Panchayat Elections మూడో విడత పల్లెపోరు ప్రారంభం
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:55 PM
Third Phase of Gram Panchayat Elections Begins జిల్లాలో మూడో విడత పంచాయతీ పోరు ప్రారంభమైంది. ఈ మేరకు తొలిరోజు శనివారం సర్పంచ్‌లకు 25, వార్డు మెంబర్లకు 37 నామినేషన్లు దాఖలైనట్లు అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ అధికారి జి.పార్వతి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా కొఠియా గ్రూప్‌లోని సారిక పంచాయతీలో సర్పంచ్‌కు ఒకటి, గంజాయిభద్రలో సర్పంచ్‌కు ఒకటి, వార్డు సభ్యులకు మూడు, పట్టుచెన్నూరులో సర్పంచ్‌కు రెండు, వార్డు మెంబర్లకు రెండు నామినేషన్లు వచ్చాయని పేర్కొన్నారు.
సాలూరు, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడో విడత పంచాయతీ పోరు ప్రారంభమైంది. ఈ మేరకు తొలిరోజు శనివారం సర్పంచ్‌లకు 25, వార్డు మెంబర్లకు 37 నామినేషన్లు దాఖలైనట్లు అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ అధికారి జి.పార్వతి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా కొఠియా గ్రూప్‌లోని సారిక పంచాయతీలో సర్పంచ్‌కు ఒకటి, గంజాయిభద్రలో సర్పంచ్‌కు ఒకటి, వార్డు సభ్యులకు మూడు, పట్టుచెన్నూరులో సర్పంచ్‌కు రెండు, వార్డు మెంబర్లకు రెండు నామినేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. పాచిపెంట, మక్కువ, సాలూరు మండలాల్లో ఉన్న పంచాయతీల నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 27 సాయంత్రం మూడు గంటల వరకు ఉపసంహరణ, తర్వాత అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తారు. డిసెంబరు 2న పోలింగ్ నిర్వహించి అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. మొత్తంగా మూడు మండలాల్లో 79 సర్పంచి స్థానాలు, 738 వార్డులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో 1,24,878 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 61,103, మహిళలు 63,773, ఇతరులు ఇద్దరు ఉన్నారు.
పంచాయతీల్లో పటిష్ఠ బందోబస్తు : ఎస్పీ
బెలగాం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడో విడత పల్లెపోరు ప్రారంభమైన నేపథ్యంలో పంచాయతీల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాలు, ఏకగ్రీవమైన పంచాయతీలపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగుతుందన్నారు. అవసరమైన చోట బైండోవర్ నమోదు చేయాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. మూడు దశల్లో పక్కా ప్రణాళికతో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.