతమంది రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకున్నట్లు గుర్తించిన దేవదాయశాఖ

అయినా చర్యలు శూన్యం

చెన్నకేశవ స్వామి మాన్యం పరిస్థితిదీ

ఎస్‌.కోట మండలంలోని ధర్మవరం చెన్నకేశవస్వామికి 115ఎకరాల భూమి ఉంది. అన్ని ఎకరాలుంటే స్వామి రోజువారీ కైంకర్యాలు ఎంతో వైభవంగా జరుగుతాయని అనుకుంటారు. కానీ దూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు. రూ.కోట్ల విలువైన 47 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లో ఉంది. దీనిపై ఏడాది క్రితం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. అయినా అధికారులు చోద్యం చూశారు. ఇప్పుడేమో ఆ భూములను కొంతమంతి రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. అయినా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.

ఎస్‌.కోట రూరల్‌, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి):

ధర్మవరం చెన్నకేశవస్వామికి 115 ఎకరాల భూమి ఉందని చరిత్రగా చెప్పుకోవాల్సి వస్తోంది. అందులో సగం భూమి కూడా స్వామి స్వాధీనంలో లేదు. ఆ భూముల అంశాన్ని దశాబ్దం క్రితమే ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో ఒక ఆసామి చేతిలో ఉన్న 53 ఎకరాలు మినహా మిగతా భూమిని దేవదాయశాఖ స్వాధీనం చేసుకుంది. అయితే రానురాను అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ దేవుడికి చెందిన మరో 47 ఎకరాలు కూడా మాయమయ్యాయి. దీంతో గత ఏడాది ఏప్రిల్‌ 17న ఆ 47 ఎకరాలు ఏమైనట్లో శీర్షికన ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. జిల్లా దేవదాయశాఖ అధికారులతో పాటు రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ స్పందించి భూములపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఈవోను ఆదేశించారు. అయితే సిబ్బంది కొరత వల్ల సర్వే నత్తనడకన సాగింది.

అధికారులు గుర్తించినా...

ఆ 47ఎకరాల భూమిలో కొందరు ఆక్రమార్కులు గత ప్రభుత్వంలో కొంతమంది వీఆర్‌వోల సహకారంతో వారిపేరున రిజిస్ట్రేషన్‌ చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. లక్షల రూపాయలు చేతులు మారినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగడంతో అధికారులు వెనకంజ వేశారని తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో ఈ విషయంపై ఒక ఈవో ఆక్రమణదారులను ప్రశ్నిస్తే ‘అది మా భూమి అని ఘీంకరించడంతో పాటు మా భూమిలోకి ఇంకోసారి రావొద్దని’ హెచ్చరించినట్లు తెలిసింది. ఆ ఈవో దేవస్దానం భూమి అని గతంలో వీటికి శిస్తు కట్టావని చెప్పినా ఏ శిస్తు కట్టలేదు.. కట్టను అని తెగేసి చెప్పడంతో అధికారి వెనుతిరిగాడు.

రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు

కేశవస్వామి ఆలయ భూమిలో కొన్ని నెంబర్లు రిజిస్ట్రేషన్‌ అయినట్లు దేవదాయశాఖ ఉద్యోగులు అంటున్నారు. సర్వే నెంబర్‌ 291లో రెండు ఎకరాలు, 298/5/7లో ఎకరా 27సెంట్లు, సర్వేనెంబర్‌ 308లో 11 సెంట్లు, 298/5లో 62 సెంట్లు, సర్వేనెంబర్‌ 38/15లో 69 సెంట్లు, సర్వేనెంబర్‌ 298/4-6లో ఎకరా 39 సెంట్లు, సర్వే నెంబర్‌ 308లో 50 సెంట్లు జిరాయితీలుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని, పూర్తి స్థాయి సర్వే చేయాల్సి ఉందని అంటున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో కోట్ల రూపాయల విలువ చేస్తుందని అంటున్నారు.

స్వాధీనం చేసుకోగలరా..?

జిరాయితీలుగా మారిన దేవదాయశాఖ భూమిని తిరిగి ఆ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోగలరా.. లేదా అన్న ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నం అవుతున్నాయి. దేవదాయశాఖ ఉదాసీన వైఖరీ వల్ల ఇప్పటికే రూ.కోట్లు విలువ చేసే 53 ఎకరాల భూమి వివాదంలో ఉంది. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. మిగతా భూమిని కూడా అధికారులు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. ఈవిషయంపై ఇకపై అయినా దేవదాయశాఖ సీరియస్‌గా స్పందిస్తుందేమో చూడాలి.

Updated Date - Feb 10 , 2026 | 11:36 PM