Share News

ఇదో రకం దోపిడీ

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:57 PM

ధాన్యం వ్యాపారులు కొత్త అవతారమెత్తారు.

ఇదో రకం దోపిడీ

- ధాన్యం వ్యాపారుల కొత్త అవతారం

- అనుమతి లేకుండా ఎరువులు, పురుగు మందుల విక్రయాలు

- వారివద్దే కొనుగోలు చేసేలా రైతులతో ఒప్పందం

- మార్కెట్‌ కంటే అధిక ధరకు అమ్మకం

- నకిలీవి అంటగడుతున్న వైనం

- కొందరు సచివాలయ సిబ్బంది సహకారం

మెంటాడ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ధాన్యం వ్యాపారులు కొత్త అవతారమెత్తారు. పంటను తమకు మాత్రమే అమ్మాలనే షరతుతో ఇప్పటికే ఖరీఫ్‌, రబీ సీజన్లలో సాగు ఖర్చుకు రైతులకు అప్పులిచ్చి వడ్డీ, కమీషన్లతో వారి నడ్డివిరుస్తున్న ఆ వ్యాపారులు, ఇప్పుడు అనధికారికంగా ఎరువులు, పురుగు మందుల అమ్మకాలు కూడా మొదలు పెట్టేశారు. మార్కెట్‌ ధరకన్నా 20 నుంచి 30 శాతం వరకు అదనపు రేటుకు వారికి ఎరువులు, పురుగు మందులు అంటగడుతున్నారు. వద్దంటే, ఇకపై పెట్టుబడి ఖర్చులకు అప్పులిచ్చేదిలేదని మెలిక పెడుతున్నారు. ఈ మేరకు ఒప్పందం చేసుకుంటున్నారు. చేసేదిలేక రైతులు అధిక ధరకు వాటిని కొనుగోలు చేస్తున్నారు. హోల్‌సేల్‌ వ్యాపారులు, డీలర్ల నుంచి టోకున ఎరువులు, పురుగు మందులను ధాన్యం వ్యాపారులు కొనుగోలు చేసి, వాటిని తమ ఇళ్లల్లో నిల్వ చేస్తున్నారు. అనంతరం వాటిని రైతులకు అమ్ముతున్నారు. ఏ సమయంలో ఏది ఎంత మోతాదులో వాడాలో కనీస అవగాహన లేకపోయినా, తమకు అంతా తెలుసనేలా నోటికొచ్చింది చెప్పేసి కట్టబెడుతున్నారు. వారి సలహాలు, సూచనలను గుడ్డిగా పాటిస్తున్న రైతులు పంట నష్టానికి గురై మొదటికే మోసం తెచ్చుకుంటున్నారు. ఈ నయా వ్యాపారులు సరఫరా చేసే ఎరువులు, క్రిమిసంహారక మందుల్లో అక్కడక్కడా నకిలీవి కూడా ఉంటున్నాయి. ఈ అనధికారిక అమ్మకాల వల్ల రైతులు తమ వద్ద సరుకులు కొనుగోలు చేయడం లేదని, దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టిన లైసెన్స్‌డ్‌ వ్యాపారులు, డీలర్లు, వాపోతున్నారు. అధికారులకు తెలిసి దాడులు నిర్వహిస్తే స్థానిక రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకుంటున్నారు.

మెంటాడలో ఇలా..

మెంటాడ మండలంలో లైసెన్స్‌డ్‌ వ్యాపారులు 15మంది ఉంటే, అనధికారిక వ్యాపారులు 20 మంది వరకు ఉన్నారు. ఈ నకిలీ వ్యాపారులు రైతుల పట్టాదారు పుస్తకాలను ముందస్తుగా స్వాధీనం చేసుకుంటున్నారు. వాటి ద్వారా ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసే ఎరువులు, పురుగుల మందులను విడిపిస్తున్నారు. అదే విధంగా పొరుగు రాష్ట్రాల్లో తక్కువ ధరకు టోకున కొనుగోలు చేసి తెస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మొత్తం సరుకును ఒకచోట నిల్వచేసి రైతులకు విక్రయిస్తూ నిలువుదోపిడీ చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసిందని చెబుతున్నారు.

- పోలీసుల సహకారంతో వ్యవసాయ అధికారులు ఇటీవల కుంటినవలస గ్రామంలో దాడులు చేశారు. అనుమానిత ప్రాంతంలో సోదాలు నిర్వహించగా, భారీగా ఎరువులు, పురుగు మందుల నిల్వలు బయటపడ్డాయి. సంబంధిత వ్యాపారులపై చర్యలకు సిద్ధమవుతున్న సమయంలో రాజకీయ జోక్యంతో అధికారులు వెనుతిరగాల్సి వచ్చింది. అధికారులకు సహకరించాల్సిన రైతులు కూడా అవి తమవేనని, అందరం కలిసి ఒకేచోట భద్రపరుచుకున్నామని చెప్పారు. దీంతో అధికారులు ఏమీ చేయలేక వారిచ్చిన స్టేట్మెంట్‌ రికార్డు చేసుకొని ఇంటిముఖం పట్టారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం

అనధికార వ్యపారులతో మేము తీవ్రంగా నష్టపోతున్నాం. ఇప్పటికే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలో కలెక్టర్‌కు రాతపూర్వక ఫిర్యాదు చేస్తాం. మేము చిన్న పొరపాటు చేస్తే చర్యలు తీసుకుంటున్న అధికారులు, నకిలీ వ్యాపారులను మాత్రం వదిలిపెడుతున్నారు. ఇది ఎంతవరకు సబబు.

-రవి, లైసెన్స్‌డ్‌ వ్యాపారి, మెంటాడ

రైతులు సహకరించడం లేదు..

మెంటాడ మండలంలో నకిలీ వ్యాపారులతో రైతులు నష్టపోతున్నారు. పోలీసులతో కలిసి జాయింట్‌ ఆపరేషన్‌ చేయబోతే రాజకీయ జోక్యం ఎదురవుతోంది. బంధుప్రీతి, రాజకీయ జోక్యం వలన బాధిత రైతులు కూడా సహకరించడంలేదు.

-గోకుల కృష్ణ, మండల వ్యవసాయాధికారి, మెంటాడ

Updated Date - Sep 11 , 2026 | 11:57 PM