Those habits... undermine health. ఆ అలవాట్లు.. ఆరోగ్యానికి తూట్లు
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:07 AM
Those habits... undermine health.గంట్యాడ మండలానికి చెందిన 15 ఏళ్ల బాలుడు వారానికి నాలుగైదుసార్లు పిజ్జాలు, బర్గర్లు, కూల్ డింక్ర్స్ తీసుకునేవాడు. ఈ అలవాటుతో అధిక బరువు పెరిగాడు. పరీక్షల ప్రారంభ సమయంలో ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తక్షణం ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని వైద్యులు సూచించారు. కీలక సమయంలో అనారోగ్య సమస్య రావడంతో పరీక్షలు రాయలేకపోయాడు.
ఆ అలవాట్లు.. ఆరోగ్యానికి తూట్లు
జంక్‌ఫుడ్‌కు బానిసలవుతున్న పిల్లలు
నిర్లక్ష్యంతో అనారోగ్యం పాలు
విద్యా సంస్థల ఆవరణాల్లో అభ్యంతరకర చిరుతిళ్ల అమ్మకం
నిషేధించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
తల్లిదండ్రులూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
నేడు ప్రపంచ జంక్‌ఫుడ్ నివారణ దినం
విజయనగరం కలెక్టరేట్/ రింగురోడ్డు, జూలై 20(ఆంధ్రజ్యోతి):
- గంట్యాడ మండలానికి చెందిన 15 ఏళ్ల బాలుడు వారానికి నాలుగైదుసార్లు పిజ్జాలు, బర్గర్లు, కూల్ డింక్ర్స్ తీసుకునేవాడు. ఈ అలవాటుతో అధిక బరువు పెరిగాడు. పరీక్షల ప్రారంభ సమయంలో ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తక్షణం ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని వైద్యులు సూచించారు. కీలక సమయంలో అనారోగ్య సమస్య రావడంతో పరీక్షలు రాయలేకపోయాడు.
- విజయనగరం పట్టణంలోని ఓ పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని గాయత్రి ప్రతిరోజూ పాఠశాల సమీపంలో విక్రయించే నూడుల్స్, ప్రెంచ్‌ప్రైస్ తినేది. కొద్దిరోజులుగా కడుపు నొప్పి, విరేచనాలు, అజీర్ణ సమస్యలతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. జంక్‌ఫుడ్ కారణంగా జీర్ణవ్యవస్ధ దెబ్బతింటోందని వైద్యులు తేల్చారు. ఆ బాలిక పాఠశాలకు చాలా రోజుల పాటు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.
ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు మధ్యాహ్నానికి చిప్స్ ప్యాకెట్, సాయంత్రానికి బర్గర్, కూల్ డ్రింక్‌తో ఇంటికి చేరుతున్నారు. ఒకప్పుడు పండ్లు, శనగలు, పల్లీలు, ఇంటి ఆహారానికి అలవాటు పడిన చిన్నారులు ఇప్పుడు పిజ్జా, నూడుల్స్, ప్రెంచ్ ప్రైస్‌కు బానిసలుగా మారుతున్నారు. ఇటు విద్యా సంస్థల వద్ద కూడా యథేచ్ఛగా జంక్‌ఫుడ్ విక్రయాలు సాగుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొన్ని విద్యా సంస్థలే తమ క్యాంటీనల్లో ఇటువంటి పదార్థాలను విక్రయించడం. దీనిపై ప్రభుత్వం తక్షణం దృష్టిసారించకపోతే చాలా మంది చిన్నారుల ఆరోగ్యానికి పెనుముప్పు పొంచి ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథార్టీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలను పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో విక్రయించకూడదు. పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ఆరోగ్యకర ఆహార పదార్థాలనే ప్రోత్సహించాలి. కానీ ఎక్కడా ఇలాంటి పరిస్థితులు లేవు. దీనిపై తల్లిదండ్రుల్లోనూ చైతన్యం పెరగాలి.
- జిల్లాలో చాలా పాఠశాలలు, కలాశాలల గేట్ల వద్ద మధ్యాహ్నం విరామ సమయాల్లో జంక్ ఫుడ్ దుకాణాలు కళకళలాడుతున్నాయి. రూ.10 నుంచి రూ.100 వరకూ ధరలతో బర్గర్లు, పిజ్జాలు, చిప్స్, పానీపూరి, కూల్‌డ్రింక్స్ అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థులు వీటిపైపు ఆకర్షితులవుతున్నారు. కొన్నిచోట్ల కళాశాలలే క్యాంటీన్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి జంక్‌ఫుడ్ విక్రయాలను ప్రోత్సహిస్తున్నాయి.
- బర్గర్లు, పిజ్జాలు, ప్రెంచ్‌ప్రైస్, చిప్స్ ప్యాకెట్స్, బిస్కెట్లు, బేకరీ ఫుడ్, కేకులు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ప్యాక్ చేసిన పండ్ల రసాలు, సమోసాలు, పకోడీ, నూడుల్స్, బజ్జీలు జంక్‌ఫుడ్ కోవలోకి వస్తాయి.
పిల్లలో పెరుగుతున్న అనారోగ్యం
చిన్నారుల్లో ఇటీవల కాలంలో ఊబకాయం, మఽధుమేహం, రక్తపోటు, జీర్ణ సమస్యలు, పోషకాహార లోపాలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. జంక్‌ఫుడ్ వల్ల గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్ణ, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఉప్పు, చక్కెర నూనెలతో తయారయ్యే జంక్‌ఫుడ్ పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. చాక్లెట్లు, శీతల పానీయాలు, అధిక చెక్కర ఉన్న పదార్థాల వల్ల దంత క్షయం , పళ్ల సమస్యలు పెరుగుతాయి. శారీరక చురుకుదనం తగ్గడం, చదువుపై ఏకాగ్రత తగ్గడం, భవిష్యత్‌లో గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. అధిక కొవ్వు, చక్కెర కారణంగా చిన్నారుల్లో ఫ్యాటీ లివర్ కేసులు కూడా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ప్రచారాలకే పరిమితమా?
ఒకవైపు ప్రభుత్వం, ఈట్ రైట్ ఇండియా హెల్తీఫుడ్ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు అవే ప్రభుత్వ శాఖలు విద్యా సంస్థల వద్ద జంక్‌ఫుడ్ విక్రయాలను మాత్రం నిలువరించలేకపోతున్నాయి. ప్రపంచ జంక్‌ఫుడ్ నివారణ దినం ప్రతి ఏడాది జూలై 21న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోస్టర్ల ఆవిష్కరణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిబంధనలను క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో మాత్రం అందరూ విఫలమవుతున్నారు.
ఇవి తింటే ఆరోగ్యం
జామ, యాపిల్, బొప్పాయి, అరటిపండు, మిల్లెట్స్, పెసలు, ఉడికించిన శనగలు, బాదం పప్పు, కొబ్బరి నీళ్లు, ఇంట్లో చేసిన అటుకులు, ఉప్మా, మజ్జిగ లేదా నిమ్మరసం, పండ్ల సలాడ్ తదితర ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
జంక్ ఫుడ్ ఇష్టపడుతున్నారు
పిల్లలు రోజూ జంక్‌ఫుడ్ అడుగుతున్నారు. వాటినే ఎక్కువగా తింటున్నారు. దీనివల్ల ఊబకాయం, కడుపులో సమస్యలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం కఠినంగా వ్యహరించి స్కూళ్ళు, కళాశాలల పరిసరాల్లో ఇలాంటి ఆహార విక్రయాలను అరికట్టాలి
- ఆర్.రమణమ్మ విద్యార్థిని తల్లి, గంట్యాడ
పాఠశాల ఆవరణాల్లో విక్రయించడం లేదు
జిల్లాలోని ఏ పాఠశాల ఆవరణంలోనూ జంక్‌ఫుడ్ విక్రయించడం లేదు. అలా చేస్తే చర్యలు తీసుకుంటాం. పాఠశాల గేటు బయట అమ్మవద్దని చెప్పాం. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం వేడి వేడి భోజనం అందిస్తున్నాం.
యు.మాణిక్యంనాయుడు, జిల్లా విద్యాశాఖ అధికారి
జంక్ ఫుడ్‌తో ముప్పు
అపరిశుభ్ర నీరు, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదం ఎక్కువ. తరుచూ ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. కొందరిలో ఐబీఎస్, ఐబీడీవంటి దీర్ఘకాలిక జీర్ణవ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. భవిష్యత్‌లో కడుపు,పెద్దపేగు, చిన్న పేగు, జీర్ణాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఓ బర్గర్‌ను చేతిలో పెట్టే బదులు ఒక జామ పండు ఇస్తే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది.
డాక్టర్ శ్రవణ్‌కుమార్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, విజయనగరం
--------------