ఆ మందులతో ఆరోగ్యానికి ముప్పు
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:04 PM
నొప్పి నివారణ మందులను వాడే సందర్భంలోమూడు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అవి సురక్షితమైనవై ఉండాలి.
- ఇష్టారాజ్యంగా పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్ వినియోగం
- డాక్టర్ల సలహా లేకుండా కొనుగోలు
- మందుల చీటి లేకపోయినా ఇచ్చేస్తున్న మెడికల్ షాపుల నిర్వాహకులు
- అధికంగా వినియోగిస్తే కిడ్నీ, లివర్ దెబ్బతింటాయంటున్న వైద్యులు
విజయనగరం రింగురోడ్డు, మార్చి 22 ( ఆంద్రజ్యోతి): నొప్పి నివారణ మందులను వాడే సందర్భంలోమూడు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అవి సురక్షితమైనవై ఉండాలి. తక్కువ ప్రభావం కలిగనవై ఉండాలి. వాటిని తక్కువ కాలం పాటు వాడుకోవాలి. కానీ, కొంతమంది శరీరంలో ఏ నొప్పి వచ్చినా వెంటనే పెయిన్ కిల్లర్ తెప్పించుకుని వేసుకుంటారు. డాక్టర్ సలహా అస్సలు తీసుకోరు. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందేందుకు వేసే ఒక మాత్ర మన జీవిత కాల ఆరోగ్యానికి శాపంగా మారుతోంది. వీటిని నిబంధనల ప్రకారం డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ ఉంటే తప్ప ఇవ్వకూడదు. కానీ, జిల్లాలోని చాలా మెడికల్ షాపులు ఈ నిబంధనలు పట్టించుకోవడం లేదు. మందు చీటి లేకపోయినా వాటిని అందిస్తున్నారు. ముఖ్యంగా అధిక మోతాదు కలిగిన యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్లతో ఆరోగ్యానికి చేటు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
దుష్ప్రభావాలు ఇవే..
మనం వాడే పెయిన్ కిల్లర్లు శరీరంలోని ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని అడ్డుకుంటాయి. ఫలితంగా కడుపులోని రక్షణ పొర దెబ్బతిని అల్సర్లు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఈ మందులు వేసుకోవడంతో కిడ్నీలు పనితీరు దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిమ్స్‌లైడ్ డిక్లోఫినాక్ ఎంటోరీ కాక్సీప్, ట్రామడాల్ వంటి పెయిన్ కిల్లర్లతో కాలేయం దెబ్బతినడం, కిడ్నీలు వైఫల్యం, ప్రాణాంతక అలర్జీలు, కడుపులో పుండ్లు, గ్యాస్ట్రిక్, రక్తస్రావం, గుండెపోటు, రక్తపోటు పెరగడం, కాళ్లవాపు, మగత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి.
సిప్రోప్లోక్సాసిన్, ఆఫ్‌లోక్సాసిన్, అమోక్సీ సిలిన్, క్లావులానిక్ యాసిడ్, అజిత్రోమైసిన్, డెక్సా మెథాసోన్, ప్రెడ్నీ సోలేన్ వంటి యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్ కలిగిన ఔషధాల వినియోగంతో కండరాలు పట్టేయడం, కీళ్ల నొప్పులు, మానసిక ఆందోళన, తల తిరగడం, తీవ్రమైన విరోచనాలు, కాలేయం పనితీరు దెబ్బతినడం, జాండీస్, జీర్ణకోశ సమస్యలు, షుగర్ వ్యాధి రావడం, ఎముకలు బలహీన పడడం, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటివి జరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
యాంటీబయోటిక్స్ అనవసరంగా వాడడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా ఆ మందులకు అలవాటు పడిపోతుంది. భవిష్యత్తులో నిజంగా ఏదైనా పెద్ద ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు ఆ మందులు అసలు పనిచేయవని వైద్యులు చెబుతున్నారు.
పెయిన్ కిల్లర్లు రక్తప్రసరణను ప్రభావితం చేస్తాయి. ఇప్పటికే బీపీ, షుగర్ ఉన్నవారు వీటిని వాడితే, కిడ్నీలు శాశ్వతంగా పాడయ్యే అవకాశం ఉంది.
తనిఖీలు ఎక్కడ?
జిల్లా వ్యాప్తంగా 1,500కి పైగా మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయి. చాలా మెడికల్ షాపుల్లో వైద్యుల ప్రిస్ర్కిప్షన్ లేకుండా షెడ్యూల్-హెచ్ డ్రగ్ ఉన్న ఔషధాలను అంటగడుతున్నారు. ఇందులో ఎక్కువగా పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఆయా మందుల దుకాణాల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు నామామాత్రంగా సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిషేధిత మందుల విక్రయాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జాగ్రత్తలు ఇవే
పెయిన్ కిల్లర్లను ఎప్పుడు ఖాళీ కడుపుతో వేసుకోరాదు. దీని వల్ల ఏసీడీటీ పెరిగి అల్జర్లు వస్తాయి. నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోకుండా వాడే మందులు తాత్కాలికమే కాని శాశ్వత పరిష్కారం కాదు. ఈ నేపథ్యంలో శరీరంలో ఎక్కడైనా నొప్పి వచ్చినప్పుడు సొంత వైద్యంగా మెడికల్ షాపులను సంప్రదించకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి, వారి సూచనల ప్రకారమే మందులు వాడాలి. వైరల్ ఫీవర్స్‌కి కూడా యాంటీ బయోటిక్స్ వాడడం వల్ల శరీరంలో యాంటీ మైక్రోబీఎల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ఏర్పడి భవిష్యత్తులో ప్రాణాపాయ స్థితిలో మందులు పనిచేయకుండా పోతాయి
కఠిన చర్యలు తీసుకుంటాం
డాక్టరు మందుల చీటి లేకుండా షెడ్యూల్-హెచ్ డ్రగ్స్ అయిన యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్లను మెడికల్ షాపుల్లో విక్రయించకూడదు. హోల్‌సేల్ డీలర్ల నుంచి రిటైల్ షాపుల వరకూ రికార్డులు తనిఖీ చేస్తున్నాం. వీటిపై నిఘా పెంచాం. లైసెన్స్ లేకుండా మందులు నిల్వ చేసినా, నిషేధిత డ్రగ్స్ విక్రయించినా, డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం కింద కేసులు నమోదు చేస్తాం. ప్రజలు కూడా డాక్టర్ చీటి లేకుండా మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేయరాదు.
కె.రజిత, డ్రగ్ కంట్రోలర్, విజయనగరం
=========
పెయిన్ కిల్లర్లతో అనారోగ్య సమస్యలు
పెయిన్ కిల్లర్లు అతిగా వాడడం వల్ల కడుపులో పుండ్లు ఏర్పడి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక్కోసారి ప్రాణాంతకమవుతుంది. నొప్పిని కేవలం లక్షణంగా చూడాలి తప్ప, మందులతో అణిచివేయకూడదు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు, వృద్ధులు వీటి జోలికి వెళ్లకూడదు. పెయిన్ కిల్లర్లు, కడుపులో యాసిడ్ స్థాయిలను పెంచి కడుపు పొరను దెబ్బతిస్తాయి. దీంతో గ్యాస్టిస్, అల్సర్లు, మంట, రక్తస్రావానికి దారితీసే అవకాశం ఉంది. జ్వరం, కీళ్లనొప్పులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, వృద్ధులు డాక్టర్ల సలహా మేరకే పెయిన్ కిల్లర్లు పరిమిత కాలం పాటు వాడాలి.
-డాక్టర్ శ్రావణ్‌కుమార్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటారాలజిస్ట్, విజయనగరం