This salary is not enough! ఈ వేతనం.. చాలట్లే!
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:41 AM
This salary is not enough! పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వడం లేదు. వీధిదీపాల నిర్వాహకుడు, వాహన డ్రైవర్‌కు అందించే వేతనాల కంటే తక్కువ జీతం ఇస్తున్నారు.
ఈ వేతనం.. చాలట్లే!
పంచాయతీ పారిశుధ్య కార్మికుల్లో నిరాశ
టెండర్ ఆధారంగానే జీతాలు
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లేని వైనం
టెండర్ ఆమోదానికి నేడు ఎస్.కోట సాధారణ సమావేశం
పంచాయతీలన్నింటా ఇదే పరిస్థితి
శృంగవరపుకోట, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):
- శృంగవరపుకోట మేజర్ పంచాయతీలో 36 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి 2026-2027 ఆర్థిక సంవత్సరంలో రోజువారీ కూలి చెల్లించేందుకు ఓ వ్యక్తి రూ.387కు టెండర్ దక్కించుకున్నారు. ఇంతకంటే తక్కువ రూ.369కు టెండర్ వేసిన వ్యక్తి తప్పుకోవడంతో ఇతనికి టెండర్ దక్కింది. ఇదే విధంగా వీధిలైట్లు, పారిశుధ్య వాహన డ్రైవర్‌లకు రోజుకు రూ.500, పార్కు వాచ్‌మాన్‌లకు రోజుకు రూ.420 చొప్పున టెండర్ ద్వారా ఇచ్చేందుకు మంగళవారం సర్పంచ్ గనివాడ సంతోషికుమారి అధ్యక్షతన జరిగే సాధారణ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వడం లేదు. వీధిదీపాల నిర్వాహకుడు, వాహన డ్రైవర్‌కు అందించే వేతనాల కంటే తక్కువ జీతం ఇస్తున్నారు. వీరు ఒక్కరోజు పని చేయకపోతే వీధులు కంపుకొడతాయి. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కానీ వీరు తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. దాదాపు జిల్లాలోని అత్యంత పెద్ద పంచాయతీలుగా వున్న శృంగవరపుకోటతో పాటు కొత్తవలస, చీపురుపల్లిలోనూ ఇదే పరిస్థితి. పంచాయతీలకు వచ్చే ఆదాయం నుంచి వీరికి జీతాలు చెల్లించాల్సి రావడంతో ఈ పరిస్థితి నెలకొంటోంది.
పంచాయతీల వార్షిక ఆదాయం నుంచి 50శాతం లోబడి సిబ్బందికి జీతాలు అందించాలి. శాశ్వత పద్ధతిన పనిచేసే ఉద్యోగులకు నిబంధనల ప్రకారం నిర్దేశించిన జీతాలను చెల్లించాలి. దీంతో కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు అన్యాయం జరుగుతోంది. పంచాయతీలు రోజురోజుకు విస్తరిస్తుండడంతో పెరుగుతున్న కాలనీలు, వీధులకు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల అవసరం పడుతోంది. వీరికి జీతాలు చెల్లించాల్సిరావడంతో ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే పంచాయతీలు ఆదాయాన్ని పెంచుకోవడం లేదు. కేవలం ఇంటి పన్నులు, ఎప్పుడో నిర్మించుకున్న వాణిజ్య సముదాయాల నుంచి వస్తున్న అద్దెలను నమ్ముకొని ఉన్నాయి. కాగా పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఇదే పని అలవాటు పడడంతో గత ఏడాది కంటే రూ.పది తక్కువైనా చేసేదిలేక పనిచేసేందుకు వచ్చేస్తున్నారు. వీరి బలహీనతే టెండర్‌లు వేసే కాంట్రాక్టర్లకు బలంగా మారింది.
- కాంట్రాక్టు కార్మికులకు పంచాయతీ నేరుగా జీతాలు అందించదు. టెండర్ పొందిన కాంట్రాక్టరు ద్వారా వీటిని అందిస్తారు. దీనికి ప్రతి ఏటా మార్చి నెలలో టెండర్‌లు పంచాయతీలు వేస్తున్నాయి. ఎవరు తక్కువ సొమ్ముకు టెండర్‌లు వేస్తే వారికే కాంట్రాక్టు దక్కుతుంది. కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తి తాను వేసిన టెండర్‌కు అనుగుణంగా పంచాయతీ కాంట్రాక్టు కార్మికులకు నెలకు ఒకసారి లెక్క కట్టి జీతాలను ఇస్తుంది. ఆ జీతాలను టెండర్ పొందిన కాంట్రాక్టరు నెలనెలా అందిస్తాడు.
- పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజువారి కూలీ ఉండడం లేదు. దీనికి తోడు వీరికి నెలనెల జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. ఒక్కసారి ఆరు నెలల వరకు బకాయిలు వుంటున్నాయి. కనీసం రెండు నెలల బకాయిలు తప్పకుండా వుంచుతున్నారు. ఓపక్క పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం అందకపోవడంతో పాటు మరో పక్క నెలనెల జీతం ఇవ్వకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోంది.
- పారిఽశుధ్య కార్మికులు చెత్తా, చెదారంతో పాటు ఒక్కోసారి మురుగు కాలువల్లోను చేతులు పెట్టాల్సి వస్తుంది. మురుగు నీరు ప్రవాహం సక్రమంగా లేనప్పుడు సరిదిద్దేందుకు పూర్తిగా వాటిల్లోకి దిగాల్సి వస్తుంది. ఈ సమయంలో రోగాల బారిన పడుతుంటారు. ఇలాంటి వారికి కనీస వేతన చట్టం అమలు కాకపోవడంతో పారిశుధ్య కార్మిక కుటుంబాలు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాయి.